సామాన్యుడే ‘పద్మ’వ్యూహాన్ని ఛేదిస్తాడు-తప్పదు!

సామాన్యుడే 'పద్మ'వ్యూహాన్ని ఛేదిస్తాడు-తప్పదు!29 జులై 2024 నాడు బడ్జెట్‌ మీద లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఉపన్యాసం చాలా ఆవేశంగా, ఆర్ద్రంగా, అర్థవంతంగా ప్రజల పక్షాన సాగింది. ఉపమానాలతో, సంకేతాలతో రాజకీయ కవితలా కూడా అనిపించింది. ఆరెస్సెస్‌, బీజేపీలకు వారి స్థాయి ఏమిటో చూపించింది. ప్రతిపక్షాలనన్నింటినీ ఏకం చేసి, ఇండియా కూటమి నాయకుడిగా మాట్లాడిన తీరు, దేశ ప్రజలకు నచ్చింది-మరీ ముఖ్యంగా అధికార బీజేపీ వారికి అర్థమయ్యేట్లు పురాణఘట్టాలను ఉదహరించి చేసిన ఆ ఉపన్యాసాన్ని తెలుగు పాఠకుల కోసం తెలుగులో అందిస్తున్నాను.
లిలిలి
స్పీకర్‌ సర్‌, నా ఉపన్యాసాలలో నేను తరచూ చెపుతూనే ఉన్నాను. ప్రస్తుతం మన భారతదేశంలో భయపూరితమైన వాతావరణం ఉంది. అధికార పక్షంలో ఉన్న నా స్నేహితులు నవ్వుతున్నారు. కానీ, వాళ్లు కూడా భయపడుతున్నారు. నాకు తెలుసు బీజేపీలో కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రధాని కావడానికి కలలు కనొచ్చు. ఒక వేళ రక్షణ మంత్రి ప్రధాని కావాలనుకుంటే అక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. అక్కడ కూడా భయం ఉంది. అదే భయాన్ని వారు దేశవ్యాప్తం చేశారు. అందుకే నన్ను నేనొక ప్రశ్న అడుక్కుంటూ ఉన్నాను. బీజేపీ వారు దేశంలో భయాన్ని ఎందుకింత లోతుగా వ్యాప్తి చేశారూ? అని! స్పీకర్‌ సర్‌, మా చేయి గుర్తు-భయపడకు, భయపెట్టకు – అన్న విషయం గుర్తు చేస్తుంది. అదొక అభయ ముద్ర!! బీజేపీ పరిస్థితి వేరుగా ఉంది. బీజేపీ సభ్యులు భయపడుతున్నారు. బీజేపీ మంత్రులు భయపడుతున్నారు. దేశంలోని కష్టజీవులు, రైతులు, యువతీ యువకులు అందరికందరూ భయపడుతున్నారు. దీని గురించి తీవ్రంగా ఆలోచించి, నేనొక జవాబు కనుక్కున్నాను. అదే చెపుతున్నాను. బడ్జెట్‌ గురించే మాట్లాడుతున్నాను స్పీకర్‌ సర్‌! కొంచెం ఉపోద్ఘాతం ఇచ్చి అక్కడికే వస్తున్నాను.
