– పశ్చిమ దేశాల ద్వంద ప్రమాణాలు
– కపటత్వాన్ని ఖండించిన మలేషియా ప్రధాని
ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను ఖండిస్తున్నప్పటికీ ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో కాల్పుల విరమణ కోసం నిలబడకుండా పాశ్చాత్య దేశాల నాయకులు అంతర్జాతీయ చట్టాలలో తమకు అనూకూలమైన వాటినే ఎంపిక చేసుకుంటున్నారని మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ఆరోపించారు.
ఆరు దశాబ్దాలుగా పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌కు ”పాలస్తీనియన్లపై హంతక విధ్వంసాన్ని” కొనసాగించడానికి పూర్తి స్వేచ్చను ఇచ్చాయని గురువారంనాడు కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీని ఉద్దేశించి మాట్లాడుతూ అన్వర్ అన్నాడు. గాజాలో పశ్చిమ దేశాల మద్దతుతో ఇజ్రాయిల్ చేస్తున్న మానవ హననం అమెరికా చోదక శక్తిగాగల ప్రపంచ క్రమం స్వభావాన్ని తేటతెల్లం చేస్తోందని మలేషియా ప్రధాని అన్నాడు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజాలలో జరుగుతున్న యుద్ధాల పట్ల పశ్చిమ దేశాలు తీసుకుంటున్న భిన్నమైన వైఖరులు ప్రాథమిక తర్కాన్నికూడా ధిక్కరిస్తున్నాయని ఆయన నొక్కి చెప్పాడు. అంతర్జాతీయ చట్టాన్ని వర్తింపజేయడంలో పశ్చిమ దేశాల ద్వంద ప్రమాణాలను ఇండో-పసిఫిక్ దేశాలతో సహా ఇతర దేశాలు గమనించవని నమ్మడం ”మూరు?ల పని” అని అన్వర్ అన్నాడు.
గాజాలోని ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) కు అందించే నిధులను పునరుద్ధరించాలని అన్వర్ ఆస్ట్రేలియాను కోరారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల్లో 12 మంది సిబ్బంది పాల్గొన్నారనే ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, అమెరికా, బ్రిటన్, జపాన్, నెదర్లాండ్స్, ఇతర దేశాలు ఈ ఏడాది ప్రారంభంలో గాజాలోని ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థ కి నిధులను నిలిపివేసాయి. అక్టోబరు 7న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడిని ప్రారంభించిన తర్వాత గాజా వివాదం తీవ్రమైంది. ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ పాలస్తీనా ఎన్‌క్లేవ్ గాజాలో భారీ వైమానిక దాడులను, గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది.
గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ దాడిలో 30,000 మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారు. ఆహారం, ఔషధాల కొరతతో గాజాలో కనీవినీ ఎరుగని మానవతా సంక్షోభం ఏర్పడిందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.