సనాతన ధర్మంపై నేడు దేశవ్యాప్తంగా చర్చ (రచ్చ) జరుగుతున్నది. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిది స్టాలిన్ అభ్యుదయ రచయితల వర్క్‌షాప్‌లో ‘సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా జబ్బుల లాంటివి. వాటిని నిర్మూలించాల్సిందేనని’ వ్యాఖ్యా నించారు. దీనిపై సాధారణ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త నుండి మొదలుకొని దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కూడా ఘాటుగా స్పందించారు. సనాతన ధర్మం, హిందూ మతం ఒకటేనని, ఆ వ్యాఖ్యలు హిందువులను కించపరిచి నట్లున్నవని వ్యాఖ్యానించడమే కాదు, ఆయోధ్యకు చెందిన ఒక సన్యాసి ఉదయనిధి స్టాలిన్ తల నరికితే రూ.10 కోట్లు సుఫారీ కూడా ప్రకటిం చాడు. ‘నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని’ ఉదయనిధి స్టాలిన్ ఘంటాపథంగా చెప్పారు సనా తన ధర్మంలో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? సనాతన ధర్మంపై కేవలం ఉదయనిది స్టాలిన్ మాత్రమే మాట్లాడారా? ఆయనే మొదటి వాడు కాదు, చివరివాడు కూడా కాదు. సమాజంలో రెండు భిన్నమైన భావాలు నిరంతరం సంఘర్శించుకుంటూనే ఉంటాయి. సనాతన ధర్మంపై కూడా అనేకమంది వాటిని నిర్మూలించాలని చెప్పిన వాళ్లున్నారు. అవి పరమ పవిత్రమైనవని, అవి పది కాలాలపాటు కొనసాగాలని కోరుకునేవారు ఉన్నారు. సనాతన ధర్మమంటే కుల అసమానతలు మనుషుల మధ్య హెచ్చుతగ్గులు కొనసాగాలని కోరుకునే శాశ్వత ధర్మమే సనాతన ధర్మం. అంటే ప్రాచీన ధర్మ మని, అది హిందూ ధర్మమని, అది చాలా పవిత్ర మైనదని దానిని కొనసాగించాలని ఆర్యుల ఆలోచనలు నింపుకున్న ఆరెస్సెస్ వాళ్లు వ్యాఖ్యలు చేయటం చూస్తున్నాం. సనాతన ధర్మంలో సమాత్వం ఉందా? ఈ ధర్మంలో ఎవరి ప్రయోజనాలుంటాయి? సనాతన ధర్మంలో మెజార్టీ ప్రజలకు దక్కే ప్రయోజనాలు ఏమిటి? ఇవి చర్చిం చుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఆసన్నమైంది. సనాత నంలో సమా నత్వం ఉంటే దేశ మంతా పాటించాలి. అన్ని అస మాతలు ఆధి పత్యాలే ఉంటే దానిని సమూలంగా నిర్మూలించాలి. ఈ రచ్చ జరుగు తున్న సమయంలోనే దేశ ప్రధాని సనాతన ధర్మంపై ఆచి తూచి అడుగులు వేయాలని, చరిత్ర లోతుల్లోకి వెళ్ళొద్దని వారి శ్రేణు లకు పిలుపునివ్వడాన్ని చూస్తే అది ఎంతటి అధర్మమో తెలుస్తోంది.
మనుస్మృతి చెబుతున్నదేంటి?