చాలాయేళ్ల క్రితం హరియాణా కురుక్షేత్రలో యువకుడైన అభిమన్యుణ్ణి చక్రవ్యూహంలో ఇరికించి చంపేశారు. అంటే! స్పీకర్‌ సర్‌ చక్రవ్యూహంలో భయం ఉంది. హింస ఉంది. అలాంటి చక్రవ్యూహంలో అభిమన్యుణ్ణి ట్రాప్‌ చేసి, ఒక ఆరుగురు చుట్టుముట్టి, నిర్దాక్షిణ్యంగా చంపేశారు. నేను ఈ చక్రవ్యూహం గురించి కొంత పరిశోధన చేసి, తెలుసుకున్నదేమంటే – చక్రవ్యూహానికి మరొక పేరుందని, దాన్నే ‘పద్మ’వ్యూహమంటారని !! అంటే ఆ వ్యూహం కమలం పువ్వు ఆకారంలో ఉంటుందట. లోటస్‌ ఫార్మేషన్‌-21వ శతాబ్దంలో కూడా ఒక కొత్త చక్రవ్యూహం- ‘పద్మ’ వ్యూహం తయారయ్యింది. అది కూడా కమలం పువ్వు ఆకారంలోనే ఉంటుంది. ఆ కమలం పువ్వు గుర్తునే మన దేశ ప్రధాని తనఛాతి మీద పెట్టుకుని తిరుగుతుం టాడు. ఆనాడు అభిమన్యుణ్ణి బంధించి, హింసిం చిన విధంగానే, ఈనాడు ఈ ‘పద్మ’వ్యూహం కూడా ఈ దేశాన్ని బంధించింది. దేశంలోని రైతుల్ని, యువతీ యువకుల్ని, తల్లుల్ని, అక్కా చెల్లెల్ని, చిన్న వ్యాపారస్తుల్ని, మధ్యతరగతి వ్యాపారస్తుల్ని బంధించింది. స్పీకర్‌ సర్‌- నాడు మూకుమ్మడిగా అభి మన్యుణ్ణి చంపిన ఆరుగురు ఎవరంటే -ద్రోణాచార్య, కర్ణుడు, కృపాచార్య, కృతవర్మ, అశ్వద్ధామ, శకుని. ఈనాటి చక్రవ్యూహంలో కూడా ఆరుగురు ఉన్నారు. చక్రవ్యూహం వేల మందితో తయారవుతుంది. వారందరూ ఉంటారు. కానీ, దాని కేంద్రకంలో అంటే సెంటర్లో కేవలం ఆరుగురే ఉంటారు. వారే కంట్రోల్‌ చేస్తుంటారు. ఈ రోజు కూడా ఆరుగురే కంట్రోల్‌ చేస్తున్నారు. వారెవరంటే – నరేంద్రమోడీ జీ, అమిత్‌షా జీ, మోహన్‌ భగవత్‌ జీ, అజిత్‌ డోబాల్‌ జీ, అదానీ జీ, అంబానీ జీ.
ఈ ‘పద్మ’వ్యూహపు ఉద్దేశమేమంటే – దేశ ఆర్థిక శక్తిని తమ ఆధీనంలో ఉంచుకోవడం. అదీ కేవలం ఇద్దరి దగ్గరే ఉండాలనుకోవడం. ఈడి, సిబిఐ, ఇన్‌కంటాక్స్‌ వ్యవస్థల్ని దుర్విని యోగం చేయడం. సరే ఇక ఇప్పుడైనా, ఈ బడ్జెట్‌లో గతంలో చేసిన తప్పిదాలు సవరించుకుంటారేమోనని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. రైతులకు, యువతులకు ఈ బడ్జెట్‌ కొంత సహాయకారిగా ఉంటుందని భావించాం. కానీ, అలా జరగలేదు. చిన్న, మధ్య తరగతి వ్యాపార స్తులకు మేలుజరగలేదు. వీరందరి జీవితాల్ని ఈ బడ్జెట్‌ ధ్వంసం చేసింది. ఇదంతా ‘పద్మ’వ్యూహంలో భాగం నోట్‌బందీ; జీఎస్టీ; టాక్స్‌ టెర్రరిజం – ఆపడానికి ఈ బడ్జెట్‌లో ఏ వెసులుబాటూ లేదు. కోవిడ్‌ సమయంలో మీరేం చేశారు? పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ప్రోత్సాహ కాలు అందించారు. చిన్న వ్యాపారాల్ని మూసేయించారు. దేశంలోని నిరుద్యోగులకు జీవన భృతి లేదు. వారంతా బతకలేక తల్లడిల్లిపోతు న్నారు. ఐదు శాతమున్న అతిపెద్ద కంపెనీలలో పనిచేసే ట్రెయినీలకే స్టైఫండ్‌ అందుతుంది. 95శాతం యువతీ యువకులకు దీనివల్ల ఏ మాత్రం లాభం లేదు. అంటే ఏమిటీ? ముందు మీరు కాళ్లు విరగ్గొడ తారు. తరువాత బ్యాండ్‌ఎయిడ్‌ వేస్తారు. అది సరిపోదు. పనిచేయదు.
