– అల్ షిఫా ఆస్పత్రిలో పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌ఓ
గాజా స్ట్రిప్ : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిని ఓ ‘మృత్యు నిలయం’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అభివర్ణించింది. అక్కడి పరిస్థితి చెప్పనలవి కాదని తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓ నేతృత్వంలోని బృందం శనివారం ఆస్పత్రిని సందర్శించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ కేవలం ఓ గంట సేపు మాత్రమే గడిపింది. ఈ బృందంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రజారోగ్య నిపుణులు, అధికారులు, భద్రతా సిబ్బంది సభ్యులుగా ఉన్నారు. ఆస్పత్రిలో స్వచ్ఛమైన నీరు, ఇంధనం, మందులు, ఇతర అత్యవసరాలకు కొరత ఏర్పడిందని ఈ బృందం వివరించింది. వాస్తవానికి ఓ వైద్య కేంద్రంగా ఇది పనిచేయడం లేదని తెలిపింది. ‘కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. తూటాలు దూసుకొస్తున్నాయి. ఆస్పత్రి ప్రాంగణంలో సామూహిక శ్మశాన వాటిక కన్పించింది. అక్కడ 80 మందికి పైగా మృతులకు అంత్యక్రియలు నిర్వహించారని చెప్పారు’ అని డబ్ల్యూహెచ్‌ఓ ఓ ప్రకటనలో వివరించింది. ఈ సంస్థత తెలిపిన వివరాల ప్రకారం… ఆస్పత్రిలోకి ప్రవేశించే మార్గాలు, ఆస్పత్రి మైదానం మొత్తం వ్యర్థాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా భరించలేదని దుర్వాసన వస్తుండడంతో తమ ఆరోగ్యం, భద్రతపై రోగులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరవై ఐదు మంది ఆరోగ్య కార్యకర్తలు, 291 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిలో 32 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఆస్పత్రిలో మిగిలి ఉన్న రోగులు, వారి బంధువులు, ఆరోగ్య సిబ్బందిని అక్కడ నుండి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే 24-72 గంటల్లో వారందరినీ సురక్షితంగా వేరే ప్రదేశాలకు పంపుతామని, ముఖ్యంగా రోగులను గాజాకు దక్షిణాన ఉన్న ఆస్పత్రుల్లో చేరుస్తామని అధికారులు తెలిపారు.
డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటనపై ఇజ్రాయిల్ ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఆస్పత్రి ప్రాంగణాన్ని వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయిల్ రక్షణ దళాలు హెచ్చరికలు పంపడంతో అల్ షిఫా మైదానంలో ఆశ్రయం పొందుతున్న 2,500 మంది బాధితులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆస్పత్రి సమీపంలో భీకర పోరు సాగుతోందని, ఇజ్రాయిల్ సైన్యంతో సమన్వయం చేసుకొని తాము ఆస్పత్రిలోకి వెళ్లామని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని, ఆపన్నులకు మానవతా సాయాన్ని అందించాలని ఆ సంస్థ మరోసారి విజ్ఞప్తి చేసింది.