విశ్వగురుకు ఇస్లాం ఫోబియా

Islam phobia for Vishwaguru– మారిన ప్రచార సరళి
– ప్రారంభంలో వికాస్‌, విశ్వగురు, వికసిత్‌ భారత్‌ ప్రస్తావనలు
– ఇప్పుడేమో మత సమీకరణకు ప్రయత్నాలు
– హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు ఎత్తుగడలు
– కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో విడుదల తర్వాత రూటు మార్చిన మోడీ
న్యూఢిల్లీ : మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి 20 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రచారంలో ఎక్కువగా వికాస్‌, విశ్వగురు, వికసిత్‌ భారత్‌ వంటి పదాలను ఉపయోగించారు. కాంగ్రెస్‌ కుటుంబ పాలనపై విమర్శలు చేశారు. అయితే గత నెల ఐదున కాంగ్రెస్‌ తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసినప్పటి నుంచి ఆయన ప్రచార సరళి మారిపోయింది. హిందూ-ముస్లింలకు సంబంధించిన అంశాలు, సంపద పున:పంపిణీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్‌ చేస్తున్న ప్రయత్నాలు వంటి విషయాలపైనే మోడీ దృష్టి కేంద్రీకరించారు. తద్వారా హిందూ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. మార్చి 17 నుంచి ఈ నెల 15 వరకూ మోడీ చేసిన 111 ఎన్నికల ప్రసంగాలను ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పత్రిక విశ్లేషించింది. ప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామని ఆయన 45 చోట్ల చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని కేవలం ఐదు సందర్భాల్లో మాత్రమే ప్రస్తావించారు.
మార్చి 10-ఏప్రిల్‌ 5 మధ్య…
మార్చి10-ఏప్రిల్‌ 5 తేదీల మధ్య మోడీ పది ప్రసంగాలు చేశారు. కాంగ్రెస్‌, అవినీతి, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి వంటి అంశాలను అన్ని చోట్లా లేవనెత్తారు. పేదలు, మహిళలను గురించి తొమ్మిది సభల్లో మాట్లాడారు. ఎనిమిది చోట్ల విశ్వగురు, ఏడు చోట్ల మోడీ కీ గ్యారంటీలు, ఆరు చోట్ల రామమందిరంపై ప్రసంగించారు. ఇతర ప్రతిపక్షాలపై ఏడు చోట్ల విమర్శలు చేశారు.
ఏప్రిల్‌ 6-20 మధ్య…
ఏప్రిల్‌ 6-20 తేదీల మధ్య ప్రధాని మోడీ 34 సభల్లో మాట్లాడారు. కాంగ్రెస్‌పై యథావిధిగా 32 చోట్ల విమర్శలు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేశామంటూ 32 సభల్లో చెప్పారు. ప్రభుత్వ పథకాలను 31 సభల్లో ఏకరువు పెట్టారు. మోడీ కీ గ్యారంటీలను 28 చోట్ల ఇచ్చారు. ప్రతిపక్షాల అవినీతిని 27 చోట్ల ప్రస్తావించారు. రామమందిర నిర్మాణ అంశాన్ని 26 సభల్లో లేవనెత్తారు. ఇతర ప్రతిపక్షాలను 27 చోట్ల విమర్శించారు.
తొలుత పథకాలు, అభివృద్ధి పైనే ప్రచారం
మార్చి 17-ఏప్రిల్‌ 5 తేదీల మధ్య చేసిన 10 ప్రసంగాల్లో మోడీ ప్రధానంగా కేంద్ర పథకాలు, ప్రతిపక్షాల అవినీతిపై దృష్టి సారించారు. మార్చి 16న ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి ఏప్రిల్‌ 5న కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోను విడుదల చేసే వరకూ ప్రధాని ప్రసంగాల్లో సంక్షేమ పథకాలు, బీజేపీ అభివృద్ధి ప్రధానాంశాలు అయ్యాయి. పది ప్రసంగాల్లోనూ ఈ అంశాలనే ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలో భారత్‌ విశ్వగురుగా ఆవిర్భవించిందని ఎనిమిది సభల్లో చెప్పారు. ఈ కాలంలోనే ఆయన కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలపై విమర్శలు సంధించారు. ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు అవినీతి, బంధుప్రీతిలో కూరుకుపోయాయని, దుష్పరిపాలనను అందిస్తున్నాయని ఆరోపించారు. అన్ని సభల్లోనూ ప్రతిపక్షాలపై విమర్శలు, ఆరోపణలు చేశారు. అంతేకాదు… ‘400 ప్లస్‌’ నినాదాన్ని మొదలు పెట్టారు. రామమందిర నిర్మాణం బీజేపీ సాధించిన విజయంగా చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్‌ను బద్నాం చేసే ప్రయత్నం
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమంటే రెండో దశ నుంచి ఐదో దశ పోలింగ్‌ జరిగే వరకూ మోడీ తన ప్రసంగాల్లో హిందూ-ముస్లిం వ్యాఖ్యలు చేశారు. ముస్లిం ఓటు  బ్యాంకుకు ప్రయోజనం చేకూర్చేలా సంపద పున:పంపిణీ ప్రతిపాదనను కాంగ్రెస్‌ ముందుకు తెచ్చిందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను హరించాలని చూస్తోందని ఆరోపణలు  చేశారు. ఏప్రిల్‌ 21-మే 15 మధ్య చేసిన 67 ప్రసంగాల్లో 60 సందర్భాల్లో మోడీ మతపరమైన వ్యాఖ్యలు చేసి, హిందూ ఓట్ల సమీకరణకు ప్రయత్నించారు.
