సంధికి సిద్ధమవుతున్న హమాస్‌.. హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియే

నవతెలంగాణ – దోహా : గత నెల అక్టోబర్‌ 7వ తేదీ ప్రారంభమైన ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధపోరు నేటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధం వల్ల చిన్న, పెద్ద… వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో సంధికి సిద్ధమైనట్లు హమాస్‌ హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియే మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ‘మేము సంధిపై ఒప్పందానికి చేసుకునే ఆలోచనలో ఉన్నాము’ అని ఇస్మాయిల్‌ తన పోస్టులో పేర్కొన్నారు. ఖతార్‌ మధ్యవర్తిత్వంలో ఇరుదేశాల మధ్య సంధికి చర్చలు జరుగుతున్నాయి. ఆదివారం ఖతార్‌ ప్రధాన మంత్రి మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ తాత్కాలిక కాల్పుల విరమణ దిశగా చర్చలు జరిగాయని.. కాల్పుల విరమణకు ప్రతిఫలంగా కొంతమంది బంధీలను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ అది ఆచరణాత్మక సమస్యలపై ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. అయితే ఈ ఒప్పందంలో ఐదురోజుల సంధి ఉంటుందని, కాల్పుల విరమణ మరియు దక్షిణ గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక కార్యకలాపాలు పరిమితం చేసేందుకు ఈ సంధిలో ప్రధాన అంశాలుగా ఉండనున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బహుశా 50 నుండి 100 మంది ఇజ్రాయెల్‌ బందీల విడుదలకే ఈ సంధి జరగనుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఈ ఒప్పందం ప్రకారం.. ఇజ్రాయెల్‌ జైళ్ల నుంచి దాదాపు 300 మంది పాలస్తీనియన్లు విడుదల కానున్నారు. విడుదలయ్యే వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. కాగా, అక్టోబర్‌ 7వ తేదీన హమాస్‌ గ్రూప్‌ దాడి చేసి దాదాపు 240 మంది ఇజ్రాయిలీలను బంధీల్ని చేసింది. ఈ బంధీలను విడుదల చేయడానికే ఒప్పందం కుదుర్చుకోవడానికే కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల దాదాపు 13 వేల మందికిపైగా మృతి చెందారని గాజాలోని హమాస్‌ ప్రభుత్వం వెల్లడించింది.

Spread the love