ఈ రోజు పరీక్షల పేపర్‌లీక్‌ చాలా ప్రధానమైన అంశం. దాని గురించి ఏమైనా ఆలోచించారా? ఒక వైపు మీ పద్మవ్యూహం నిరుద్యోగాన్ని పెంచుతోంది. మరోవైపు మీ పద్మవ్యూహం పేపర్‌లు లీక్‌ చేస్తోంది. ఈ దేశపు యువత ఏమైపోవాలని అనుకుంటున్నారు. గత పదేండ్ల మీ పాలనలో దేశంలో డెబ్బయిసార్లు పరిక్ష పేపర్లు లీక్‌ అయ్యాయి. కావాలంటే వివరాలిస్తాను. తీరికగా చూస్కోండి. స్పీకర్‌ సర్‌-యువతీయువకులకు పేపర్‌లీక్‌ చాలా పెద్ద సమస్య దాన్ని ఎదుర్కోడానికి, దాన్ని సరిచేయడానికి, యువతకు న్యాయం చేయ డానికి ఈ బడ్జెట్‌లో ఒక్క ంటే ఒక్కమాట కూడా లేదు. ఈ విషయం గూర్చి ఆర్థిక మంత్రి ఒక్క మాట మాట్లాడలేదు. పైగా గత ఇరవై ఏండ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా -2.5 శాతం విద్యకు కేటాయిం చారు. దేం సరిపోతుందీ? మరో విశేషమేమంటే అగ్నివీర్‌ జవాన్‌లను తొలిసారి మీ చక్రవ్యూహంలో బంధించారు. ఈ బడ్జెట్‌లో అగ్నివీర్‌ల పెన్షన్‌ గురించి ఒక్కమాట చెప్పలేదు. మిమ్మల్ని మీరు దేశభక్తులని ప్రకటించుకుంటారు. కానీ, దేశ రక్షణ బాధ్యతను నిర్వహిస్తున్న అగ్నివీర్‌ జవాన్‌ల గురించి మీరు ఆలోచించరు. వారికి పెన్షన్‌ ఇవ్వడానికి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించరు. ఆ రకంగా మీరు మన సైనికుల్ని, ‘అగ్నివీర్‌’ అనే పద్మవ్యూహంలో ఇరికించారు.
అన్నదాతలైన, రైతుల్ని మీ నల్ల చట్టాల చక్రవ్యూహంలో బంధించారు. దానిలోంచి బయటపడడానికి రైతులు ఢిల్లీ బార్డర్‌లో ఏండ్లకేండ్లు ధర్నాలు చేస్తున్నారు. ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. అయినా వారిని కనికరించలేదు. వారు ఢిల్లీకి రాకుండా చేసి, వారి మీద బుల్లెట్లు కురిపించారు. అయినా రైతులు వీరోచితంగా పోరాడుతూనే ఉన్నారు. మీ పద్మవ్యూహంలోంచి బయటపడడానికి వారు ఒకే ఒక్క విషయం అడిగారు. లీగల్‌ గ్యారెంటెడ్‌ ఎం.ఎస్‌.పి. కావాలని డిమాండ్‌ చేశారు. దాని మీద మాట్లాడకపోగా, వారి రోడ్డు మూసేశారు. అది ఇప్పటికీ మూసే ఉంది. వారితో మీరు మాట్లాడరు. అందుకే వారు నన్ను కలవడానికి పార్లమెంటుకు వస్తే, వారిని లోనికి అనుమతించలేదు. అప్పుడు నేనే బయటికి వెళ్లి, మీడియా ముందు వారిని కలిశాను. అప్పుడు ఏమైందో నాకైతే తెలియదు, వెంటనే పార్లమెంట్‌ గేట్లు రైతుల కోసం తెరుచుకున్నాయి. సరే, ఈ బడ్జెట్‌లో రైతులు అడిగిన ఒక్క కోర్కెను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేసిఉంటే వారు మీ పద్మవ్యూహంలోంచి కొంతవరకు బయట పడేవారు. కానీ, అది జరగలేదు. మా ‘ఇండియా’ కూటమి వైపు నుండి మేం అన్నదాతలకు భరోసానిస్తున్నాం. అవకాశం రాగానే మేం తప్పక వారి డిమాండ్‌కు అనుకూలంగా స్పందిస్తాం! గ్యారంటీడ్‌ లీగల్‌ ఎంం.ఎస్‌.పి. బిల్‌ ఈ సభలో పాస్‌ చేస్తాం! అన్నదాతల్ని ఆదుకుంటాం! ఇది మా వాగ్దానం!!
