పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ మారణహోమాన్ని ఆపాలి

పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ మారణహోమాన్ని ఆపాలి– తక్షణమే కాల్పులు విరమించాలి
– జంతర్‌ మంతర్‌ వద్ద పాలస్తీనా సంఘీభావ కమిటీ నిరసన
– వారికి అండగా నిలవాలి
– మన దీర్ఘకాలిక విధానం నుంచి తప్పుకున్న మోడీ ప్రభుత్వం : నిరసనలో సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ ప్రభుత్వం మారణహౌమం ఆపాలని, గాజాపై తక్షణమే కాల్పులు విరమించాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తాయి. శనివారం జంతర్‌ మంతర్‌ వద్ద పాలస్తీనా సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. కార్మిక నేతలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేథావులు, ఇతర వామపక్ష సంఘాల కార్యకర్తలు సహా వందలాది మంది ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. పాలస్తీనాపై ఆంక్షలు ఎత్తి వేయాలని, దాడులు ఆపాలని, పాలస్తీనాపై మానవత్వం చూపాలని, కాల్పుల విరమణ, ఇజ్రాయిల్‌కు ఆయుధాల సరఫరా నిలిపివేయాలని, హింసను ఆపాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. పాలస్తీనాకు మద్దతుగా నినాదాలు హౌరెత్తిం చారు. పాలస్తీనా జెండాలతో సంఘీభావం తెలుపుతూ సోదరభావాన్ని చాటుకున్నారు. దేశ ప్రజల తరపున, ఈ సంస్థలన్నింటి ప్రతినిధులు పాలస్తీనాకు తమ సంఘీభావాన్ని పునరుద్ఘా టించారు. పాలస్తీనాపై దాడిలో ఇజ్రాయిల్‌కు ధైర్యం చెప్పి అమెరికా మద్దతు ఇవ్వడాన్ని వీరంతా ఖండించారు. భారత ప్రభుత్వం పాలస్తీనాకు తన సంఘీభావాన్ని తక్షణమే ప్రకటించాలని, ఇజ్రాయిల్‌తో రక్షణ, భద్రతా ఒప్పందాలన్నింటీ నుండి వైదొలగాలని డిమాండ్‌ చేశారు.
యుద్ధం కాదు… మారణహోమం : సీతారాం ఏచూరి
గాజాలో ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న దాడి ”యుద్ధం కాదు, మారణహౌమం” అని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ”యుద్ధం రెండు సైన్యాల మధ్య ఉంటుంది. రెండు వైపులా ఆయుధాలు ఉంటాయి. కానీ ఇక్కడ నిరాయుధ వ్యక్తులపై దాడి జరుగుతుంది. ఇది ఆమోదయోగ్యం కాదు” అని తెలిపారు. తాము విద్యార్థులుగా ఉన్నప్పుడు పాస్‌పోర్టులపై ఇజ్రాయిల్‌, దక్షిణాఫ్రికా లకు వెళ్లరాదని రాసి ఉండేదని తెలిపారు. ”నెతన్యాహుకు మద్దతుగా మోడీ ప్రభుత్వం మోకాలడ్డింది. ప్రపంచం దీన్ని ఖండించాలి. దాడిని ఆపడానికి ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తేవాలి” అని అన్నారు. పాలస్తీనా ప్రజలకు అండగా ఉండాలనే దేశ దీర్ఘకాలిక విధానం నుంచి మోడీ ప్రభుత్వం తప్పుకుందని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు మద్దతునిస్తోందని ధ్వజమెత్తారు. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహును యుద్ధ నేరాలకు సంబంధించి అంతర్జాతీయ ట్రిబ్యునల్‌తో విచారించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
మానవ చరిత్రలో అత్యంత దారుణం: బృందాకరత్‌
ఇజ్రాయిల్‌కు ఆయుధాలను రవాణా చేయడంతో పాటు మానవ చరిత్రలో అత్యంత దారుణమైన మారణకాండలో కేంద్ర ప్రభుత్వం భాగమైందని, దీనిని తక్షణమే ఆపాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ డిమాండ్‌ చేశారు. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని, 1967కి ముందు సరిహద్దులు, తూర్పు జెరూసలేం రాజధానిగా ఉన్న పాలస్తీనా స్వేచ్ఛా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. రఫాపై జరుగుతున్న ఇజ్రాయిల్‌ దాడిని ఖండించారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజేె) ఇచ్చిన ఆదేశాలను, ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఈ దాడి జరుగుతోందని విమర్శించారు. ప్రముఖ మేధావి అచిన్‌ వనాయక్‌ మాట్లాడుతూ ఇజ్రాయిుల్‌ ఇప్పటికే పాలిస్తీనా జనాభాలో 5 శాతం మందిని చంపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలస్తీనా సంఘీభావ కమిటీ నేత ఆర్‌. అరుణ్‌ కుమార్‌, ఢిల్లీ డిప్యూటీ మేయర్‌ అలై ముహ్మద్‌ ఇక్బాల్‌, సిఐటియు ఢిల్లీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాగ్‌ సక్సేనా, సుప్రీం కోర్టు న్యాయవాది కెఆర్‌ సుభాష్‌ చంద్రన్‌ తదితరులు మాట్లాడారు. నిరసనలో సీఐటీయూ, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఏఐడీఎస్‌వో, కెవైఎస్‌, ఏఐఎస్‌ఎ, సీపీఐ(ఎంఎల్‌-న్యూడెమోక్రసీ), దాహ, ప్రగతిశీల మహిళా సంఘం, కలెక్టివ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love