ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం ‘బేబీ’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ఎస్‌కెఎన్ నిర్మించారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ వైష్ణవి చైతన్య మీడియాతో ముచ్చటించారు.
‘యూట్యూబర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సోషల్ మీడియా ఇంఫ్లూయెన్సర్‌గా నేను అందరికీ సుపరిచితురాలినే. ఇది హీరోయిన్‌గా నా మొదటి సినిమా. కథ విని షాక్ అయ్యాను. ఇందులోని పాత్రను పోషిస్తానా? లేదా? అని నా మీద నాకు నమ్మకం లేనప్పుడు దర్శకుడు సాయి రాజేష్ నన్ను నమ్మారు. ఇందులో నాది ఓ బస్తీలో పెరిగే ఓ అమాయకురాలైన అమ్మాయి. బస్తీ నుంచి బయటకు వచ్చిన ఆ అమ్మాయి జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేది కథ.
ఆ జీవితం నుంచి ఏం నేర్చుకుంటుంది? చిన్నప్పటి నుంచే ఓ అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. కాలేజ్‌కు వచ్చాక మరో అబ్బాయి లైఫ్‌లోకి వస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి జీవితం ఎలా ప్రభావితం అయింది అనేది చక్కగా చూపించారు. ఇది మ్యూజిక్ ఓరియెంటెడ్ సినిమా. ఈ కథ విన్నప్పుడు నా జీవితమే గుర్తుకు వచ్చింది. రియల్ లైఫ్‌లోంచి తీసుకున్న కథ. ఇలాంటి పాత్ర వచ్చినందుకు ఎంతో గర్వపడుతుంటాను. అమ్మాయి కోణంలోంచి
ఈ కథ నడుస్తుంటుంది. సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది. తొలిప్రేమ అనేది జీవితంలో ఎప్పటికీ ఓ అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఎప్పటికీ జీవితంలో మధురానుభూతిలా మిగిలిపోతుంది. ఈ సినిమాతోనూ అదే చెప్పబోతోన్నాం. విజరు బుల్గానిన్ మ్యూజిక్ ఈ సినిమాకు బెస్ట్ గిఫ్ట్. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసేందుకు ఇష్టపడతాను. గ్లామర్ రోల్స్ కంటే.. పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తాను. ఎస్‌కేఎన్ పర్ఫెక్ట్ నిర్మాత. సాయి రాజేష్‌ని నమ్మి ఈ సినిమాకు అండగా నిలబడ్డారు’ అని వైష్ణవి చైతన్య అన్నారు.