ఇకపోతే ఈ దేశపు మధ్య తరగతి ప్రజలు, ఈ బడ్జెట్‌కు ముందు, ప్రధాని మోడీకి ఎక్కువగా మద్దతిచ్చారు. కోవిడ్‌ సమయంలో కోవిడ్‌ను పారదోలడానికి ప్రధాని వారిని చప్పట్లు కొట్టమన్నారు. వారు రెండు చేతులతో శక్తి కొద్దీ చప్పట్లు చరిచారు. మాకు అది కొంచెం విచిత్రంగా అనిపించింది. కానీ, చెప్పింది దేశ ప్రధాని కదా-అని దేశ ప్రజలు విన్నారు. తర్వాత ప్రధాని మొబైల్‌ లైట్‌ వెలిగించమన్నారు.దేశ వ్యాప్తంగా మొబైల్‌ లైట్లు వెలిగాయి. అలాంటి మధ్య తరగతి ప్రజలకు మీరు మీ బడ్జెట్‌తో రెండు కత్తులు పొడిచారు. ఇండక్వేషన్‌ కౌన్సిల్‌ చేసి వారి వీపులో కత్తి పొడిచారు. కాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌ పెంచి-వారి ఛాతిలో మరో కత్తి పొడిచారు. దీనితో మా ఇండియా కూటమికి కనిపించని లాభం జరిగింది. దేశ ప్రజలు ఎన్డీయే కూటమిని వదిలి ఇండియా కూటమివైపు వస్తున్నారు. – అవకాశం దొరికితే చాలు మీరు చక్రవ్యూహాలు ఏర్పాటు చేస్తారు. మేం మీ చక్రవ్యూహాన్ని, పద్మవ్యూహాన్ని బద్దలుకొట్టే పనిలో ఉన్నాం. భారతదేశంలో ప్రజలెవరూ కలలు కనగూడదని మీరు భావిస్తారు. కేవలం ఎ2,ఎ2లే (ఆదానీ, అంబానీలే) కలలు కనడానికి అర్హులు అని మీరనుకుంటారు. ఆ ఇద్దరే దేశంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంట్రోల్‌ చేస్తారు. వారి దగ్గరే టెలికామ్‌ సిస్టమ్‌ ఉంది. ఎయిర్‌పోర్టులున్నాయి.ఇప్పుడిక రైల్వేలను ఆక్రమించాలనే ప్రయత్నంలో ఉన్నారు. సంపదకు సంబంధించిన ఏకచ్ఛత్రాధిపత్యం వీరి వద్దనే ఉంది.
