మద్యం వ్యాపారుల ఇండ్లపై ఐటీ దాడులు..బీరువాల నిండా నోట్ల కట్టలే

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆదాయపు పన్ను ఎగవేస్తున్న మద్యం వ్యాపారుల ఇండ్లపై ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు. ఒడిశాలోని రాయగడ గాంధీనగర్‌లో నివాసముంటున్న మద్యం వ్యాపారి అరవింద్‌ సాహు ఇల్లు, కార్యాలయాల్లో బుధ, గురువారాల్లో సోదాలు నిర్వహించారు. అయితే అక్కడ ఎంత నగదు దొరికిందో అధికారుల వెల్లడించలేదు. భువనేశ్వర్‌, సుందర్‌గఢ్‌, బౌద్ధ్‌ జిల్లాలతోపాటు టిట్లాగఢ్‌లోనూ పలువురు మద్యం వ్యాపారుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. టిట్లాగఢ్‌ పట్టణంలో ఉంటున్న దీపక్‌ సాహు, సంజయ్‌ సాహు, రాకేశ్‌ సాహుల ఇళ్లలో రెండురోజుల తనిఖీల్లో రూ.510 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. బీరువాల నిండా పేర్చి ఉన్న నోట్లకట్టలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. డబ్బును బుధవారం రాత్రి బొలంగీర్‌ ఎస్‌బీఐ శాఖకు తరలించారు. రాష్ట్రంలో 20 ప్రాంతాలతోపాటు ఝార్ఖండ్‌, కోల్‌కతాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Spread the love