– ఇజ్రాయిల్ దుశ్చర్యలకు బీజేపీ ప్రభుత్వ బాసట
– వేలాది మంది సమిధలవుతుంటే ప్రేక్షక పాత్ర
– ప్రపంచ దేశాలలో దిగజారుతున్న భారత్ ప్రతిష్ట
పాలస్తీనాలో ఇంతటి దమనకాండ కొనసాగుతున్నప్పటికీ మోడీ ప్రభుత్వం మాత్రం ఇజ్రాయిల్‌కే బాసటగా నిలుస్తోంది. ఈ వైఖరి పశ్చిమాసియాలో అనేక ప్రశ్నలు లేవనెత్తేందుకు అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా పాలస్తీనా ప్రజలు, దేశంలోని ప్రజాస్వామ్యవాదులు సంధిస్తున్న ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వ వైఖరి కారణంగా పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికాలోని పౌర సమాజంలో దేశ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. అయినప్పటికీ ఇదేమీ మోడీ సర్కారుకు పట్టడం లేదు. హమాస్ దాడులు జరిగిన తర్వాత మోడీ ఓ ప్రకటన చేస్తూ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ దానిని భారత్ వ్యతిరేకిస్తుందని చెప్పారు. అయితే అదే సమయంలో దశాబ్దాల తరబడి ఇజ్రాయిల్ సాగిస్తున్న హింసను ఆయన విస్మరించారు. అటు ఇజ్రాయిల్ ఇటు ఇండియా ఇరు దేశాల్లో ప్రభుత్వాల పట్ల ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. దీని నుండి బయటపడటానికి నేతలు ఇద్దరూ ఈ యుద్ధాన్ని ఒక అవకాశంగా వాడుకుంటున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
న్యూఢిల్లీ : హమాస్ మిలిటెంట్ల ఏరివేత పేరుతో పాలస్తీనీయులపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణకాండ విషయంలో భారత ప్రభుత్వ వైఖరి అమానుషంగా ఉంది. ఏడు దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయిల్ దాడులను సమర్ధిస్తూ మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఒకవైపు ఇజ్రాయిల్ దళాలు పాలస్తీనాలో మానవ హక్కులను కాలరాస్తూ, వైమానిక దాడులతో నగరాలను నామరూపాలు లేకుండా చేస్తూ, భవనాలను నేలమట్టం చేస్తూ ప్రజలను… చివరికి చిన్నారులను సైతం పెద్ద సంఖ్యలో పొట్టన పెట్టుకుంటున్నాయి. పాలస్తీనా ప్రజలు ఆహారం, తాగునీరు, మందుల కోసం అలమటిస్తుంటే వారికి ఆ నిత్యావసరాలు అందకుండా అడ్డుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నాయి. పాలస్తీనీయులు విద్యుత్ సౌకర్యం కూడా లేక గాడాంధకారంలో బిక్కుబిక్కుమంటూ భయంతో కాలం గడపాల్సిన దుస్థితిలో సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఈ కేంద్ర ప్రభుత్వం గడపాల్సిన దుస్థితిలో సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు.
పాలస్తీనా- ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని వివిధ కోణాల నుండి పరిశీలిం చాల్సిన అవసరం ఉంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి వెనుక రాజకీయ ప్రయోజ నాలు ఉన్నాయన్న విషయం సుస్పష్టం. పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణలు ప్రారంభం కాగానే హిందూత్వ వాదులు పెద్ద సంఖ్యలో ఇజ్రాయిల్‌కు మద్దతుగా సామాజిక మాధ్యమాలలో సందేశాలు పెట్టారు. పనిలో పనిగా అనేక ఆంగ్ల, హిందీ వార్తా ఛానల్స్ అత్యుత్సాహంతో యుద్ధ వార్తల సేకరణ కోసం తమ పాత్రికేయులను ఇజ్రాయిల్‌కు పంపా యి. సామాజిక మాధ్యమాలలో వచ్చే కథనాలు సరే సరి. ప్రధాన స్రవంతి మీడియా కూడా పనిగట్టుకొని ఇజ్రాయిల్‌కు మద్దతుగా ప్రచారం సాగిస్తోంది. మణిపూర్ మారణహోమం మాత్రం ఈ మీడియాకు పట్టడం లేదు. పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలకే భారతీయ ఛానల్స్ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమే మంటే ఈ మీడియా సంస్థలన్నీ మోడీ, బీజేపీలకు వంత పాడుతున్నాయి. కేంద్రం తీసుకున్న వైఖరి సరైనదేనంటూ కితాబు ఇస్తున్నాయి.
