ముంచింది కాంగ్రెస్సే

It is the Congress that has drowned— హస్తంపై శివాలెత్తిన సీఎం
– తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలపై సుదీర్ఘ ప్రసంగం
– అభివృద్ధి, సంక్షేమ పథకాల ఏకరువు
– దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల పే స్కేలు అమలుకు హామీ
– ప్రశ్నోత్తరాలు రద్దు- జయశంకర్‌కు నివాళి
– ఆర్టీసీ బిల్లుకు ఆమోదం.. ఉభయ సభలు నిరవధిక వాయిదా
ఏ అంశాన్ని.. ఎప్పుడు, ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన నేత సీఎం కేసీఆర్‌. ఏ వేదిక నుంచి ఏయే విషయాలను ప్రస్తావిస్తే.. తమకు ప్రయోజనం కలుగుతుందో కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే రానున్న శాసనసభ ఎన్నికల ప్రచారానికి ఆయన అసెంబ్లీనే వేదిక చేసుకున్నారు. అందులో భాగంగా ఆదివారం ‘తెలంగాణ ఆవిర్భావం.. సాధించిన ప్రగతి…’ అనే అంశంపై సభలో లఘు చర్చ సందర్భంగా దాదాపు రెండు గంటలకు పైగా ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల పూర్వాపరాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆనాటి ఉద్యమం, కాల్పులు, అణచివేత గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా అంశాలను వివరిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి చెందిన నాటి నెహ్రూ నుంచి నేటి రేవంత్‌ వరకూ అందరిపైనా విమర్శలు గుప్పించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ మోకాలడ్డుతోందని ఆయన దుయ్యబట్టారు. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజరు గతంలో చెప్పిన మాటలను ఉటంకిస్తూ ఎద్దేవా చేశారు. తొమ్మిదేండ్ల కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఏకరువు పెట్టిన ఆయన… రాష్ట్రం సాధించిన ప్రగతిని సోదాహరణంగా వివరించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఉద్యోగులకు పే స్కేలును అమలు చేస్తామంటూ సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. సమయం వచ్చినప్పుడు పింఛన్లు కూడా పెంచుతామని హామీనిచ్చారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని పురస్కరించుకుని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ కమిటీ హాల్‌లోని ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. మరోవైపు రాష్ట్ర శాసనసభ, మండలిలో ఆర్టీసీ బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
కరెంట్‌ చార్జీలకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులే..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉన్న తెలంగాణను ఊడగొట్టింది.. ముంచింది కాంగ్రెస్‌ పార్టీయేననీ, జవహార్‌లాల్‌ నెహ్రూనే దానికి కారణమని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ‘రాష్ట్ర ఆవిర్భావం, సాధించిన ప్రగతి’పై ఆదివారం శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెహ్రూ దగ్గర నుంచి నేటి రేవంత్‌రెడ్డి వరకు ఇదే తీరుగా ఉన్నారని తెలిపారు. భట్టి విక్రమార్క మాట మాట్లాడితే.. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటరు కదా!.. ఆ పార్టీయే మన కొంపముంచిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని విడిగొట్టిన సందర్భంలో ఇచ్చిన హామీలను కాలరాస్తే కాంగ్రెస్‌ పార్టీ ప్రేక్షకపాత్ర వహించిం దని విమర్శించారు. చివరకు 1969 ఉద్యమ సమయం లోనూ ఆపార్టీ కర్కషంగా వ్యవహరించింద న్నారు. ఎంత రాసి రంపాన పెట్టారో.. ఎంత మందిని కాల్చి చంపారో.. ఆ ఘన చరిత్ర అంతా కాంగ్రెస్‌దే అంటూ విమర్శించారు. ఇది చరిత్రలో రికార్డయిందని చెప్పారు. 58 సంవత్సరాల సుధీర్ఘ
