పొగాకు కంపెనీపై ఐటీ దాడులు..

నవతెలంగాణ – ఢిల్లీ: పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో పొగాకు కంపెనీ బంశీధర్‌ గ్రూపుపై ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన దాడుల్లో కళ్లు చెదిరే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌ సహా పలు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో ఉన్న గ్రూప్‌ వారసుడు శివమ్‌ మిశ్ర ఇంటిని అధికారులు శోధించారు. ఆ ఇంట్లో రూ.50 కోట్ల విలువైన లంబోర్గిని, మెక్‌లారెన్‌, రోల్స్‌రాయిస్‌ ఫాంటమ్‌, పోర్షె వంటి సంస్థలకు చెందిన పలు లగ్జరీ కార్లను గుర్తించారు. రూ.4.5 కోట్ల నగదు, ఇతర దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రధాన నిందితుడిగా గ్రూప్‌ అధినేత కె.కె.మిశ్ర పేరు వినిపిస్తోంది. సంస్థ టర్నోవరును రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్లుగా ప్రకటించగా.. వాస్తవానికి ఆ మొత్తం రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పాన్‌మసాలా సంస్థలకు పొగాకు సరఫరా చేసే దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఈ బంశీధర్‌ గ్రూప్‌ ఒకటి. సోదాల్లో 15 నుంచి 20 బృందాలు పాల్గొన్నాయి.

Spread the love