నవతెలంగాణ – న్యూఢిల్లీ: పెద్దమొత్తంలో బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు జరిపే బులియన్ ట్రేడర్లు, జ్యూవెలర్లపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారు. అక్రమ లావాదేవీల ద్వారా వచ్చిన సొమ్మును గోల్డ్ ట్రేడర్లు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపణలున్నాయి. లక్నో, నోయిడా, ఢిల్లీ, కాన్పూర్, కోల్‌కతా వంటి పలు ప్రాంతాల్లోని వివిధ ప్రదేశాల్లో ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహించారు. కాన్పూర్‌లో ఇద్దరు వ్యాపార వేత్తల ఇండ్లను చుట్టుముట్టిన ఐటీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బంగారం క్రయ విక్రయ లావాదేవీల ద్వారా ఆర్జించిన భారీ మొత్తాలను బులియన్ ట్రేడర్లు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. బులియన్ ట్రేడర్లతో లావాదేవీలు నిర్వహించే రియల్ ఎస్టేట్ వ్యాపారుల నివాసాలపైనా ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.