సనాతన ధర్మంలో సతీసహగమనం ఉండేది. వితంతువులకు పునర్వివాహాలు నిషేధించబడ్డాయి. దేవదాసి వ్యవస్థ కొనసాగింది. ఇప్పటికి నిజామాబాద్ మరికొన్ని జిల్లాల్లో జోగిని వ్యవస్థ కనిపిస్తోంది. కులపరమైనటువంటి నిచ్చెన మెట్ల వ్యవస్థ మూడు వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నది. ఏ తల్లి అయినా నవమాసాలు మోసి కంటేనే పుట్టేవాడు మనిషి వాస్తవం కానీ రుగ్వే దంలో 10మండలంలో చెబుతున్నది ఏమిటి? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మనే విభాగ్య శ్యాహ అని చెప్పలేదా? జన్మనే జాయెతా బ్రాహ్మణం కర్మనే జాయెతా శూద్రాణం అని పేర్కొనబడలేదా? తలలో నుండి బ్రాహ్మణులు పుట్టారని, క్షత్రియులు భుజాల నుండి జన్మించారని, వైశ్యులు తొడల నుండి జన్మించారని, శూద్రులు పాదాల కింది నుంచి జన్మించారని చెప్పింది నిజం కాదా? ఇది సనాతన ధర్మంలో లేదు అని చెప్పగలరా? ఈ మను అధర్మ అసమానతలు సనాతన ధర్మంలో లేవని చెప్పగలరా? మనుషులందరు సమానులే అని సనాతన ధర్మంలో ఉందా? సనాతన ధర్మం ప్రకారం కేవలం బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య ప్రయోజనాల కోసమే ఏర్పడ్డది అనేది నూటికి నూరు శాతం నిజం. బ్రాహ్మణులు మాత్రమే వేదాలు విద్య నేర్చుకోవాలని, శూద్రులు విద్య వేదాలకు అనర్హులని, విద్యనభ్యసిస్తే నాలుకలు కోయాలని విద్యను వింటే చెవుల్లో సీసం పోయాలని మనుస్మృతి రెండవ అధ్యాయం 31వ శ్లోకంలో లేదా? శూద్రులను నీచపు పేర్లతో పిలవాలని ఎనిమిదో అధ్యాయం 25వ శ్లోకం చెప్పట్లేదా? శూద్రులు బ్రాహ్మణులను తిడితే నాలుక కోయాలని, కొడితే చేతిని నరకాలని, తంతే కాలు నరికేయాలని రెండో అధ్యాయం 37వ శ్లోకంలో లేదా? ఒక శూద్రుడు అగ్రవర్ణ స్త్రీతో సంభోగిస్తే వాడి అంగం కోయాలని 379, 380 శ్లోకాలలో లేదా? అందుకే కదా కులా ంతర వివాహాలు జరిగితే కుల దురహంకార హత్యలు కొనసాగుతున్నది. ఇవన్నీ సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ల, అవి మా ధర్మంలో లేవని చెప్పగలరా? వేల సంవత్స రాలుగా మానసిక చట్టాలుగా సనాతన ధర్మం కొనసాగుతూ వస్తోంది. శూద్రులు ఆస్తులు కలిగియుండరాదు, శూద్రులు విద్యనభ్య సించరాదు, శూద్రస్త్రీలు ఆభరణాలు ధరించరాదు, శూద్రులు ఆయుధం పట్టకూడదు, శూద్రులు అధికారానికి దూరంగా ఉండాలి ఇవన్నీ మను అధర్మ శాస్త్రంలో పేర్కొన్న అసమానతలను చట్టబద్ధం చేసే శ్లోకాలు. మెజారిటీ ప్రజలపై మైనారిటీలు ఆధిపత్యం చేయటం కోసం సృష్టించబడిన అసమానతల అంటురోగాలు.
