నవతెలంగాణ – హైదరాబాద్: జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగి పరిశోధనలు చేసి విలువైన సమాచారం సేకరించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు నిద్రాణస్థితిలోకి వెళ్లిపోయాయి. రోవర్ తన లక్ష్యాలను పూర్తి చేసుకుందని, శనివారం రాత్రి దానిని సురక్షిత ప్రదేశంలో నిలిపి నిద్రాణస్థితిలోకి పంపినట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. అందులోని ఏపీఎక్స్ఎస్, లిబ్స్ పరికరాలను స్విచ్చాఫ్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ రెండు సాధనాల నుంచి డేటా ల్యాండర్ ద్వారా భూమికి చేరిందని వివరించారు. చంద్రుడిపై రాత్రి ప్రారంభం కానుండడంతో ఉష్ణోగ్రతలు మైనస్‌లలోకి పడిపోనున్నాయి. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ రెండూ సౌరశక్తి ద్వారా మాత్రమే పనిచేస్తాయి. రాత్రయితే సౌరశక్తి అందదు కాబట్టి అందులోని బ్యాటరీలు డిశ్చార్జ్ అయిపోతాయి. వ్యోమనౌకలు దిగిన శివశక్తి పాయింట్ వద్ద సాయంకాలం మొదలైంది. వెలుగులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు వాటిని నిద్రాణస్థితిలోకి పంపారు. 14 రోజుల రాత్రి తర్వాత మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుని విక్రమ్, ప్రజ్ఞాన్ పనిచేస్తే అది అద్భుతమే అవుతుంది. ప్రస్తుతం నిద్రాణస్థితిలోకి వెళ్లిన వాటిలో బ్యాటరీలు పూర్తిస్థాయిలో రీచార్జ్ అయ్యాయి. ఈ నెల 22న శివశక్తి పాయింట్ వద్ద మళ్లీ సూర్యోదయం అవుతుంది. అప్పుడు మళ్లీ సూర్యకాంతిని ఒడిసిపట్టుకుని యాక్టివేట్ అయ్యేలా రోవర్ సౌరఫలక దృక్కోణాన్ని మార్చినట్టు ఇస్రో పేర్కొంది. దాని రిసీవర్‌ను ఆన్ చేసి పెట్టినట్టు తెలిపింది. సూర్యోదయం తర్వాత దానిని తిరిగి యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. ఒకవేళ ఈ ప్రయత్నం విఫలమైతే కనుక ఆ రెండూ చంద్రుడిపై ఎప్పటికీ భారత దేశ గుర్తులుగా నిలిచిపోతాయి. జాబిల్లి ఉపరితలంపై దిగి పరిశోధనలు ప్రారంభించిన ప్రజ్ఞాన్ రోవర్.. ల్యాండర్ నుంచి 100 మీటర్లకుపైగా ప్రయాణించింది.