– దానిపై బీజేపీ సమాధానం చెప్పాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలో మత పరిస్థితులపై వ్యాఖ్యలు చేసినందుకు ప్రతిపక్ష నాయకులు రాహుల్‌గాంధీ తల తీసుకురావాలని బీజేపీ నాయకులు పిలుపునివ్వడం గర్హనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తలలు తీసుకువచ్చే సంస్కృతి ఎవరిదో ఆపార్టీ చెప్పాలనీ, హిందూ మతం పేరుతో అరాచకాలు సష్టిస్తున్న బీజేపీనే హిందూ తాలీబన్ అని విమర్శించారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు, ఎన్ బాలమల్లేష్, కలవేణ శంకర్, ఎమ్ బాలనర్సింహాతో కలిసి మాట్లాడారు. చౌకబారు రాజకీయాలు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న వారు చాలా తప్పు చేస్తున్నట్టేననీ, అలాంటి వ్యాఖ్యల వల్ల దేశం నిరంతరం అగ్నిగుండంలా ఉండేలా చేస్తున్నారని అన్నారు. ప్రజలు కూడు, గూడు, ఉపాధి తదితర సమస్యల గురించి మాట్లాడకుండా దృష్టి మరల్చేందుకే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ తప్పు చేస్తే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనీ, అలా కాకుండా రాహుల్‌ను టెర్రరిస్టు అని సాక్షాత్తు బీజేపీ మంత్రే ముద్ర వేస్తున్నారన్నారు. హిందూ మతం పేరుతో ఏమైనా మాట్లాడటాన్ని హక్కుగా భావించడం అభ్యంతరకరమన్నారు. హైడ్రా అంటే పేదల్లో అభధ్రతాభావం రాకూడదనీ, ఆక్రమణదారులకు మాత్రం భయం ఉండాలని అభిప్రాయపడ్డారు.
హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీకి ‘సూరవరం ప్రతాపరెడ్డి’ పేరును, కోఠిలోని మహిళా యూనివర్సిటీకి ‘వీరనారి చాకలి ఐలమ్మ’ పేరును, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ పేరును పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై మగ్ధూం మోహియుద్దీన్ విగ్రహం ఉన్న చోటే, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ సాయుధ పోరాటయోధులు షోయబుల్లాఖాన్, షేక్ బందగీ, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం వంటి వీరులను కూడా సముచితంగా గౌరవించాలని చెప్పారు.