గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయం అవుతూ రూపొందిన ‘సర్కారు నౌకరి’ ఈ ఏడాది తొలి సినిమాగా ప్రేక్షకులను పలకరించనుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మించిన చిత్రమిది. జనవరి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ’14 డేస్ లవ్’ లాంటి పలు చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటి తర్వాత సంక్రాంతికి సందడి చేయటానికి ఏకంగా 5 తెలుగు, 2 తమిళ సినిమాలు రాబోతున్నాయి. ఒకేసారి ఇన్ని సినిమాలు విడుదలైతే కలెక్షన్ల విషయంలో ఏ నిర్మాతకీ న్యాయం జరగదనే కఠోర వాస్తవం తెలిసినప్పటికీ ఈ సినిమాల నిర్మాతలు తగ్గేదేలా.. అన్న చందంగా బరిలోకి దిగుతున్నారు.
జనవరి 12
మహేష్‌బాబు, త్రివిక్రమ్ వంటి క్రేజీ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ‘గుంటూరుకారం’. ‘అతడు’, ‘ఖలేజా’వంటి సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అటు ప్రేక్షకుల్లోను, ఇటు మహేష్, త్రివిక్రమ్ అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భారీ అంచనాల నడుమ ‘హను-మాన్’ సినిమా పోటీకి సై అంటోంది. తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ కలయికలో పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమా తన
భవితవ్యాన్ని తేల్చుకోనుండగా, పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సైతం ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తూ గట్టి సవాల్ విసురుతోంది. ఇక వీటితోపాటు ‘అయలాన్’ సినిమాతో శివకార్తికేయన్ కూడా తగ్గేదేలే.. అంటూ పోటీకి దిగుతున్నారు. ఏడేళ్ళుగా పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతోంది. అయితే తెలుగులో విడుదల ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ నాలుగు సినిమాలు వేటికవే మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి.
జనవరి 13 వెంకటేష్ నటించిన ‘సైంధవ్’ సంక్రాంతి బరిలో అమీతుమీ తేల్చుకోనుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రవితేజ ‘ఈగల్’ సినిమాతో పొంగల్‌కి రాబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ‘సైంధవ్’గా వెంకీ, ‘ఈగల్’గా రవితేజ
సై అంటూ బరిలోకి దిగటం ఈ సంక్రాంతి ప్రత్యేకత. ఈ పోటీని మరింత రసవత్తరం చేసేందుకు నెక్ట్స్ డే
‘నా సామిరంగ’ అంటూ నాగ్ రంగంలోకి దిగుతున్నారు.
జనవరి 14
నూతన దర్శకుడు విజరు బిన్నీ దర్శకత్వంలో నాగార్జున నటించిన చిత్రం ‘నా సామి రంగ’.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి పక్కా మాస్ సినిమాగా నిర్మించారు.