మారిన విదేశాంగ విధానం
పాలస్తీనా విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిలో మోడీ ప్రభుత్వం మార్పు తీసుకొచ్చింది. 1930లలో ఘర్షణలు ప్రారంభమై నప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలస్తీనా వాదనలను సమర్ధించింది. తద్వారా మన దేశంలో నివసిస్తున్న ముస్లింల మనోభావాలను గౌరవించింది. 1980లలో రాజీవ్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఇజ్రాయిల్‌తో ఆయన బలమైన సంబంధాలు నెలకొల్పారు. అయినప్పటికీ పాలస్తీనా ఏర్పాటుపై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. మోడీ ప్రధాని అయిన తర్వాత పాలస్తీనాలో పర్యటించారు కూడా. అయితే ముస్లింల మనోభావాలను ఆయన ఎన్నడూ గౌరవించిన పాపాన పోలేదు. బీజేపీకి కావాలంటే హిందువుల ఓట్లు ముస్లిం వ్యతిరేకతే ఆధారం అని ఆయనకు తెలుసు. కాబట్టి ఇజ్రాయిల్‌కు బాసటగా నిలుస్తున్నారు.
ఓటర్లపై ప్రభావం ఉంటుందా?
ప్రజల మద్దతు పొందడంలో సైద్ధాంతిక పోరు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇజ్రాయిల్- పాలస్తీనా ఘర్షణలు భారత ఓటర్లపై ప్రభావం చూపుతాయా లేదా అన్నది మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. సామాజిక మాధ్యమాలలో మాత్రం దీని ప్రభావం బలంగానే ఉండవచ్చు. ఏదేమైనా భారత ఓటర్లు విజ్ఞులు. ఏ పార్టీ విధానం ఏమిటో, రాజకీయ లబ్ది కోసం దేశ ప్రయోజనాలను ఎవరు తాకట్టు పెడతారో, ఎవరు దేశ ప్రయోజ నాలను పరిరక్షిస్తారో వారికి బాగా తెలుసు. చిల్లర, సంకుచిత రాజకీయాలను ఓటర్లు ఛీకొడతారన్న వాస్తవం గతంలో పలు సందర్భాలలో రుజువైంది.
హిందూత్వ ఎజెండాతో ముందుకు…
ఒక్క మాటలో చెప్పాలంటే పాలస్తీనా-ఇజ్రాయి ల్ ఘర్షణలను బీజేపీ తనకు అనుకూలంగా మలచు కుంటోంది. శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే. మొన్నటి వరకూ దేశంలో కులగణన ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. పశ్చిమా సియా పరిణామం పుణ్యమా అని అది ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడో ఐదు వేల కిలోమీటర్ల దూరంలో జరుగు తున్న పాలస్తీనా, ఇజ్రాయిల్ ఘర్షణల పైనే చర్చ జరుగుతోంది. హిందూత్వ ఎజెండాను మరింత ముందుకు తీసి కెళ్లేందుకు, ‘జాతీయ భద్రత’ అనే పాచిక వేసేందుకు ఈ ఘర్షణలను బీజేపీ ఉపయో గించుకుంటోంది. ఉదాహరణకు హమాస్ దాడి ప్రారంభమైన మరు నాడే బీజేపీ ఓ ట్వీట్ చేసింది. యూపీఏ ప్రభుత్వ పాలనలో ఇస్లామిక్ ఉగ్రవాద దాడులు జరిగిన విషయాన్ని అందులో ప్రస్తావిం చింది. అప్పటి నుండీ బీజేపీ తన పాచికలు వేస్తూనే ఉంది. పాలస్తీనాకు మద్దతు తెలిపిన ఓ ముస్లిం మత గురువును ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దానికి ముందే పాలస్తీనాకు మద్దతు గా ప్రదర్శన నిర్వహించినందుకు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులపై కేసులు పెట్టారు. పాలస్తీనాకు మద్దతుగా నిలిచే వారిని విచారించి, కేసులు పెట్టాలని సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసులకు హుకుం జారీ చేశారు.