– రుజువు చేస్తే పదవికి రాజీనామా
– తప్పుడు ప్రచారం చేస్తున్న ఉపసర్పంచ్ పగడాల శ్రీశైలం
– కమిషన్ల కోసమే నాపైన ఆరోపణలు చేస్తున్నా ఉపసర్పంచ్
– పాలకవర్గంలో బాధ్యత లేకుండా ప్రవర్తన
– త్వరలోనే ఉప సర్పంచ్ చిట్టా బయట పెడతా
– తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలి
– సర్పంచ్ కంబాళ్లపల్లి సంతోష
నవతెలంగాణ-యాచారం
తన పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉప సర్పంచ్ పగడాల శ్రీశైలం కావాలనే ఆరోపణలు చేస్తున్నాడని సర్పంచ్ కంబాళ్లపళ్లి సంతోష ఆరోపించారు. బుధవారం తన పైన మీడియాలో వచ్చిన ఆరోపణలను నివృత్తి చేసేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష మాట్లాడుతూ గ్రామ సమస్యలపై పంచాయతీ పాలకవర్గం సమావేశం జరుగుతుండగా దొంగ చాటుగా వీడియోలు తీసి దుష్ప్ర చారం చేస్తున్నాడని మండిపడ్డారు. గ్రామపంచాయతీలో తాను అక్రమాలకు పాల్పడితే రుజువు చేయాలని సవాలు విసిరారు. దళిత సర్పంచ్ అయినందుకే తన పైన కక్ష కట్టి ఉపసర్పంచ్ లేనిపోని ఆరోపణలు చేస్తూ తనను అవమానాలకు గురి చేస్తున్నాడని విమర్శించారు. గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన వెంచర్లన్నీ ప్రభుత్వానిబంధన ప్రకారమే జరిగాయని గుర్తు చేశారు. వెంచర్ల విషయంలో తాను ఎటువంటి పొరపాటు చేయలేదని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధిలో అడుగడుగునా ఉపసర్పంచ్ అడ్డుపడుతున్నాడనీ, అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నాడని తెలిపారు. ఏదైనా తప్పుడు పని చేస్తే తనను గ్రామపంచాయతీ పాలకవర్గంలో నిలదీయాలి కానీ, దొంగ చాటుగా వీడియోలు తీసి బదున్నాం చేయడం పిరికిపందల చర్యని చెప్పారు. తక్షణమే ఉపసర్పంచ్ బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని సర్పంచ్ సంతోష హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బొజ్జ వెంకట్ రెడ్డి, తోకల యాదమ్మ, కంబాళ్ల పెళ్లి పుల్లమ్మ, పట్నం లక్ష్మమ్మ, పడకంటి సబితా తదితరులు పాల్గొన్నారు.