శాంతిభద్రతల సంరక్షణ మీ బాధ్యత

– బాలిక హత్యపై కఠిన చర్యలు తీసుకోండి
– ‘షహబాద్‌ డెయిరీ’ మర్డర్‌ కేసుపై ఎల్జీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌
న్యూఢిల్లీ : ఢిల్లీలోని షహబాద్‌ డెయిరీలో చోటు చేసుకున్న బాలిక హత్య దేశరాజధానిలో శాంతిభద్రతల పరిస్థితులను మరోసారి ప్రశ్నార్థకంగా మార్చేశాయి. బాలిక హత్య, ఇక్కడి శాంతిభద్రతల పరిస్థితులపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. బాలిక హత్య కేసులో కఠిన చర్యలు తీసుకోవాలనీ, నగరంలో శాంతి భద్రతలను కాపాడటం మీ బాధ్యత అని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) వి.కె సక్సేనాను కోరుతూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ”ఢిల్లీలో బాలిక దారుణంగా హత్యకు గురైంది. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. నేరస్థులు నిర్భయంగా మారారు. పోలీసుల భయం లేదు. ఎల్జీ సార్‌, శాంతిభద్రతలు మీ బాధ్యత, ఏదైనా చేయండి” అని ఢిల్లీ సీఎం పేర్కొన్నారు. ఎల్జీకి రాజ్యాంగం కేంద్రపాలిత ప్రాంత ప్రజలను రక్షించే బాధ్యతను ఇచ్చిందని ఆప్‌ సీనియర్‌ నాయకురాలు అతిషి ట్వీట్‌ చేశారు. వాయువ్య ఢిల్లీలోని షహబాద్‌ డెయిరీలో 16 ఏండ్ల బాలికను ఆమె ప్రియుడు కత్తితో పొడిచి చంపాడనీ, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

Spread the love