మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమే..కానీ..

– బిజెపికి గట్టి కౌంటర్‌ ఇచ్చిన సచిన్‌ పైలట్‌
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నాయకులు రాజేశ్‌ పైలట్‌పై బిజెపి ఐటీ సెల్‌ ఇన్‌ఛార్జ్‌ అమిత్‌ మాలవీయ చేసిన ఆరోపణలపై ఆయన కుమారుడు, కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ స్పందించారు. తన తండ్రి బాంబులు వేసిన మాట వాస్తవమేనని, అయితే, మాలవీయ చెప్పిన సమాచారం తప్పని స్పష్టం చేశారు. ‘1966 మార్చి 5న మిజోరాం రాజధాని ఐజ్వాల్‌ పై అప్పటి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌రాజేశ్‌ పైలట్‌, సురేశ్‌ కల్మాడీ లు బాంబుల వర్షం కురిపించారు. అనంతరం ఆ ఇద్దరినీ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలను చేసి మంత్రి పదవులు కట్టబెట్టింది’ అంటూ అమిత్‌ మాలవీయ ఇటీవలే ఓ ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన సచిన్‌ పైలట్‌.. మాలవీయ ఆరోపణలను ఖండించారు. తన తండ్రి బాంబులు వేసిన మాట వాస్తవమేనని, అయితే మాలవీయ చెప్పిన తేదీలు, వివరాలు తప్పని పేర్కొన్నారు. ‘నిజమే మాలవీయ చెప్పినట్లు నా తండ్రి రాజేశ్‌ పైలట్‌ బాంబులు వేశారు. ఎయిర్‌ ఫోర్స్‌ పైలట్‌ గా 1971 ఇండో-పాక్‌ యుద్ధంలో పాల్గొన్నారు. తూర్పు పాకిస్థాన్‌ భూభాగంపై ఆయన బాంబులు వేశారు. వాస్తవానికి మా నాన్న 1966 అక్టోబర్‌ 29న ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ లో చేరారు. కావాలంటే సర్టిఫికెట్‌ చూసుకోండి’ అని సచిన్‌ పైలట్‌ వివరించారు. ఈ మేరకు తన తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో జాయిన్‌ అయిన సర్టిఫికెట్‌ ను ట్వీట్‌కు జోడించారు.

Spread the love