నవతెలంగాణ- రామారెడ్డి: ఉమ్మడి రాష్ట్రం లో నీళ్లు, నిధులు, నియామకాలలో అన్యాయం జరుగుతుందని నినాదంతో తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా, లక్షలాదిమంది ఉద్యమకారులుగా తయారై, ఉద్యమానికి ఆర్థికంగా, తమ జీవితాలనే దార పోసి, నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన నాయకుల వెంట ఉండి, తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేవరకు పోరాటం చేసిన, ఉద్యమకారులకు కష్టం వస్తే ఉత్తదేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన గొల్లపల్లి లక్ష్మా గౌడ్ 2021 నుండి తెలంగాణ ఉద్యమ కోసం పోరాడిన ఉద్యమకారుడు, రాష్ట్ర అవతరణ తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. 2021 లో అలంపూర్ జోగులాంబ దేవాలయం నుండి కేసీఆర్ తో పాదయాత్ర తో పాటు, రైలు రోకోలో కేసులను ఎదుర్కొని, కోర్టులో చుట్టూ తిరిగి, తెలంగాణ కోసం పోలీస్ స్టేషన్లో గుండు గీయించుకొని, సొంత పైసలతో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొని, గ్రామాల్లో ఉద్యమం కోసం ప్రజలను ఏకం చేసి, ఉద్యమ బాటలో ముందుండి పోరాటం చేసి, రాష్ట్రం సాకరమైన తరువాత న్యాయం జరుగుతుందని ఆశించిన, ఉద్యమకారులు నమ్ముకున్న పార్టీ, చేసింది ఉత్తదేనని, చివరకు మిగిలింది గుండు సున్నేనని ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత కూతురు ప్రసవానికి, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పట్టించుకోవడంలేదని, ప్రజా ప్రతినిధులను వేడుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదో వార్డులో నివసిస్తున్న లక్ష్మ గౌడ్ ఇంటి పరిసరాల్లో డ్రైనేజీ లేక వర్షానికి ఇంట్లోకి నీళ్లు వస్తుంటే, స్థానిక ఎమ్మెల్యే తో పాటు కలెక్టర్ సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన స్పందన లేదని పేర్కొన్నారు. సర్పంచ్ గా పోటీ చేస్తే పార్టీ నుంచి సహకారం అందలేదని, కష్టపడి సొసైటీ డైరెక్టర్ గా గెలుపొందితే, రైతుల ధాన్యం రైస్ మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని స్థానిక ఎమ్మెల్యే సురేందర్ కు సమాచారం ఇద్దామంటే, మూడు రోజులు ఫోనే లిఫ్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఉద్యమకారునిగా ఆర్థికంగా, మానసికంగా, శేరీరకంగా నష్టపోయిన ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేక కుటుంబం రోడ్డున పడ్డదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలాంటి ఉద్యమకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోరారు.