మబ్బే..మసకేసిందిలే..

– విస్తారంగా వర్షాలతో రైతుకు ఊరట
– పొంగుతున్న వాగులు, చెరువులు
– వరి నాట్లు వేస్తున్న రైతులు
– ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలోకి వరద
– ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు
– పెరుగుతున్న భద్రాద్రి గోదావరి నీటి మట్టం
రాష్ట్రవ్యాప్తంగా ముసురు పట్టింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలు నెలన్నర రోజులుగా ఎదురుచూస్తున్న రైతులకు ఊరటనిచ్చాయి. బోసిపోయిన సాగునీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. చెరువులు, కుంటలు పొంగి పొరుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. దాంతో రైతులు నాట్లకు సిద్ధమయ్యారు. మరో పక్క రోడ్లన్నీ జలమయం అవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లు కూలాయి. లోతట్టు ప్రాంతాలు వరదనీటితో మునిగాయి. ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తమై కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేశారు.
నవతెలంగాణ-విలేకరులు
రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. మలుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దాంతో అధికారులు అందుబాటులో ఉండాలని, రాత్రింబవళ్లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతాల వద్ద నది వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరిలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. తుపాకుల గుడెం సమ్మక్క సారక్క బ్యారేజ్‌ 45 గేట్లను ఎత్తడంతో పేరూరు వద్ద గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్నది. బోదపురంలోని జిన్నెలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో ఏజెన్సీ గిరిజన గ్రామాలైన సీతారామపురం, కలిపాక, ముత్తారం, పెంకవాగు, కొత్తగుంపు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పాలెం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి విడిచి పెట్టారు. మైతాపురం వద్ద పాలెం ప్రాజెక్ట్‌ ప్రధాన కాలువకు గండి పడింది. ఎలిశెట్టిపల్లి వద్ద జంపన్నవాగు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. దాంతో ఎలిశెట్టి పల్లికి చెందిన ఇద్దరు గర్భిణీలు.. డబ్బాకట్ల సునీత, చెరుకుల శ్రీమతి.. వాగు దాటలేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలుసుకున్న జిల్లా ఎస్పీ గౌస్‌ అలం.. విపత్తు నిర్వహణా బృందానికి సమాచారం ఇచ్చారు. దాంతో వారు వాగు వద్దకు చేరుకొని అత్యాధునిక రబ్బర్‌ బోట్‌ సహాయంతో గర్భిణీలను రక్షించి ఏటూరు నాగారం ఆస్పత్రికి తరలించారు. పేరూరు వద్ద గోదావరి నీటి మట్టం బుధవారం 11.50 అడుగులకు చేరింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. మట్టి రోడ్లపై కనీసం కాలినడకన వెళ్లలేని పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాలు వరదనీటితో మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో వాగులు వంకలు పారుతు న్నాయి. గజ్వేల్‌ బస్టాండ్‌ పూర్తిగా బురద మయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దుబ్బాకలో శిథిలావస్థకు చేరిన ఇండ్లు కూలాయి. ఖమ్మం జిల్లాలో బుధవారం 523 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెంలో 1184 మి.మీ వర్షంపాతం నమోదు అయింది. దాంతో స్థానిక మంత్రి అజరు.. హైదరాబాద్‌ నుంచి టెలికాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి, ఖమ్మం శివారు మున్నేరు నీటి మట్టాలపై ఆరా తీశారు. ఉమ్మడి మహ బూబ్‌నగర్‌ జిల్లాలో ఖరీఫ్‌ మొదలై రెండు నెలలు కావస్తున్నా ఎగువనున్న కర్నాటక, మహారాష్ట్రల్లో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం, జూరాల రిజర్వాయర్లకు చుక్క నీరు రాలేదు. ఈ రిజర్వాయర్ల మీద ఆధారపడిన కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌ రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. హైదరా బాద్‌లో కురుస్తున్న ముసురుతో రోడ్లన్నీ జల మయమయ్యాయి. దాంతో ట్రాఫిక్‌ పెరిగింది. లోతట్టు ప్రాంతాలు వరదల మయమవు తున్నాయి. పలుచోట్ల విద్యుత్‌ అంతరాయం నెలకొంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో నారా యణపురం మండలం జనగామ గ్రామంలో 27.4 మిల్లీమీటర్లు, బొమ్మలరామారం మండ లంలో 22.8 మిల్లి మీటర్ల వర్షపాతం నమో దైంది. నల్లగొండ జిల్లాలోని మునుగోడులో 28.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, జిల్లాలో జూన్‌ 1 నుంచి నేటి వరకు 158.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా 137.1 నమోదు అయింది. ఇప్పటికీ 14 శాతం లోటు వర్షపాతం నమో దైంది. నిజా మాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి నిజామాబాద్‌ నగర శివారులో గూపన్‌పల్లి ఉన్నత పాఠశాల చెరువును తలపిస్తోంది. పాఠశాల మొత్తం నీటితో నిండి పోయి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పాఠశాలలో 150 మంది విద్యార్థు లుండగా.. కేవలం 30 మంది హాజరవు తున్నారు. వరం గల్‌ జిల్లాలో ఇల్లు కూలి మహిళ మృతి చెందిం ది.
ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ఇన్నాండ్లు లోటు వర్షపాతం నమోదు కాగా తాజాగా కురుస్తున్న వర్షాలతో వర్షపాతం సాధారణ స్థితికి చేరుకుంది. 10 మండలాల్లో సాధారణం కంటే అధికంగా కురవగా, మరో 10 మండలా ల్లో మాత్రం తక్కువగా కురిసింది. మిగతా 50 మండలాల్లో సాధారణానికి చేరు కుంది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలు పంటలకు ప్రయోజనం చేకూర్చగా.. మరికొన్ని రోజులు నిరంతరంగా ఉంటాయని వాతావరణశాఖ చెబుతోంది. గోదావరి, ప్రాణహిత నదులకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాణహిత నదీ ప్రవాహం పుష్కరఘాట్‌ల మెట్లను తాకుతూ వెళ్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 9 మీటర్ల మేర నీటి మట్టం నమోదైంది. కడెం, ఎల్లంపల్లి, కుమురం భీం(అడ), సాత్నాల, మత్తడివాగు, స్వర్ణ, వట్టివాగు తదితర ప్రాజెక్టులు కొత్త నీటి తో నిండుకుంటున్నాయి. బుధవారం రాత్రి కడెం ప్రాజెక్టు 9వ గేట్‌ను రెండు ఫీట్ల మేర ఎత్తారు. అవుట్‌ ఫ్లో 2,865 క్యూసెక్కులు కాగా ఇన్‌ఫ్లో 8699 క్యూసెక్కులని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
‘బొగత’కు పర్యాటకుల సందర్శన నిలిపివేత
ములుగు జిల్లా వాజేడులోని బొగత జలపాతం 50 అడుగుల ఎత్తుతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ అటవీ ప్రాంతంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి.. బొగతలోకి భారీగా వరద పోటెత్తు తోంది. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో బొగత జలపాతానికి సందర్శకులను నిలిపి వేశారు. పెరిగిన భద్రాద్రి గోదావరి నీటి మట్టం ఎగువన ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం భారీగా పెరుగుతోంది. ఎగువన కాళేశ్వరం, ఇంద్రావతి, తాలిపేరు నదుల నుంచి వచ్చే వరదల వల్ల బుధవారం రాత్రికి భద్రాచలం వద్ద 35 అడుగులకు నీటిమట్టం చేరవచ్చని కలెక్టర్‌ ప్రియాంక అలా తెలిపారు. కాళేశ్వరం నుంచి 2.35 లక్షలు, ఇంద్రావతి నుంచి 2.15 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. పేరూరు వద్ద 5.3 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో ప్రవహిస్తోంది. తాలిపేరు ప్రాజెక్టు నుంచి 60వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగం సూచించింది. మరోవైపు పాల్వంచ సమీపం లోని కిన్నెరసానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీని సామర్థ్యం 407 అడుగులు, ప్రస్తుతానికి 398.50 అడుగులకు చేరింది 4,074 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.
జలమయమైన ఎల్కతుర్తి కేజీబీవీ
– ట్రాక్టర్‌లో విద్యార్థులను తరలించిన ట్రైనీ ఐపీఎస్‌
నవతెలంగాణ-ఎల్కతుర్తి
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్భా బాలికల ఆశ్రమ పాఠశాల పూర్తిగా నీటితో నిండిపోయింది. సుమారు 200 మంది విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో గమనించిన ఎల్కతుర్తి ట్రైనీ ఐపీఎస్‌ అధికారి అంకిత్‌ శర్వాంకర్‌, ఎస్‌ఐ రాజకుమార్‌, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కడారి రాజు, సర్పంచ్‌ నిరంజన్‌ రెడ్డి ట్రాక్టర్లతో విద్యార్థులను బయటకు తీసుకువచ్చి, ప్రయి వేటు బస్సుల ద్వారా, మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌కు తరలించారు. విద్యార్థులకు తన సొంత ఖర్చులతో ట్రైనీ ఐపీఎస్‌ అధికారి బిస్కెట్‌ ప్యాకెట్లను అందజేశారు. అలాగే వారికి భోజన సదుపాయాలను అందించాలని ఎంపీటీసీ రాజును ఆదేశించారు. ఆయన వెంట హెడ్‌ కానిస్టేబుల్‌ శంకర్‌, సిబ్బంది, బక్కయ్య వెంకన్న నిరంజన్‌. వీఆర్‌ఏ బొంకూరి రవీందర్‌, అల్లకొండ రాజు ఉన్నారు.
మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
పలు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ
 కామారెడ్డి జిల్లా గాంధారిలో 10.7 సెంటీమీటర్ల వాన
 919 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ నివేదిక ప్రకారం రాష్ట్రంలో బుధవారం రాత్రి 11 గంటల వరకు 919 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. 27 చోట్ల భారీ వర్షం, 382 ప్రాంతాల్లో మోస్తరు వానలు పడ్డాయి. కామారెడ్డి జిల్లా గాంధారిలో 10.7 సెంటీ మీటర్లు, జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లో 10.4 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా రాంపూర్‌లో 10.1 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. తెలంగాణ మీదుగా ఉధృతంగా నైరుతి రుతుపవనాలు కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. గురువారం నాడు ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీం నగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో ఆరెంజ్‌ హెచ్చరిక ను వాతావరణ శాఖ జారీ చేసింది. మంచి ర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ములుగు, భద్రా ద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. 21,22 తేదీల్లో ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.
వరినాటు వేసిన మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
నవతెలంగాణ హవేలీ ఘనపూర్‌
మెదక్‌ జిల్లా హవేళీఘనపూర్‌ మండలం లోని చౌట్లపల్లి గ్రామంలో వరి నాటు వేసే కూలీలతో కలిసి ఎమెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నాట్లు వేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే.. ప్రజా సమస్యలతో పాటు వర్షాలతో కలుగు తున్న ఇబ్బందులను అధికారులను ఆదేశించి అప్రమత్తం చేస్తున్నారు. పంట పొలాల వద్దకు వెళ్లి కూలీలు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. హవేళి ఘనాపూర్‌ మండ ల పరిధిలోని చౌట్లపల్లి, శుక్లాల్‌పేట్‌ గ్రామ శివారులో బుధవారం మహిళా కూలీలతో కలిసి బురదలో దిగి వరినాట్లు వేశారు. మహిళలు పాటలకు వారితో గొంతు కలిపారు. మహిళా కూలీలతో కలిసి నాటు వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

Spread the love