అది వివాదాస్పదమట !

It is controversial!– పాలస్తీనా ఘర్షణలపై గురుగ్రామ్‌ వర్సిటీ వింత భాష్యం
– ప్రసంగ కార్యక్రమం రద్ధు
గురుగ్రామ్‌ : పాలస్తీనా ఘర్షణలపై గురుగ్రామ్‌ విశ్వవిద్యాలయంలో జరగాల్సిన ప్రసంగ కార్యక్రమాన్ని ఇటీవల అధికారులు రద్దు చేశారు. ఇది ‘వివాదాస్పద’ అంశమని, ఈ కార్యక్రమానికి తన అనుమతి కోరలేదని వైస్‌ ఛాన్సలర్‌ దినేష్‌ కుమార్‌ చెప్పుకొచ్చారు. పాలస్తీనా ఘర్షణలపై గురుగ్రామ్‌ వర్సిటీలో జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జోయా హసన్‌ ప్రసంగించాల్సి ఉంది. యూనివర్సిటీకి చెందిన రాజకీయ శాస్త్ర విభాగం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 12న అది జరగాల్సి ఉంది. అయితే 10వ తేదీన హసన్‌కు నిర్వాహకులు ఫోన్‌ చేసి, కార్యక్రమం రద్దయిందని తెలియజేశారు. దీనిపై వైస్‌ ఛాన్సలర్‌ దినేష్‌ కుమార్‌ ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ప్రతినిధితో మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమాన్ని యూని వర్సిటీలో ఓ టీచర్‌ ఏర్పాటు చేశారు. నాకు ఆ విషయమే తెలియదు. నేను క్యాంపస్‌లో లేను. ప్రసంగించాల్సిన విషయం వివాదా స్పదమైనది అయినందున మేము ఆ కార్యక్రమాన్ని రద్దు చేశాము’ అని తెలిపారు.
పాలస్తీనా ఘర్షణలపై తాను రాసిన వ్యాసాన్ని ఓ వార్తాపత్రిక ప్రచురించిందని, ఆ తర్వాత పొలిటికల్‌ సైన్స్‌ విభాగం తనను కలిసి దానిపై ప్రసంగించాల్సిందిగా కోరిందని హసన్‌ చెప్పారు. ‘పాలస్తీనా ఘర్షణలపై భారత్‌ స్పందిస్తున్న తీరు గురించి చర్చించాల్సిన అవసరం ఉన్నదని వారు నాకు చెప్పారు. అందుకు నేను అంగీకరించాను. ఈ నెల ఐదవ తేదీన నిర్వాహకులు నన్ను కలిశారు. ఉపన్యాస శీర్షికపై చర్చించారు. కార్యక్రమానికి రవాణా తదితర ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమ నిర్వహణకు అనుమతి తీసుకున్నామని కూడా తెలిపారు. అయితే పదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో నిర్వాహకుడి ఆరోగ్యం సరిగా లేదని సమాచారం ఇచ్చారు. ఒకవేళ అది ఆరోగ్య సమస్యే అయితే ముందుగా అనుకున్న కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేయాలి?’ అని ఆమె ప్రశ్నించారు. పాలస్తీనాపై చర్చ జరగక పోయినప్పటికీ దానిపై ఫ్యాకల్టీ ఆసక్తి చూపడం మంచి విషయమేనని హసన్‌ వ్యాఖ్యానించారు. కాగా పశ్చిమాసియా అధ్యయనాల జేఎన్‌యూ కేంద్రంలో గత నెలలో ఇరాన్‌, పాలస్తీనా, లెబనాన్‌ రాయబారులు మూడు సెమినార్లకు హాజరు కావాల్సి ఉండగా వాటన్నింటినీ రద్దు చేశారు.

Spread the love