శూద్రులపై యుద్ధానికే ఆ మూడు వర్ణాలు
వీటికి వ్యతిరేకంగా లోకాయితులు, చార్వాకులు, గౌతమ బుద్ధుడు, జైనులు, కబీర్ గురునానక్, బ్రహ్మనాయుడు, తుకారాం, అన్నమయ్య, వైష్ణవం, శైవం, రాజా రామ్మోహన్ రారు, కందుకూరి వీరేశలింగం వంటి ఎంతోమంది మహనీ యులు సతీసహగమనంపై సమరం సాగించారు. విచిత్రం ఏమిటంటే సనాతన ధర్మం వల్ల సర్వం కోల్పోయిన క్షుద్రులే సనాతన ధర్మం చాలా గొప్పదని పరమ పవిత్రమైందని వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం. సనాతన ధర్మం వల్ల సంపద కూడా పెట్టుకున్న ఆ పైమూడు వర్ణాలు శూద్రుల చేతనే శూద్రులపై యుద్ధం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. సనాతన ధర్మం చాలాగొప్పది అనేవారు ఆ సనాతన ధర్మాన్ని ఎవ్వరు పాటించడం లేదు. ఆ ధర్మాన్ని పాటిస్తే శూద్రులకు ఆస్తులే ఉండకూడదు. కాబట్టి మన రాష్ట్రంలో దేశంలో ఉన్న అగ్రకులాలుగా పిలవబడుతున్న కమ్మ, రెడ్డి, వెలమ ఈ తరగతులు కూడా భూమికి అనర్హులు. కేవలం పై మూడు వర్ణాలకు ఎట్టి చేయటం కోసం పుట్టిన వాళ్లే శూద్రులు అనేది సనాతన ధర్మంలో ఉంది కదా! ఇటీవల ఒక సినీ నటుడు రామ్‌చరణ్ తేజ్ సనాతన ధర్మంపై ఘాటుగా స్పందించారు. సనాతన ధర్మం ప్రకారంగా రామ్‌చరణ్ తండ్రి చిరంజీవి వారి పూర్వీకులైన తూర్పు కాపులు శూద్రులే… వారు కేవలం వ్యవసాయం చేస్తూ జీవించాలి. కానీ సినిమా ఫీల్డ్‌లో హీరోలుగా ఎందుకు చలామణి అవుతున్నారు? మీరు సినిమాలో హీరోలుగా ఉన్నారంటే అది రాజ్యాంగ ధర్మం కల్పించిన హక్కేగాని సనాతన ధర్మం కాదు. చివరికి జబర్దస్త్‌లో ఉండే యాంకర్ బ్రాహ్మణ యువతి రష్మీ కూడా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళు, తమ రిజర్వేషన్లను అక్కడే వదిలి పెట్టి వేరే మతాల్లో కలవండని ఆమె సెలవిచ్చారు. ఈ దేశంలో అసలు రిజర్వేషన్లు ఎవరు అనుభ విస్తున్నారు, కొసరు రిజర్వేషన్లు ఎవరు అనుభవిస్తున్నారు ఇది ఇప్పుడు జరగాల్సిన చర్చ. వేల సంవత్సరాలుగా మీ తాతల తండ్రుల కాళ్లు శూద్రులుగా పుట్టినటువంటి వాళ్లు కడగాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది? మొత్తం శూద్రులు సంపాదించిన సంపాదనలో మెజార్టీ వాటా మీకే ఎందుకు దక్కుతుంది? దేశంలోని బడా కోటీశ్వరులలో అత్యధికులు బ్రాహ్మణ సామాజిక తరగతికి చెందిన వాళ్లే ఎందు కున్నారు? అగ్రకులాలుగా పిలవబడుతున్న రెడ్డి, కమ్మ, వెలమ మొదలుకొని అట్టడుగు పేదలైనటువంటి బలహీన వర్గాలు దళితులు ఆ 169 శతకోటీశ్వరులలో ఒక్కరైనా ఎం దుకు లేరు? సనాతన ధర్మమంటే ఆర్థిక సమానతలు సృష్టించి వాటిని పది కాలాల పాటు కొనసాగింపచేయడమే.
