పీవీకి భారత రత్న రావడం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం: కేసీఆర్‌

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ న‌ర్సింహారావుకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. దేశ అత్యున్నత పౌర పురస్కారం భార‌త‌ర‌త్న వరించింది. పీవీ న‌ర్సింహారావుతో పాటు మ‌రో మాజీ ప్రధాని చౌద‌రి చ‌ర‌ణ్‌సింగ్‌, వ్యవ‌సాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథ‌న్‌కు కూడా కేంద్రం భారత రత్న పురస్కారాన్ని శుక్రవారం ప్రకటించింది. దీంతో పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పీవీకి భారత రత్న ప్రకటించడంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్‌ను గౌరవించి పురస్కారం ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
కేంద్రం పీవీకి ‘భారతరత్న’ ప్రకటించడం సంతోషకరం: కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటిండం సంతోకరమైన విషయమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక X (ఎక్స్‌) ఖాతాలో ఆయన పోస్టు పెట్టారు. పీవీకి భారతరత్న అవార్డు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నాయకత్వంలో గతంలో పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించామని, అప్పటి నుంచే తాము పీవీకి భారతరత్న పురస్కారం ప్రటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నామని కేటీఆర్‌ గుర్తుచేశారు. అదేవిధంగా.. పీవీకి భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ గత ఏడాది జూన్‌లో పెట్టిన ట్వీట్‌ను కూడా కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు.

Spread the love