మూసేస్తామన్నారు

– ఉద్యోగులపై దాడులు చేస్తామని బెదిరించారు..
– మోడీ ప్రభుత్వంపై ట్విట్టర్‌ మాజీ సీఈఓ జాక్‌ డార్సే సంచలన విమర్శలు
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ట్విట్టర్‌ మాజీ సీఈఓ జాక్‌ డార్సే సంచలన విమర్శలు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టిన సమయంలో ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ కొందరు పాత్రికేయులు పెట్టిన పోస్టులను తొలగించాల్సిందిగా మోడీ ప్రభుత్వం తమను కోరిందని,లేకుంటే భారత్‌లో ట్విట్టర్‌ను మూసేస్తామని బెదిరించిందని, ఉద్యోగుల నివాసాలపై దాడులు కూడా చేస్తామని హెచ్చరించిందని ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఇచ్చిన ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో మోడీ ప్రభుత్వంపై డార్సే ఆరోపణలు సంధించారు.
బ్రేకింగ్‌ పాయింట్స్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌కు ట్విట్టర్‌ వ్యవస్థాపకుడు, మాజీ యజమాని డార్సే ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఇస్తూ పలు సంచలన విషయాలు బయటపెట్టారు. ‘భారత్‌, టర్కీ దేశాల ప్రభుత్వాలు కొందరు పాత్రికేయుల ఖాతాలను తొలగించాలని పలు సందర్భాలలో కోరాయి. లేకుంటే వారిని ఎలా సంప్రదించాలో తెలియజేయాలని అడిగాయి. ట్విట్టర్‌ నుంచి వారి పోస్టులను తీసేయాలని బెదిరించాయి’ అని ఆయన చెప్పారు. తన హయాంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు ట్విట్టర్‌ కట్టుబడి ఉండేదని, అలా కాకుండా ఆయా దేశాలలో అమలులో ఉన్న చట్టాల ప్రకారం నడుచుకొని ఉంటే అక్కడి ప్రభుత్వాలు వాటిని అడ్డు పెట్టుకొని తమకు ఇష్టంలేని పోస్టులను తొలగించాల్సిందిగా డిమాండ్‌ చేసేవని తెలిపారు. ట్విట్టర్‌ ప్రస్తుత అధ్యక్షుడు ఎలన్‌ మస్క్‌ మాత్రం ప్రభుత్వ చట్టాలను గౌరవిస్తారని వ్యాఖ్యానించారు. ‘ఈ సంవత్సరం ఏప్రిల్‌లో మస్క్‌ బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉద్యోగులు జైలుకు వెళ్లే పరిస్థితి కల్పించడం కంటే భారత ప్రభుత్వ ఆదేశానుసారం నడుచుకోవడమే మంచిదని తాను భావించానని ఆయన చెప్పారు. సామాజిక మాధ్యమాలపై భారత్‌లో అమలులో ఉన్న నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని కూడా మస్క్‌ తెలిపారు. దేశ చట్టాలను అతిక్రమించకూడదని అన్నారు’ అని గుర్తు చేశారు.
భారత్‌లో తమకు పెద్ద మార్కెట్‌ ఉన్నదని డార్సే చెప్పారు. రైతుల నిరసన ప్రదర్శనలు జరిగిన సమయంలో ప్రభుత్వం నుండి పలు అభ్యర్థనలు, హెచ్చరికలు వచ్చాయని డార్సే తెలిపారు. ప్రభుత్వ విధానాలను విమర్శించే పాత్రికేయుల అకౌంట్లను ఆపేయాలని, లేకుంటే దేశంలో ట్విట్టర్‌ను మూసేస్తామని బెదిరించారని వివరించారు. భారత్‌ ఒక ప్రజాస్వామిక దేశం కదా అని వ్యంగ్యోక్తులు విసిరారు. రైతుల ఆందోళనకు సంబంధించి అభిప్రాయాలు వ్యక్తం చేసిన వ్యక్తులు, గ్రూపులు, మీడియా సంస్థల ట్విట్టర్‌ ఖాతాలను నిలిపివేయాలంటూ ప్రభుత్వం చట్టపరమైన నోటీసులు పంపడంతో 2021 ఫిబ్రవరిలో ఆ ఖాతాలను యాజమాన్యం నిలిపివేయాల్సి వచ్చింది. అమిత్‌ షా నేతృత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశానుసారమే ట్విట్టర్‌ ఈ ఖాతాలను నిలిపివేసిందని పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాలను ఉటంకిస్తూ ఎఎన్‌ఐ వార్తా సంస్థ అప్పట్లో తెలిపింది.
