హైదరాబాద్ : రోడ్డుపై నడిపే వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా ఉంటే వాహనదారుడు మోసం చేసినట్టు అవ్వదని, మోటారు వాహనాల చట్ట నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు తీర్పు చెప్పింది. నెంబర్ ప్లేట్ లేని వాహనదారుడిపై పోలీసులు 420 కింద కేసు నమోదు చేయడాన్ని రద్దు చేసింది. తన బైక్‌కు నెంబర్ ప్లేట్ లేదని చెప్పి చార్మినార్ పోలీసులు మోసం చేశారంటూ కేసు నమోదు చేయడాన్ని హైదరాబాద్‌కు చెందిన వసుందర్ చారి హైకోర్టులో సవాలు చేశారు. నెంబర్‌ప్లేట్ లేని వాహనం నడిపితే మోసం చేసినట్లు కాదని జస్టిస్ కె.సుజన తీర్పు చెప్పారు. వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేశారు. పిటిషనర్‌పై కేసును కొట్టేశారు.
41ఎ నోటీసులిచ్చి విచారణ చేయండి
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని వివిధ ఏరియాల్లోని చెరువుల ఆక్రమణలకు సహకరించారంటూ ఆరుగురు అధికారులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసుల్లో నిందితులైన అధికారులకు సిఆర్‌పిసిలోని 41ఎ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చాకే కేసు దర్యాప్తు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం 41ఎ నోటీసులు ఇచ్చాకే దర్యాప్తు చేయాలంది. హైడ్రా ఫిర్యాదు మేరకు నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ మేడ్చల్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్రీనివాసులు, బాచుపల్లి తహసీల్దార్ పూల్‌సింగ్ ఇతరులు వేసిన పిటిషన్లను జస్టిస్ సుజన విచారించి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు.