యుద్ధాలను సృష్టిస్తున్నది అగ్రరాజ్యమే

It is the superpower that creates the wars– అమెరికా గుప్పెట్లో మోడీ
– ఆయుధాల అమ్మకంతోనే ఆ దేశ మనుగడ
– పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడికి నిరసనగా ఐప్సో ధర్నాలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ప్రపంచంలో శాంతి లేకుండా చేసేది అమెరికానే. దాని మనుగడే ఆయుధాల అమ్మకంతో ముడిపడి ఉంది. ఎక్కడో ఒక దగ్గర యుద్ధాన్ని సృష్టించి ఆయుధాలు అమ్ముకుని సొమ్ము చేసుకోవటం దాని లక్ష్యం. అందుకే అది శాంతికి వ్యతిరేకం. ఒక్క మాటలో చెప్పాలంటే అదో యుద్ధ పిపాసి. పెట్టుబడి, ఆధిపత్యం కోసం జరిగే యుద్ధాల వల్ల ప్రపంచంలో కోట్లాది మంది అమాయక ప్రజలు బలవుతున్నారు’ అంటూ పలువురు వక్తలు విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం(ఐప్సో) ఆధ్వర్యాన ఇందిరా పార్కు వద్ద ”పాలస్తీనాకు మద్దుతుగా నిలబడదాం- ప్రపంచ శాంతికి పోరాడుదాం” అంటూ ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి అధ్యక్షత వహించారు. సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, మైనార్టీ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మెన్‌ కొత్వాల్‌ అబెదుల్లా, టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం, సీపీఐ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్‌, ఐప్సో రాష్ట్ర నాయకులు జి రఘుపాల్‌ తదితరులు మాట్లాడారు. మల్లారెడ్డి మాట్లాడుతూ పెట్టుబడిదారులు తమ లాభాల కోసం శాంతిని విచ్ఛిన్నం చేస్తున్నారని చెప్పారు. శాంతి..శాంతి అంటూ చేసే నినాదాలు వారి లాభాపేక్షకు ఎక్కడ విఘాతం కలిగిస్తాయోనని ఆందోళన చెందుతున్నారని వివరించారు. అమెరికా కేవలం ఆయుధాల అమ్మకం మీదనే ఆధారపడి బతుకుతుందనీ, అందుకే ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్ధాలను సృష్టిస్తున్నదని చెప్పారు. ప్రపంచ శాంతి దానికి గిట్టదని విమర్శించారు. పాలస్తీనాపై అమెరికా అండదండలతో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధం అమానుషమన్నారు. పాలస్తీనాలోని సుమారు 38వేల మందికి పైగా ప్రజలను ఇజ్రాయిల్‌ హతమార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ అమెరికా భాగస్వామిగా ఉండి, యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేస్తున్నట్టు ఫోజులిస్తుందని విమర్శించారు. ఆ దేశాన్ని శవాల దిబ్బగా చేస్తున్నా..మోడీ ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు.కూనంనేని ప్రసంగిస్తూ పాలస్తీనా మీద ఇజ్రాయిల్‌ దాడులను ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు. అందరూ మాకెందుకులే అనుకుంటే ప్రపంచంలో ఈ మాత్రం శాంతి కూడా ఉండేది కాదన్నారు. మా కుటుంబాన్ని మేం చూసుకుంటాం, లేదా మా గ్రామాన్ని మేం చూసుకుంటామనుకుంటే సరిపోదన్నారు. ప్రపంచ ప్రజలంతా పాలస్తీనా, ఇజ్రాయిల్‌ అంశంపై స్పందించాలన్నారు. దేశాన్ని పాలిస్తున్న పాలకులు (బీజేపీి) ఈరోజు పాలస్తీనాను విచ్ఛిన్నం చేస్తుంటే స్పందించడం లేద న్నారు. మోడీ, బీజేపీ హిట్లర్‌ మూసలో ఉన్నారని విమర్శిం చారు.కోదండరామ్‌ మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ ఏకపక్షంగా చేస్తున్న టువంటి దాడుల ఫలితంగా అక్కడ విద్యార్థులు, యువకులు, నాగరికత దేశ భవిష్యత్తు మొత్తం నేలమట్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనా గత కొన్ని దశాబ్దాలుగా తమ దేశాన్ని స్వతంత్య్ర దేశంగా ప్రకటించాలని పోరాడు తున్నదనీ, ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి మధ్యే మార్గంగా కొన్ని తీర్మా నాలు చేసినప్పటికీ ఇజ్రాయిల్‌ వాటిని అమలు చేయకపోగా పాలస్తీనా పాఠశాలలు , దవాఖానాల మీద బాంబుల వర్షం కురిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్‌ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌, రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవిఎల్‌, ప్రధాన కార్యదర్శి జి నాగేశ్వరరావు, కాచం సత్య నారాయణ, ఐప్సో నాయకులు జేకే శ్రీనివాస్‌, పశ్యపద్మ, విమలక్క, ఎంఏ మాజీద్‌, అప్సాబేగం , నాగేందర్‌ ప్రసాద్‌, రవి కిరణ్‌, ఉమా మహేశ్‌, ప్రేమ్‌ పావని, రామరాజు, యమునా గౌడ్‌ , గురుబచనం సింగ్‌, లాక్ష్మా నాయుడు , తదితరులు పాల్గొన్నారు.

Spread the love