– ఆకస్మికంగా ప్రకటించిన నెతన్యాహు
– ఆ స్థానంలో విదేశాంగమంత్రి ఇజ్రాయిల్ కట్జ్ నియామకం
– ఇద్దరి మధ్య నమ్మకం కొరవడిందని వ్యాఖ్యలు
– నెతన్యాహు నివాసం వెలుపల నిరసనలు
– ఇజ్రాయిల్‌పై ఆయుధ ఆంక్షలు: ఐక్యరాజ్య సమితికి 52 దేశాల వినతి
గాజా, బీరుట్, జెరూసలేం : పశ్చిమాసియా వ్యాప్తంగా గాజా, లెబనాన్, ఇరాన్‌లపై వరుసగా దాడులు కొనసాగిస్తూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్న వేళ ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఆకస్మికంగా ప్రకటించారు. మంగళవారం రాత్రి ఈ మేరకు ప్రకటన వెలువడింది. కొత్త రక్షణ మంత్రిగా విదేశాంగ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ నియమితులు కానున్నారు. గతంలో నెతన్యాహు ప్రత్యర్ధి, ఇటీవల ప్రభుత్వంలో తిరిగి చేరిన గైడెన్ సార్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా రక్షణ మంత్రిని తొలగించిన వెంటనే నెతన్యాహు నివాసం వెలుపల ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. గాలంట్‌ను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేలాదిమంది వీధుల్లోకి వచ్చి, రహదారులను దిగ్బంధించారు.
గాజాపై సాగుతున్న దాడుల విషయంలో నెతన్యాహు, గాలంట్ మధ్య తరచుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వుండేవి. అయినా గాలంట్‌ను తొలగించే విషయం కాస్తంత వెనుకంజ వేస్తూ వచ్చారు. అయితే తమిద్దరి మధ్య విశ్వాస సంక్షోభం, గణనీయమైన అంతరాలు నెలకొన్నాయని డిస్మిస్ చేసిన సందర్భంగా నెతన్యాహు ప్రకటించారు. ”యుద్ధం మధ్యలో వున్నపుడు, గతంలో కంటే ఎక్కువగా పూర్తి స్థాయిలో విశ్వాసం నెలకొనాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధం మొదలైన తొలినాళ్ళలో తమిద్దరి మధ్య అటువంటి విశ్వాసం నెలకొందని, కానీ దురదృష్టవశాత్తూ, కాల క్రమేణా చివరికి వచ్చేసరికి ఈ విశ్వాసం ముక్కలైపోయిందని ఆయన పేర్కొన్నారు. గతేడాది అక్టోబరు 7న దాడుల తర్వాత గాజాపై దాడులు ప్రారంభించిన సమయంలో ఇజ్రాయిల్ నాయకత్వం అంతా సమిష్టిగానే పనిచేసింది. కానీ యుద్ధం ఏడాది కాలంగా కొనసాగుతూ రావడం. పైగా లెబనాన్‌కు పాకడంతో కీలకమైన విభేదాలు తలెత్తాయి. హమాస్‌పై మిలటరీ ఒత్తిడి కొనసాగించాలన్నది నెతన్యాహు ఉద్దేశంగా వుండగా, గాలంట్ మాత్రం మరింత ఆచరణాత్మకమైన వైఖరిని అనుసరిస్తూ వచ్చారు. దౌత్య ఒప్పందం కుదుర్చుకోవాల్సిన పరిస్థితులను మిలటరీ సృష్టించిందని, కాబట్టి ఒప్పందం కుదుర్చుకుని బందీలను స్వదేశానికి తెచ్చుకోవాలని గాలంట్ చెబుతూ వచ్చారు. ఇజ్రాయిల్ భద్రతే ఎప్పటికీ తన జీవిత ధ్యేయంగా వుంటుందని గాలంట్ మంగళవారం నాటి రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
గాజా, లెబనాన్‌ల్లో కొనసాగుతున్న దాడులు
ఉత్తర గాజాలోని బెయిట్ లాహియా పట్టణం, సెంట్రల్ గాజాలోని నుస్రత్ శరణార్ధ శిబిరంపై బుధవారం ఉదయం నుండి వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు దక్షిణ లెబనాన్‌లోని టైర్ జిల్లాలో బర్జా పట్టణం సహా పలు పట్టణాలు, గ్రామాల్లో ఇజ్రాయిల్ మిలటరీ దాడులు కొనసాగిస్తోంది. తీర ప్రాంత పట్టణమైన బర్జాలో 20మంది మరణించారని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
52 దేశాల లేఖ
ఇజ్రాయిల్‌పై ఆయుధ ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్య సమితిని 52 దేశాలు కోరాయి. ఈ మేరకు టర్కీ నేతృత్వంలో 52 దేశాలు, అరబ్ లీగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఒఐసి) సంస్థలు భద్రతా మండలికి ఒక లేఖ అందచేశాయి. ఇజ్రాయిల్‌కు ఆయుధ సరఫఱాలను తక్షణమే నిలిపివేయాలని కోరాయి. అంతర్జాతీయ చట్టాలను పదే పదే ఉల్లంఘిస్తున్న, మానవతా సాయం చట్టాన్ని ఉపేక్షిస్తున్న ఇజ్రాయిల్‌పై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తోంది. ఇజ్రాయిల్‌పై తక్షణమే చర్యలు తీసుకుని అమాయకులైన ప్రజలను కాపాడాలని ఆ దేశాలు కోరాయి. ఈ మేరకు 52 దేశాలు సంతకాలు చేసిన లేఖను టర్కీ అందచేసింది.