నవతెలంగాణ-హైదరాబాద్ : జబర్దస్త్ కమెడియన్ హరిపై ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసు నమోదైంది. రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలతో అతని ముఠాకు చెందిన కిశోర్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అతడిని విచారించగా, దీని వెనుక కమెడియన్ హరి ఉన్నట్టు చెప్పాడు. పోలీసులు అతనిపై కూడా కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు శివారు ప్రాంతంలో ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పోలీసులను చూసి రెండు వాహనాలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక వాహనం డ్రైవర్ తప్పించుకుని పారిపోగా.. మరో వాహనం డ్రైవర్ కిశోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాల్లో ఉన్న రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇక కిశోర్‌ను విచారించగా పలు కీలక విషయాలు వెల్లడించాడు. ఎర్రచందనం దుంగలను భాకరాపేట అటవీప్రాంతం నుంచి అక్రమంగా సేకరించి, బెంగళూరు సమీపంలోని కటిగనహళ్లి గ్రామానికి తరలిస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో జబర్దస్త్ కమెడియన్ హరి ప్రధాన సూత్రధారి అని చెప్పాడు. కిశోర్ చెప్పిన వివరాల ఆధారంగా హరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, హరిపై ఇప్పటికే రెండు కేసులు ఉన్నాయి. కాణిపాకం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసులో హరి నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హరి ఎర్ర చందనం ద్వారా పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలున్నాయి. జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్‌లతో హరి అలియాస్ హరితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.