టర్కీ, నైజీరియా దేశాలలో కూడా ప్రభుత్వాల నుంచి ఇలాంటి బెదిరింపులే వచ్చాయని డార్సే చెప్పారు. కాగా డార్సే వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాలలో పలువురు స్పందించారు. ట్విట్టర్‌ చరిత్రలో అత్యంత సందేహాస్పద కాలాన్ని చెరిపివేసేందుకు డార్సే ప్రయత్నించారని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. 2020-2022 జూన్‌ మధ్యకాలంలో భారతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడంలో ట్విట్టర్‌ విఫలమైందని ఆరోపించారు. భారత సార్వభౌమత్వాన్ని అంగీకరించడంలో డార్సే హయాంలోని ట్విట్టర్‌కు సమస్యలు ఉన్నాయని చెప్పారు. 2021 జనవరిలో జరిగిన ఆందోళనకు సంబంధించి ట్విట్టర్‌లో తప్పుడు ప్రచారం చోటుచేసుకుందని, మారణహోమం జరిగిందన్న వార్తలూ వచ్చాయని, అయితే అవన్నీ కట్టుకథలేనని తెలిపారు. తప్పుడు వార్తలను తొలగించాల్సిందిగా ట్విట్టర్‌ను కోరామని అన్నారు. ఎవరి పైనా దాడి చేయలేదని, ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని చెప్పారు.
ఏం జరిగింది?
2021 మేలో ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగానికి చెందిన పలువురు అధికారులు గురుగావ్‌, ఢిల్లీలోని ట్విట్టర్‌ కార్యాలయాలపై దాడులు చేశారు. బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర చేసిన వివాదాస్పద ట్వీట్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ ట్వీట్‌ను తొలగించాల్సిందిగా మోడీ ప్రభుత్వం ట్విట్టర్‌ను హెచ్చరించిన రెండు రోజుల తర్వాత అధికారులు ట్విట్టర్‌ కార్యాలయాలపై దాడులు చేశారు. వారం రోజుల తర్వాత అధికారులు బెంగళూరు వెళ్లి అప్పటి ట్విట్టర్‌ బారత చీఫ్‌ మనీష్‌ మహేశ్వరిని ప్రశ్నించారు.
సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలను తొలగించే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ మోడీ సర్కారు ఐటీ నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటిని కర్నాటక హైకోర్టులో ట్విట్టర్‌ సవాలు చేసింది. పలు ట్వీట్లు, అకౌంట్లు, యూఆర్‌ఎల్‌లను తొలగించాల్సిందిగా జారీ చేసిన ఆదేశాలను ఉదహరించింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో కోర్టు తన తీర్పును రిజర్వ్‌ చేసింది. ఆ తీర్పు వెలువడాల్సి ఉంది.
ప్రజాస్వామ్యం గొంతు నులిమారు
– మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల మండిపాటు
– డార్సే ప్రశ్నలకు బదులివ్వాలని డిమాండ్‌
ప్రజాస్వామ్యం గొంతు నులిమారు
న్యూఢిల్లీ : ట్విట్టర్‌ను మూసేస్తామని, ఉద్యోగుల నివాసాలపై దాడులు చేస్తామని రైతుల ఆందోళన సమయంలో మోడీ ప్రభుత్వం చేసిన హెచ్చరికలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నులిమిందని విమర్శించాయి. ట్విట్టర్‌ మాజీ సీఈఓ డార్సే సంధించిన ప్రశ్నలకు జవాబివ్వాలని డిమాండ్‌ చేశాయి. దేశంలో ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడిందని శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే) ఎంపీ సంజరు రౌత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. డార్సే లేవనెత్తిన ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా డిమాండ్‌ చేశారు. దేశ చట్టాలను ట్విట్టర్‌ ఉల్లంఘించిందంటూ కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలపై శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే)కు చెందిన మరో ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేస్తూ చట్టాలను ఉల్లంఘనలకు పాల్పడేది బీజేపీయేనని ఎద్దేవా చేశారు. రైతు నేత రాకేష్‌ టికాయత్‌ మాట్లాడుతూ రైతుల ఆందోళనపై ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో సమాచారం రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. ట్విట్టర్‌ అధిపతే స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారని అన్నారు. అలాంటి సంస్థలపై ఎవరూ ఒత్తిడి తేలేరని, ప్రభుత్వం మాత్రమే అలాంటి ప్రయత్నం చేసి ఉంటుందని, డార్సే చెప్పింది వాస్తవమేనని పేర్కొన్నారు. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఎంత ఆందోళనకర పరిస్థితులలో ఉన్నాయో డార్సే వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయని కాంగ్రెస్‌ నాయకుడు డీకే శివకుమార్‌ తెలిపారు. 2021లో రైతుల ఆందోళన జరిగిన సమయంలో సుమారు 1,200 ఖాతాలను నిలిపివేయాలని మోడీ ప్రభుత్వం ట్విట్టర్‌ను ఆదేశించింది. ఈ ఖాతాలకు ఖలిస్థాన్‌తో సంబంధాలున్నాయని ఆరోపించింది. అంతకుముందు కూడా 250 అకౌంట్లను నిలిపివేయాలని ట్విట్టర్‌ను కోరింది.

Spread the love