స్పీకర్‌ సర్‌! దేశంలో మరొక ముఖ్యమైన సమస్య ఉంది. దానిమీద ఈ బడ్జెట్‌ దృష్టి పెట్టలేదు. ఈ దేశంలో దళితుల, ఆదివాసీల, మైనార్టీల, వెనకబడిన వర్గాల సంఖ్య అధికం. సుమారు 90-95 శాతం ప్రజలు వారే. అయితే వారికి ఎందులోనూ స్థానం దొరకదు. పెద్దపెద్ద వ్యాపారాల్లోగానీ, ప్రభుత్వ యంత్రాంగంలో గానీ, ముఖ్యమైన చోట్ల ఎక్కడా వారికి తగిన స్థానం దొరకదు. అందుకే దేశంలోని 95 శాతం ప్రజలు ‘జనగణన’ కోరుతున్నారు. అప్పుడు గానీ, ప్రతి దాంట్లో వారివారి భాగస్వామ్యం ఎంత అనేది బయటపడదు. ఆర్థిక మంత్రి నవ్వుతున్నారు గానీ, ఇది నవ్వే విషయం కాదని మేడమ్‌ గారు తెలుసుకుంటే మంచిది-ఈ దేశపు బడ్జెట్‌ దేనికి ఎంత అనేది నిర్ణయించడమంటే ఏమిటీ? ఈ దేశపు ‘హల్వా’ను పంచడం జనాభాలో 2-3శాతం ఉన్నవారు ఈ దేశపు హల్వా పంచడానికి కూర్చు న్నారు. ఎవరికి పంచుతున్నారూ? వారికి అనువైన 2-3శాతం కార్పోరేట్లకు మాత్రమే పంచుతున్నారు. అంటే 95 శాతం ఉన్న సామాన్యులకు హల్వా ఏ మాత్రం అందడం లేదు (బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక శాఖలో హల్వా (మిఠాయి) చేసి, అక్కడ ఉన్న అధికారులు కలిసి తినడం ఆనవాయితీ, దాన్ని దృష్టిలో ఉంచుకుని రాహుల్‌ గాంధీ దేశపు హల్వా పంచుకుని తింటున్నారని పరోక్షంగా ఎత్తిచూపారు. ఆఫొటో కూడా లోక్‌సభలో చూపించారు) ఈ సారి బడ్జెట్‌ తయారు చేసిన వారిలో 20 మంది అధికారులున్నారని తెలిసింది. అందులో ఒకరు మైనార్టీ. మరొకరు ఒబిసి. అంటే 95 శాతం ప్రజలకు ప్రతినిధులు ఇద్దరయితే 5 శాతానికి 18 మంది ఉన్నారు. ఉన్న ఆ ఇద్దరిని కూడా ఇక్కడ ఫొటోలోకి రాకుండా అడ్డుకుని, వెనక్కి నెట్టేశారు. ఎందుకీ వివక్ష అని మేమడుగుతున్నాం. మీ పద్మవ్యూహాల్ని బద్దలు కొట్టడానికే మేం బయలుదేరాం! మేం అదే పనిలో ఉన్నాం!! స్పీకర్‌ సర్‌-
పద్మవ్యూహాలు తయారు చేసేవారికి భారతదేశపు స్వభావం అర్థం కాలేదు పద్మవ్యూహంలో చిక్కుకున్న అణగారిన వర్గాల వారు ‘అభిమన్యుడు’ అనుకుని పొరపడ్డారు-కాదు-అక్కడ ఉన్నది ‘అర్జునుడు’!! మీ కుటిల పద్మవ ్యహాల్ని చ్ఛేదించుకుని ఈ దేశ ప్రజలు తప్పక బయటపడతారు. పద్మవ్యూహాలు పన్నినవారిని తుత్తునియలు చేస్తారు. మా చేతిలో ఉన్న రాజ్యాంగం- స్వేచ్ఛ- అహింస- ప్రేమభావన- ‘పద్మ’వ్యూహాల్ని ముక్కలు చేస్తాయి. వీటితోనే మేం ప్రధాని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాం. కుప్పగూల్చాం అందుకే ఆయన సభలోఉండటం లేదు. స్పీకర్‌ సర్‌!
– కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత,
జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్‌నుంచి)
డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love