సమతాస్ఫూర్తి సాక్షిగా అసమానతలు
ప్రతిరోజు ప్రవచనాలు, సుద్ధులు చెప్పే చినజీయర్ స్వామి మాట్లాడిన మాటలేంటి? ‘కుల వ్యవస్థను కొనసాగించాల్సిందే. అంటరానితనం శాశ్వతంగా వర్థిల్లాలి. మనుషులందరూ సమానం కాదు, ఒక మనిషి దేహానికి కాళ్లు రెక్కలు లాగా కులాలు ఉండాల్సిందే’ అని ఘంటాపథంగా సనాతన సంరక్షకుడిగా చెప్పలేదా? కుల అసమానతల్ని కొనసాగిం చడమే సనాతన ధర్మం అని చినజీయర్ స్వామి మాట్లాడారు. ఆయన ముచ్చింతలలో నిర్మించిన రామనుజాచార్యుల విగ్రహం ఆవిష్కరించిన అనంతరం అక్కడ పనిచేయటానికి కావలసిన ఉద్యోగాలలో సనాతన ధర్మం ప్రకారమే దళితులు మల మూత్రాలు ఎత్తిపోసేటువంటి వాళ్లుగా మరుగుదొడ్లు మూత్రశాలలు శుభ్రం చేసి చోటా దళితులు ఉండాలని చెప్పారు. ఇది సనాతన ధర్మం కాదా? సమాతమూర్తి అని ఓ వైపు చెబుతూ మరోవైపు ఎందుకు ఈ అసమానతలు అవ మానాలు. ఇది ఏ ధర్మం సమతా భావం నింపాల్సిన సమానత్వ సమతావాదీ దగ్గర ఏమిటి అసమానతలు చినజీయర్ బదులిస్తాడా? అడవి బిడ్డలు ఆదివాసీలు పూజిం చుకునే సమ్మక్క, సారలమ్మను వాళ్లు దేవతలు కాదు వ్యాపారం కోసం వెలేసినటువంటి వాళ్లు అని చెప్పినప్పుడు, మెజారిటీ ఆదివాసీలను మనోభావాలు దెబ్బతీసినప్పుడు, ఇది ఏ ధర్మం నుండి వచ్చిన వచ్చిన వ్యాఖ్యలుగా చూడాలి. పశువుల్ని ప్రేమించి మనుషుల్ని హత్యగావించే సంస్కృతి ఏ ధర్మంలో భాగం. ఒక పశువు చనిపోతే ఊరేగింపు చేసుకుంటా తీసుకెళ్లడం, ఒక దళితుడు చనిపోతే ఊర్లోకి శవాన్ని కూడా రానీయ్యకపోవడం ఏ సంస్కృతిలో భాగం. దళితులను గుడిలోకి రానీయకపోవటం బడిలో చదవనీయకపోవడం, రచ్చబండల మీద కూర్చోనీయక పోవడం, బతకమ్మలు ఆడనీయకపోవడం, బోనమెత్తితే దాడి చేయడం, జమ్మి చెట్టు ఆకు తెంపితే దాడి చేయడం, ఇల్లు కిరాయికి ఇవ్వకపోవడం ఇవ్వన్నీ ఏ ధర్మం కిందికి వస్తాయి? కర్నాటక వాటర్ ట్యాంక్ నల్లా నీళ్లు ఓ దళిత మహిళ ముట్టుకున్నదని ఆవు మూత్రం ఆవు పేడ కలపడం, దేశ ప్రధానిమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో దళిత యువకుడు గుర్రమెక్కాడని దాని మీద నుంచి కింద పడేసి కొట్టి చంపడం ఏ ధర్మం కిందికి వస్తుంది. ఓ దళితుడు పెండ్లి చేసుకొని తన స్వగ్రామంలో ఎందుకు అనర్హుడు ఊరేగింపు చేసుకోవడానికి హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన గత్యంతరం ఎందుకొచ్చింది. తాను పుట్టిన ఊరిలో ఊరేగింపు చేసుకునే హక్కు ఓ దళితుడికి ఉండదా? ఉత్తరప్రదేశ్‌లో దళిత యువతిపై నలుగురు బ్రాహ్మణ రాజపుట్ కులానికి చెందిన దుండగులు గ్యాంగ్ రేప్‌నకు పాల్పడి, హత్య చేస్తే వారిని పవిత్రులుగా భావించి పూలదండలు వేసి ఊరేగింపు చేసిన సంస్కృతి ఏ ధర్మం చెప్పాలి?