ఈ విషయాలు కూడా…
గత దశాబ్ద కాలంలో దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసేందుకు తన ప్రభుత్వం ప్రయత్నించిందని మోడీ తన ఎన్నికల ప్రచార సభల్లో తెలిపారు. నీటి ఆయోగ్‌ అంచనాల ప్రకారం మోడీ తన ప్రసంగాల్లో 69 చోట్ల రైతులు, 56 చోట్ల యువత, 81 చోట్ల మహిళల ప్రస్తావన తెచ్చారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు సబ్సిడీ సిలిండర్లు, లోక్‌సభలో 33 శాతం రిజర్వేషన్లు, డ్రోన్‌ దీదీ కార్యక్రమం వంటి వాటిని గురించి వివరించారు.
ఇప్పుడు మతపరమైన వ్యాఖ్యలు
ఏప్రిల్‌ 21-మే 15 తేదీల మధ్య మోడీ తన ప్రసంగాల్లో మతపరమైన వ్యాఖ్యలు అధికంగా చేశారు. సంపద పున:పంపిణీ, మత రిజర్వేషన్లు వంటి అంశాలను పదేపదే లేవనెత్తారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, రామమందిరం వంటి ప్రస్తావనలూ తెచ్చారు. అయితే ఈ కాలంలో చేసిన 67 ప్రసంగాల్లో ‘400 ప్లస్‌’ అనే పదం కేవలం 16 సందర్భాల్లో మాత్రమే వినిపించింది. ఏప్రిల్‌ 21న రాజస్థాన్‌లోని బన్‌స్వారాలో మోడీ చేసిన ప్రసంగం మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగింది. ముస్లింలను ‘చొరబాటుదారులు, అధిక సంతతి కలిగిన వారు’ అంటూ తూలనాడారు. మోడీ తన 111 ప్రసంగాల్లో చొరబాటుదారులు అనే పదాన్ని 12 చోట్ల ఉపయోగించారు. అనేక సభల్లో హిందూ మహిళల ‘స్త్రీ ధనం’ (మంగళసూత్రం) అనే మాట వాడారు. కాంగ్రెస్‌ పార్టీ వాటిని గుంజుకొని, ముస్లింలకు అప్పగించాలని చూస్తోందని 23 సభల్లో ఆరోపించారు.
మధ్యలో ప్రతిపక్షాలపై విమర్శలు, ఆరోపణలు
ఏప్రిల్‌ 6-20 తేదీల మధ్య చేసిన ప్రసంగాల్లో మోడీ తొలిసారిగా కాంగ్రెస్‌ది ‘ముస్లింలీగ్‌ మ్యానిఫెస్టో’ అని ఆరోపించారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో ఏప్రిల్‌ 5న విడుదల కాగా ఆ మరునాడే రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ముస్లింలీగ్‌ ముద్ర కన్పిస్తోందని విమర్శించారు. ఆ పక్షం రోజుల్లో మోడీ 34 ప్రసంగాలు చేయగా ఏడు చోట్ల ఇదే అంశాన్ని లేవనెత్తారు. ప్రతిపక్షాలు హిందూ వ్యతిరేక పార్టీలు అంటూ 17 సభల్లో మండిపడ్డారు. అయోధ్యలో జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రతిపక్షాలు గైర్హాజరు అయ్యాయని గుర్తుచేశారు. మొత్తంగా ఈ కాలంలో 26 చోట్ల రాముడు, రామమందిరం ప్రస్తావన తెచ్చారు. ప్రతిపక్షాలు…ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాల్లో అవినీతి, ఆశ్రితపక్షపాతం పెచ్చరిల్లాయని 27 ప్రసంగాల్లో చెప్పారు. ఈ సమయంలో కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, విశ్వగురు అంశాలకు మోడీ బాగానే ప్రాధాన్యత ఇచ్చారు. పనిలో పనిగా ‘400 ప్లస్‌’ అనే పదాన్ని కూడా విరివిగా వాడారు.
ఏప్రిల్‌ 21 మే 15 మధ్య…
ఏప్రిల్‌ 21-మే 15 తేదీల మధ్య మోడీ అత్యధికంగా 67 సభల్లో ప్రసంగిం చారు. 63 సభల్లో కాంగ్రెస్‌పై నిందారోపణలు చేశారు. హిందూ-ముస్లిం అంశాన్ని 60 సభల్లో లేవనెత్తి మత సమీకరణకు ప్రయత్నించారు. పథకాలు, అభివృద్ధిని 60 చోట్ల ఏకరువు పెట్టారు. ఇతర ప్రతిపక్షాలపై 57 చోట్ల ఆరోపణలు చేశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం గురించి 54 చోట్ల ప్రసంగించారు. ప్రతిపక్షాల అవినీతిని 50 సభల్లో లేవనెత్తారు. పేదలను గురించి 49 చోట్ల మాట్లాడారు.

Spread the love