– తెలంగాణ షూటర్‌కు రెండు రజతాలు
– 50మీ రైఫిల్ 3పీలో ప్రపంచ రికార్డుతో పసిడి
– సాకేత్, రామ్‌కుమార్‌లకు సిల్వర్ మెడల్
– హాంగ్జౌ ఆసియా కీడలు 2023
నవతెలంగాణ-హాంగ్జౌ
హాంగ్జౌలో టీమ్ ఇండియా షూటర్ల గురి తప్పటం లేదు. వరుసగా పతకాలు కొల్లగొడుతున్న మన షూటర్లు.. 2006 దోహా ఆసియా క్రీడల్లో నెలకొల్పిన 14 మెడల్స్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టారు. తెలంగాణ స్టార్ ఇషా సింగ్ రెండు మెడల్స్‌తో మెరువగా.. పాలక్ పసిడి సొంతం చేసుకుంది. మెన్స్ విభాగంలోనూ ప్రపంచ రికార్డుతో పసిడి పతకంతో పాటు మరో సిల్వర్ మెడల్ సొంతమైంది. టెన్నిస్‌లో వెండి, స్క్వాష్‌లో కాంస్యం సాధించిన టీమ్ ఇండియా.. ఓవరాల్‌గా 33 మెడల్స్‌తో పతకాల పట్టికలో నాల్గో స్థానానికి చేరుకుంది.
తెలంగాణ స్టార్, భారత వర్థమాన షూటర్ ఇషా సింగ్ మళ్లీ మెరిసింది. బుధవారం 25 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు విభాగంలో గోల్డ్, వ్యక్తిగత విభాగంలో వెండి సాధించిన ఇషా సింగ్.. ఓ విరామం అనంతరం మరో రెండు పతకాలు కొల్లగొట్టింది. దీంతో ఆసియా క్రీడల చరిత్రలో నాలుగు పతకాలు సాధించిన తొలి షూటర్‌గా ఇషా సింగ్ చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన పోటీల్లో తొలుత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం జట్టు ఈవెంట్‌లో ఇషా సింగ్ సిల్వర్‌తో మెరిసింది. పాలక్, దివ్య సుబ్బరాజు జతగా జట్టు విభాగంలో ఇషా సింగ్ సత్తా చాటింది. పసిడి వేటలో ఇషా సింగ్ వరుసగా 95, 97, 95, 99, 97, 96 స్కోరు నమోదు చేసింది. పాలక్ 97, 97, 96, 95, 96, 96 స్కోర్లతో మెరువగా.. దివ్య సుబ్బరాజు 95, 97, 95, 99, 93, 96 స్కోర్లు సాధించింది. ఓవరాల్‌గా 1731 పాయింట్లు సాధించిన భారత్ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. 1736 పాయింట్లతో చైనా అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం దక్కించుకోగా.. చైనీస్ తైపీ 1723 పాయింట్లతో కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. ఇక 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. పాలక్ పసిడి పతకం నెగ్గగా.. ఇషా సింగ్ వెండి పతకం సాధించింది. అర్హత రౌండ్‌లో పాలక్ 577 పాయింట్లతో ఏదో స్థానంలో నిలువగా.. ఇషా సింగ్ 579 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఇక పతక వేటలో పాలక్ 242.1 పాయింట్లతో ఆసియా క్రీడల రికార్డు నమోదు చేసి పసిడి పతకం సాధించింది. 239.7 పాయింట్లతో ఇషా సింగ్ వెండి పతకం దక్కించుకుంది. పాకిస్థాన్ అమ్మాయి ఇషామాలె 218.2 పాయింట్లతో కాంస్యంతో సరిపెట్టుకుంది.
