వెలుగులు నింపిందే ఇందిరమ్మ రాజ్యంలో..

Illuminated In the kingdom of Indiramma..– అన్నారం బ్యారేజీ పగిలింది.. మేడిగడ్డ కుంగింది
– నమ్మక ద్రోహి సునితమ్మను అసెంబ్లీ గేట్‌ దాటనీయొద్దు
– నర్సాపూర్‌ గిరిజనుల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్యాకేజీ
– రోడ్‌ షోల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ – మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి/పరకాల/ నడికూడ / ఖైరతాబాద్‌
‘మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి. బైబై కేసీఆర్‌ బైబై..’ అనే నినాదాలతో రేవంత్‌రెడ్డి కార్యకర్తల్లో జోష్‌ పెంచి బహిరంగ సభను హోరెత్తించారు. సభకు హాజరైన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు రేవంత్‌రెడ్డితో గొంతు కలిపి నినాదాలు చేశారు. నర్సాపూర్‌ విజయభేరి సభకు జనం భారీగా తరలి రావడంతో రేవంత్‌రెడ్డి జోష్‌ పెంచారు. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిర్వహించిన విజయభేరి సభలో, పరకాల, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లో రోడ్‌ షోల్లో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఇందిరమ్మ రాజ్యమంటే చీకటి రాజ్యమంటూ కేసీఆర్‌ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఇందిరమ్మ రాజ్యమంటే దేశానికి వెలుగులు నింపిన రాజ్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఇందిరమ్మదేనన్నారు. సింగిల్‌విండో డైరెక్టర్‌గా, యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులుగా కేసీఆర్‌కు అవకాశమిచ్చింది కూడా కాంగ్రెస్సే అన్నారు. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్‌ నాంపల్లి దర్గా దగ్గరో.. బిర్లా టెంపుల్‌ మెట్ల కిందో బిచ్చమెత్తుకునే వారని విమర్శించారు. కాంగ్రెస్‌ను తిడితే ప్రజలిచ్చే తీర్పుతో కొట్టుకుపోతావని హెచ్చరించారు. అన్నారం బ్యారేజీ పగిలిపోయింది.. మేడిగడ్డ కుంగిపోయిందన్నారు. తెలంగాణలో రాజరికం… ఆరాచకం రాజ్యమేలుతోందన్నారు. మూడు వేల వైన్స్‌లు, 60 వేల బెల్ట్‌ షాపులు పెట్టి తెలంగాణను తాగుబోతులకు అడ్డాగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకొచ్చాక అభయ హస్తం పేరిట ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు.
నమ్మక ద్రోహి సునితమ్మ
కాంగ్రెస్‌ పార్టీ అనేక అవకాశాలిస్తే నమ్మక ద్రోహం చేసి పదవుల కోసం శత్రువు పంచన చేరిన సునితమ్మను అసెంబ్లీ గేటు దాటనీయొద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఆమె గెలుపు కోసం ప్రచారం చేసిన తనపై రెండు కేసులయ్యాయని, అవి ఇప్పటికీ నడుస్తున్నాయని అన్నారు. నమ్మక ద్రోహం చేస్తే సొంతవాడైనా.. ఆడబిడ్డైనా బండకేసీ కొట్టాల్సిందేనన్నారు. తాము వచ్చాక నర్సాపూర్‌ నియోజకవర్గంలోని గిరిజనుల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్యాకేజీ ఇస్తామన్నారు. నర్సాపూర్‌ సభలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్‌, అంజనేయులు గౌడ్‌, రాష్ట్ర నాయకులు చిలుముల సుహాసినీరెడ్డి, కనకారెడ్డి పాల్గొన్నారు.
‘ఇక కేసీఆర్‌, కేటీఆర్‌కు సెలవే..’
ఈనెల 30న జరగనున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్‌, కేటీఆర్‌కు ఇక సెలవేనని రేవంత్‌రెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గ పట్టణ కేంద్రంలోని వెల్లంపల్లి రోడ్డు పరిసర ప్రాంతంలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేవూరి సారథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ.. పరకాలను అగ్నిగుండంగా మార్చింది కేసీఆర్‌, చల్లా ధర్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పరకాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా నిధులు ఇచ్చే బాధ్యత తనదేనని చెప్పారు. కొండా దంపతులు అంటే తనకు బలమన్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేసిన ఇనుగాల వెంకటరాం రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.

Spread the love