అధిపత్యాన్ని పెంచిపోషించేది సనాతన ధర్మం
రోజూ ‘భారత్ మాతాకీ జై’ అని గొంతు చించుకునే దేశ భక్తులు మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు ఆదివాసీ మహిళలను నగంగా ఊరేగింపు చేసిన నీచత్వాన్ని ఎందుకు ఖండించ లేదు? ఆ అమానవీయ దుశ్చర్యను ఏ ధర్మంగా చెప్పాలి? మూఢ విశ్వాసాలు అశాస్త్రీయ అసమానతలను ప్రశ్నించి నందుకు కల్బుర్గి, దబోల్కర్, ఫన్సారే, గౌరీ లంకేష్ వంటి మేధా వుల్ని చంపింది ఏ ధర్మం కిందకు వస్తుంది? ఆవు మాంసం తిన్నాడని దాడులు చేయటం హత్యలు చేయడం ఏ ధర్మం కిందకు వస్తుంది? అట్ట డుగు పేదల హక్కుల్ని అణిచి వేసి, అసమానతలు పెంచి ఆధిపత్య శక్తులు, పెటు ్టబడిదారి వర్గాలకు ఆస్తులు కూడపెట్టేటువంటి సనాతన ధర్మం దేశానికి అవసరమా? చట్టం ముందు అందరూ సమానులేనని కుల, మత ప్రాంత, లింగ బేధం లేకుండా మనుషులందరూ సమా నమే అని చాటిన రాజ్యాంగ ధర్మం దేశానికి కావాలా నేటితరం మనసు పెట్టి ఆలోచించాలి. నిచ్చెన మెట్ల లాంటి కుల వ్యవస్థను వేల సంవత్సరాలుగా కొనసాగిస్తూ అవమానాలు అత్యధికులు భరించే విధంగా, కొద్దిమంది ఆధిపత్యం చెలాయించే విధంగా చూస్తున్న సనాతన ధర్మం దేశానికి పనికివ స్తుందా? సనాతన ధర్మంలో సర్వ సంపదలన్నీ ఆధిపత్యశక్తులకే ఉంటా యని చెప్పలేదా ఇన్నేళ్లుగా ఇదే జరుగుతుంది కదా! ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ జీ-20 సమావేశాలలో దేశంలో కొనసాగుతున్న సనాతన ధర్మం వల్ల దేశం ఎలా ముందుకు పోయిందో ఎందుకు వివరించలేకపోయారు. కులవ్యవస్థ వల్ల దేశానికి జరిగిన ప్రయోజనమేంటో ఎందుకు చెప్పలేక పోయారు? మహిళా అణిచివేత, మహిళలను మనుషులుగా చూడని తమ సనాతన ధర్మం గొప్పతనాన్ని ఎందుకు ప్రపంచ ప్రజానీకానికి చెప్పలేక పోయారు.మంచిదైతే వివరించాలి కదా!
సనాతన ధర్మం అంటే ఆధిపత్యం చెలాయించడం, అసమానతలను సుస్థిరం చేయడం, అవమానాల్ని, అన్యాయాలను, అబద్దాలను పెంచి పోషించడం. నేటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆకాశామంత(చంద్రయాన్3) ఎత్తు ఎదిగిన తర్వాత కూడా, మధ్యయుగాల కాలం నాటి మూఢవిశ్వాసాలను పరమ పవిత్రంగా భావించడం సిగ్గుచేటు. సనాతన పాటించడమంటేనే పైన చెప్పిన మూడు వర్ణాలు లబ్ధి పొందడం కోసం, తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను సుస్థిరం చేయడం కోసం జరుగుతున్న రచ్చ. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు సమాజ అభివృద్ధికి, సామాజిక న్యాయానికి, సమానత్వానికి దోహదం చేస్తాయి. ఆయనకు అందరూ మద్దతివ్వాలి.
టి. స్కైలాబ్ బాబు
9177549646