తేల్చాల్సిందే

It has to be decided– అదానీ ముడుపుల వ్యవహారంపై ఇండియా బ్లాక్‌ ఎంపీల ఆందోళన
– ‘మోడీ-అదానీ’ క్యారికేచర్లతో కూడిన బ్యాగ్‌లతో వినూత్నంగా గళమెత్తిన ఎంపీలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అదానీ ముడుపుల వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించి, నిజనిజాలు తేల్చాల్సిందేనని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. మంగళవారం పార్లమెంట్‌ ఆవరణలో వినూత్న రీతిలో ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్‌ ప్రధాన ద్వారమైన మకర ద్వార్‌ మెట్ల ముందు ‘మోడీ-అదానీ’ క్యారీకేచర్లతో కూడిన బ్యాగులతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఒకవైపు మోడీ- మరోవైపు అదానీ బొమ్మలు, బ్యాగ్‌ వెనుక వైపు ‘మోడీ-అదానీ భారు భారు’ అని రాసి ఉంచారు. మోడీ-అదానీ కుమ్మక్కు అయ్యారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నినాదాల హౌరెత్తించారు. అదానీ అవినీతిపై చర్చకు డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్‌, డీఎంకే, జేఎంఎం, సీపీఐ(ఎం), సీపీఐ, శివసేన, ఆర్‌జేడీ, ఎన్‌సీపీ తదితర పార్టీల ఎంపీలతో కలిసి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, డీఎంకే ఎంపీ కనిమొళి, జెఎంఎం ఎంపీ మహువా మాంఝీ, సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీలకు రాహుల్‌ దిశా నిర్దేశం
అంతకు ముందు పార్లమెంట్‌ ఎనెక్స్‌లో మెయిన్‌ కమిటీ హాల్‌లో కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ దిశా నిర్దేశం చేశారు. అదానీ ముడుపుల వ్యవహారం, మణిపూర్‌ అల్లర్లు, సంభాల్‌ హింసాత్మక ఘటన, ఢిల్లీలో కాల్పులు, కేంద్రం ఉభయ సభల ముందుకు తీసుకు రాబోయే బిల్లులపై అంశాల వారీగా అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ వైఖరిని వివరించారు. ఈ భేటీలో ప్రియాంక వాద్రా, పార్టీ సీనియర్‌ నేతలు, ఎంపీలు పాల్గొన్నారు. సమావేశ అనంతరం ప్రియాంక గాంధీ తొలుత ‘మోడీ-అదానీ’ బొమ్మలతో ఉన్న బ్యాగ్‌ను వేసుకొని రాహుల్‌కు చూపించారు.
అనంతరం సహచర ఎంపీలతో కలిసి ఎనెక్స్‌ నుంచి రాహుల్‌ గాంధీ నడుచుకుంటూ మకర ద్వారం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీలంతా మోడీ, అదానీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సభ సాగకుండా ఎన్డీఏ సర్కార్‌ కుట్ర: తెలంగాణ ఎంపీలు
కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌కు పార్లమెంట్‌ సమావేశాలను సజావుగా నడిపించాలనే ఉద్దేశం లేదని ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. అదానీ ముడుపుల వ్యవహారం, సంభాల్‌ అంశాలపై చర్చ నుంచి ప్రణాళిక ప్రకారమే కేంద్రం తప్పించుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష( ఇండియా బ్లాక్‌) ఎంపీలు లోక్‌సభను నడిపించాలని పట్టుబడుతుంటే… కావాలనే స్పీకర్‌ సభను వాయిదా వేస్తున్నారని అన్నారు.
మరోవైపు అధికార పార్టీ ఎంపీలకు అవకాశం ఇచ్చి, వాళ్ళతో విపక్ష పార్టీల సభ్యుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇండియా బ్లాక్‌ ఎంపీల ఆందోళనతోనే సభ వాయిదా పడుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగంగానే పార్లమెంట్‌ను నడపడం లేదని ఎంపీ మల్లు రవి విమర్శించారు. దీన్ని దేశ ప్రజలు గుర్తించాలని కోరారు.

Spread the love