ముంచింది కాంగ్రెస్సే పోరాటంతోనే తెలంగాణ వచ్చిందన్నారు. తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధిని సాధించామని చెప్పారు.పెరుగుదలకు ప్రామా ణికం తలసరి ఆదాయమేనని చెప్పారు. తలసరి ఆదాయం ఎంత పెరిగితే ఆ రాష్ట్రం అంత అభివద్ధి దిశలో ఉన్నట్టని వివరించారు. రాష్ట్రం ఏర్పడిన రోజు మన స్థానం ఎక్కడో ఉన్నదనీ, ఏర్పాటు తర్వాత పెద్ద రాష్ట్రాలను వెనక్కు నెట్టి నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకామని తెలిపారు. మన తలసరి ఆదాయం రూ.3.12లక్షల ఉంటే.. మనల్ని ఎకసెక్కాలు చేసిన వారి(ఏపీ) రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.19లక్షలని వివరించారు. రెండురాష్ట్రాల మధ్య రూ.లక్ష వరకు తేడా ఉందన్నారు. గుజరాత్‌ మోడల్‌ అనేది ఒట్టి హంబక్కేనని సీఎం కొట్టి పారేశారు. గుజరాత్‌ రాష్ట్రంకంటే తలసరి ఆదాయం తెలంగాణలోనే ఎక్కువుందన్నారు. అన్ని రకాల సమ్మిళితమైన అభివృద్ధి జరిగితేనే ఇది సాధ్యమైందన్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ నాయకులు కేసీఆర్‌కు పిండం పెడతామని విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చినందుకు పిండం పెడతారా? అని ప్రశ్నించారు. దళిత బంధు గురించి మీ జన్మలో ఎప్పుడైనా ఆలోచించారా? అని కాంగ్రెస్‌ను నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పిండం పెడతారో తెలుస్తదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 7,8 సీట్లు ఎక్కువే గెలుస్తామని చెప్పారు. 24గంటలు విద్యుత్‌ ఇస్తుంటే..అడ్డగోలుగా మాట్లా డుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలోనూ యాగీ చేశారనీ, ఇప్పుడు నోర్లు మూతపడ్డాయ న్నారు. రైతులు పండించిన పంటను మొత్తం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయేనని వివరించారు. మిషన్‌ భగీరథమీద వీరి విమర్శలు అర్థం పర్థం లేకుండా ఉన్నాయన్నారు. 100శాతం నల్లాల ద్వారా ఇంటింటికి తాగు నీరు అందించే రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందీ అంటే అది తెలంగాణాయే అని చెప్పారు. విద్య, వైద్యం విషయంలో కూడా ఒక విజన్‌తో ముందుకు పోతున్నామన్నారు. ప్రాజెక్టుల కింద కాలువలు పూర్తి కాలేదంటూ కాంగ్రెస్‌ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు బాగు చేశామని చెప్పారు. నీటి పారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ధరణి, హరిత హారంపై ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సింగరేణిని నిండా ముంచింది కాంగ్రెస్‌ పార్టీయేనని, అప్పులు కట్టలేక 49 శాతం వాటాను కాంగ్రెస్‌ అమ్మేసిందని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో ఐటి ఉద్యోగుల సంఖ్య 3లక్షలు, మా పాలనలో 6లక్షల 15వేలు’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రూ.4వేలు పింఛన్‌ ఇస్తామంటున్నారు. మేం ఐదు వేలు ఇస్తే..అప్పుడేం చేస్తారు..? అని ప్రశ్నించారు. అందుకే చేయగలిగేవే చెప్పాలన్నారు. ‘మా అమ్ములపొదిలో చాలా అస్త్రాలు ఉన్నరు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది మేం. సంక్షేమాన్ని అమలు చేస్తున్నది మేం. రెండేళ్ల నుంచి పింఛన్‌ను రూ.2వేలు ఇస్తున్నాం. మొదట వెయ్యి ఆ తర్వాత రూ.2వేలు ఇస్తున్నాం అని చెప్పారు. కల్యాణలక్ష్మిలో మొదట రూ.50వేలు.. ఆ తర్వాత రూ.లక్ష ఇచ్చాం. గొర్ల యూనిట్లకు సైతం ఇచ్చే డబ్బుల్ని రూ.1.75లక్షలకు పెంచాం. రైతుబంధు రూ.4వేలతో మొదలు పెట్టి.. రూ.5వేలకు పెంచాం. రాబోయే రోజుల్లో ఎంత దూరం పెంచగలుగుతమో అంత వరకు పెంచుతాం’ అని కేసీఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు. గతంలో ఒకాయన బండి పోతే బండి ఫ్రీ,గుండు పోతే గుండు ఫ్రీ అని చెప్పినాయనకు ..ఇప్పుడు బండి లేదు.. గుండు కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. తాండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశామనీ, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు పెంచామని చెప్పారు. 4లక్షల ఎకరాలకు పైగా పోడు పట్టాలిచ్చామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రమూ ఈ పని చేయలేదన్నారు. తెలంగాణ సంక్షోభంలో లేదనీ, సంక్షేమంలో ఉందని గుర్తుపెట్టుకోవాలంటూ కాంగ్రెస్‌ నేతలకు సీఎం హితవు పలికారు.
