అది ఫ్యామిలీ క్యాబినెట్‌

అది ఫ్యామిలీ క్యాబినెట్‌– వారసత్వాలకు పెద్దపీట
– మా త్యాగాన్ని బంధుప్రీతిగా మోడీ విమర్శ
– ఎన్డీఏ మంత్రివర్గంలో ఉన్నదెవరు..? : రాహుల్‌ నిలదీత
రారుబరేలీ : ప్రధాని మోడీ తాజా మంత్రివర్గంపై రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అదొక కుటుంబ మంత్రివర్గమని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. తరతరాలుగా సాగుతున్న పోరాటం, సేవ, త్యాగాలను బంధుప్రీతిగా విమర్శించేవారు (మోడీ) తమ మంత్రివర్గంలో వారసత్వాలకు పెద్ద పీట వేశారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. అలాగే, ‘మాటలకు చేతలకు మధ్య వ్యత్యాసం ఉంటే ఆ వ్యక్తిని నరేంద్ర మోడీ అని అంటారు’ అని అన్నారు. మోడీ తన నూతన మంత్రివర్గంలో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు కుమారస్వామి, కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా, అరుణాచల్‌ ప్రదేశ్‌ స్పీకర్‌ రించిన్‌ ఖరు కుమారుడు కిరణ్‌ రిజిజు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఏకనాథ్‌ ఖడ్సే కోడలు రక్ష ఖడ్సేకు, మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌ మనవడు జయంత్‌ చౌదరికి స్థానం కల్పించడాన్ని రాహుల్‌గాంధీ ప్రస్తావించారు. అలాగే, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌ కుమారుడు రామ్‌నాథ్‌ ఠాకూర్‌, మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు కుమారుడు రామ్‌ మోహన్‌ నాయుడు, మాజీ కేంద్ర మంత్రి వేద్‌ ప్రకాశ్‌ గోయల్‌ కుమారుడు పీయూష్‌ గోయల్‌, హర్యానా మాజీ మంత్రి రావు బిరేంద్ర సింగ్‌ కుమారుడు ఇంద్రజీత్‌ సింగ్‌కు మంత్రులుగా అవకాశం ఇవ్వడాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రియాంక పోటీ చేసివుంటే..
తాజా లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి ప్రియాంకగాంధీ పోటీ చేసి ఉంటే ప్రధానమంత్రి మోడీ అక్కడ కనీసం రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయేవారని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. రారుబరేలీలో నిర్వహించిన కృతజ్ఞాతా సభలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలాన్ని తగ్గించడానికి రారుబరేలీ, అమేథితో పాటు దేశంలోని ఇతర నియోజకవర్గాల్లో ఇండియా వేదిక పార్టీలు ఐక్యంగా పోరాటం చేశాయని అన్నారు. ఎన్నికల ఫలితాలపై అహంకారానికి లోనుకాకుండా, ప్రజల ప్రయోజనాల కోసం ఇండియా వేదిక ఎంపీలు పనిచేస్తామని రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా తెలిపారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవంలో సామాన్య ప్రజలను విస్మరించిన మోడీ పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులకు ప్రాధాన్యత ఇచ్చారని, అయోధ్యలో ఓటమితో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. రారుబరేలీలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ఓటర్లుకు కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love