ప్రపంచ రికార్డుతో పసిడి : మెన్స్ విభాగంలోనూ షూటర్లు అదరగొట్టారు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్‌లో భారత్ పసిడి పతకం కొల్లగొట్టింది. ఐశ్వరీ ప్రతాప్ సింగ్, స్వప్నిల్ కుశాలె, అఖిల్ షియోరాన్ త్రయం తొలి సిరీస్ నుంచీ ముందంజ వేసింది. ప్రతాప్ సింగ్ వరుస సిరీస్‌ల్లో 292, 297 పాయింట్లు సాధించగా.. స్వప్నిల్ 296, 297 పాయింట్లు.. అఖిల్ 295, 292 పాయింట్లు గురి పెట్టారు. ఓవరాల్‌గా 1769 పాయింట్లు సాధించిన మనోళ్లు.. అమెరికా 2022 పెరూలో నెలకొల్పిన 1761 పాయింట్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. అమెరికా షూటర్లు నెలకొల్పిన రికార్డును ఎనిమిది పాయింట్లు మెరుగుపర్చిన మనోళ్లు.. పసిడి పతకం దక్కించుకున్నారు. 1763 పాయింట్లతో చైనా సిల్వర్ మెడల్, 1748తో దక్షిణ కొరియా కాంస్య పతకం సాధించాయి. ఇక మెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ విభాగం వ్యక్తిగత ఈవెంట్‌లోనూ భారత్‌కు పతకం దక్కింది. అర్హత రౌండ్‌లో స్వప్నిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్‌లు ఫైనల్స్‌కు అర్హత సాధించారు. క్వాలిఫికేషన్‌లో అఖిల్ షియోరాన్ 587 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచినా.. ఓ దేశం నుంచి గరిష్టంగా ఫైనల్స్‌కు ఇద్దరు మాత్రమే అర్హత సాధించగలరు. దీంతో మెరుగైన స్థానాల్లో నిలిచిన స్వప్నిల్, ఐశ్వరీలు పతక పోరుకు చేరుకున్నారు. ఫైనల్లో ప్రతాప్ సింగ్ తోమర్ మెరిశాడు. 459.7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. 438.9 పాయింట్లు సాధించిన స్వప్నిల్ కుశాలె నాల్గో స్థానంలో నిలిచి పతకానికి అడుగు దూరంలో ఆగిపోయాడు. చైనా కుర్రాడు 460.6 పాయింట్లతో ఆసియా క్రీడల రికార్డు స్కోరుతో పసిడి పతకం సాధించాడు. చైనా షూటర్‌కే 448.3 పాయింట్లకు కాంస్య పతకం లభించింది. ఆసియా క్రీడల్లో శుక్రవారం పోటీల్లో భారత్ షుటింగ్‌లోనే ఏకంగా ఐదు పతకాలు సొంతం చేసుకుంది.
సాకేత్, రామ్‌కుమార్‌కు సిల్వర్ : టెన్నిస్‌లో సాకేత్ మైనేని, రామ్‌కుమార్ రామనాథన్ జోడీ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్ ఫైనల్లో పసిడి వేటలో మనోళ్లు తడబడ్డారు. 4-6, 4-6తో వరుస సెట్లలో చైనీస్ తైపీ జోడీ చేతిలో ఓటమి చెందారు. చైనీస్ తైపీ జంట పసిడి సాధించగా.. రామ్‌కుమార్, సాకేత్ జోడీ వెండి పతకం సొంతం చేసుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, రుతుజ జంట ఫైనల్లో అడుగుపెట్టింది. 6-1, 3-6, 10-4తో చైనీస్ తైపీ జోడీపై విజయం సాధించిన మనోళ్లు పసిడి వేటకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా, స్క్వాష్‌లో భారత్‌కు మహిళల జట్టు తొలి పతకం అందించింది. మహిళల జట్టు విభాగంలో సెమీఫైనల్లో టీమ్ ఇండియా పరాజయం పాలైంది. హాంగ్‌కాంగ్ 2-1తో భారత్‌పై గెలుపొంది ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో పోరాడిన మన అమ్మాయిలు కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. స్క్వాష్ మెన్స్ జట్టు కనీసం రజతం ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మలేషియాపై 3-1తో గెలుపొందిన భారత్ ఫైనల్లోకి చేరుకుంది. 11-8, 11-6, 10-12, 11-3తో మలేషియాను మనోళ్లు చిత్తు చేశారు. పసిడి పోరులో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.