చంద్రబాబు పాలనలో కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉంది.. అయినా ఆపార్టీ ప్రేక్షకపాత్రను పోషించిందని విమర్శించారు. ‘తెలుగు దేశం హయాంలో తెలంగాణలో పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రణరు భాస్కర్‌ అనే ఎమ్మెల్యే తెలంగాణ అంటే.. నో నో తెలంగాణ అనే పదం వాడకూడదని ఆనాటి స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చిన స్థాయికి పరిస్థితి దిగజారింది’ అని గుర్తుచేశారు. అలాంటి సమయంలో కూడా కాంగ్రెస్‌ మౌనంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వీళ్ల నోర్లు పెగల్లేదని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంస్కరణ ముసుగులో విద్యుత్‌ చార్జీలను పెంచారనీ, ఒక సంవత్సరం కాదు.. మూడు సంవత్సరాలు 15శాతం పెరుగుతుందని చెబితే కమ్యూనిస్టులు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆ పోరాటాన్ని అణిచివేసే క్రమంలో ప్రభుత్వం కాల్పులు జరిపిందనీ, ముగ్గురు కార్యకర్తలు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ హడావుడిగా దీక్షలు చేసిందని చెప్పారు.
బీజేపీ రాష్ట్రాన్ని కించపర్చింది..
‘మరో వైపు బీజేపీ సమావేశాల్లో ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేశారు.ఆ తీర్మానం కాకెత్తుకు పోయిందో ఏమో కానీ..తెలంగాణను మాత్ర కించపర్చింది. మోడీ రాష్ట్రానికొచ్చి పొడుగు పొడుగు మాట్లాడుతాడు.. ఈ రాష్ట్రమంటే ఆయనకు అంత పగ ఎందుకో తెల్వదు కానీ..అభివృద్ధికి తోడ్పాటును అందించటం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసిందనీ, ఎట్టి పరిస్థితిలో తాము పెట్టబోమని తెగేసి చెప్పామన్నారు. ఉచిత పథకాలొద్దని చెప్పే బీజేపీ..కర్నాటక ఎన్నికల సమయంలో ఇంటికి అర లీటరు పాలు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయినా అక్కడి ప్రజలు తన్ని తరిమేశారని తెలిపారు.
ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ బీఆర్‌ఎస్‌ను బీజేపీకి బీ టీమ్‌ అన్నారనీ, సీన్‌ కట్‌ చేస్తే ఆయనే వెళ్లి బీజేపీలో జొర్రిండు అని కేసీఆర్‌ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. మైనార్టీ హక్కుల కోసం కొట్లాడే ఎంఐఎంను తమ పార్టీకి బీ టీమ్‌ అంటున్నారనీ.. మజ్లీస్‌- బీఆర్‌ఎస్‌ ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో కూడా ఫ్రెండ్లీ పార్టీలుగానే ఉంటామని స్పష్టం చేశారు.

Spread the love