– సీపీఐ(ఎం) నాయకుల అక్రమ అరెస్టు
– జెండా దిమ్మెలు కూల్చి, గుడిసెవాసులను బెదిరించి బలవంతంగా బీఆర్ఎస్లోకి చేర్చుకున్న వైనం
– ఓటమి భయంతోనే ఈ దుశ్చర్యలు : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య
– కమ్యూనిస్టు నేతలను వెంటనే విడుదల చేయాలి : మాజీమంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ రాజకీయాల్లో గురువారం రాజకీయ నాటకీయ పరిణామం చోటుచేసుకున్నది. నగరంలోని జక్కలొద్దిలో సీపీఐ(ఎం) అండతో గుడిసెలు వేసుకున్న పేదలను బీఆర్ఎస్ నేతలు భయభ్రాంతులకు గురిచేసి సుమారు 1500 మందిని బెదిరించి పార్టీలోకి చేర్చుకున్నారు. గుడిసెవాసుల పోరాటాలకు అండగా ఉన్న సీపీఐ(ఎం) నాయకులను అక్రమంగా అరెస్టు చేసి స్థానిక మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య, కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి కొండా సురేఖ.. అరెస్టయిన సీపీఐ(ఎం) నాయకులు మాలోతు సాగర్, ప్రత్యూష, ఓదెలుతో మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని అమర్యాదగా వ్యవహరించారు. దాంతో కొండా సురేఖ నిరసనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ వెంటనే మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు చేరుకోగా.. ఆయనతో కొండా సురేఖ మాట్లాడుతూ.. ఎలాంటి వారెంట్ ఇష్యూ, పిటిషన్ లేకుండా సీపీఐ(ఎం) నాయకులను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య మాట్లాడుతూ.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నరేందర్ ఓటమి భయంతోనే సీపీఐ(ఎం) నాయకులను అక్రమంగా అరెస్టు చేపిస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నన్నపనేని నరేందర్, ఆయన అనుచరులు తూర్పులో గుండాయిజం చెలాయిస్తూ సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే జక్కలోద్దిలో 3000మంది గుడిసె వాసుల దగ్గరికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీలో చేరితేనే గుడిసెలు ఉంటాయని, సంక్షేమ పథకాలు అందుతాయని ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వినకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే భవిష్యత్తులో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అనంతరం కొండ సురేఖ మాట్లాడుతూ.. బీఅర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్, ఆయన అనుచరులు జక్కలొద్దిలోని గుడిసె వాసుల దగ్గరికి గురువారం ఉదయం వెళ్లి బలవంతంగా సుమారు 1500మందిని బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోవడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో చేరకుంటే మీకు ఇండ్లు ఉండవని గుడిసెవాసులను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేయడం దారుణమన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ నియమాలను పాటించకుండా వివిధ డివిజన్లలో కూడా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి, బీఅర్ఎస్ జెండాలు కప్పి పార్టీలోకి చేర్చుకోవడం సరికాదన్నారు. అలాంటి వారిపై కేసులు పెట్టకుండా సీపీఐ(ఎం) నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దారుణమని, వెంటనే నన్నపనేని నరేందర్‌పై కేసు పెట్టి అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాలోత్ సాగర్, సింగారపు బాబు, నలిగంటి రత్నమాల, ముక్కెర రామస్వామి, ఆరూరి కుమార్, కాంగ్రెస్ నాయకులు నల్గొండ రమేష్, మీసాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ దాడి అనైతికం
– ప్రజలను బెదిరించి ఎన్నికల్లో గెలుస్తారా?
– గుడిసెలపై బీఆర్ఎస్ నాయకుల దాడికి సీపీఐ(ఎం) ఖండన
– ఎర్రజెండా వారికి అండగా ఉంటుందని హెచ్చరిక
– నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్
– ఎన్నికల కమిషన్ జోక్యానికి విజ్ఞప్తి
వరంగల్ జిల్లా జక్కలొద్ది ప్రాంతంలోని పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చి, గద్దెలను, సీపీఐ(ఎం) జెండాలను తొలగించి బలవంతంగా బీఆర్ఎస్ జెండాలను కట్టి నాయకులపై దాడులు చేసి బెదిరింపులకు పాల్పడడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్రకమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అనైతికమని విమర్శించింది. ప్రజలను బెదిరించి ఎన్నికల్లో గెలుస్తారా?అని ప్రశ్నించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం ఐదు గంటలకే ముందస్తు పథకం ప్రకారం తూర్పు వరంగల్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తన 100 మంది గూండాలను తీసుకొచ్చి గుడిసె వాసులపై దౌర్జన్యానికి పూనుకున్నారని తెలిపారు. సీపీఐ(ఎం) రంగసాయిపేట ప్రాంత కార్యదర్శి మాలోతు సాగర్, నాయకులు గణపాక ఓదేలు, ప్రత్యూషపై తప్పుడు ఫిర్యాదు చేసి అరెస్టు చేయించారని పేర్కొన్నారు. గుడిసెవాసులంతా బీఆర్ఎస్లో చేరాలనీ, కండువాలను కప్పుకోవాలనీ, లేదంటే ప్రస్తుతం ఉన్న గుడిసెలను పీకేస్తామంటూ బెదిరించారని తెలిపారు. వాటిని నేలమట్టం చేస్తామంటూ హూంకరించారని పేర్కొన్నారు. పేదలపట్ల కక్షపూరితంగా వ్యవహరించారని విమర్శించారు. ఎన్నికల సమయంలో సంయమనంతో ఉండాల్సిన అధికారపార్టీ నాయకులు, ఇతర రాజకీయ పార్టీల నాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ బెదిరింపులకు భయపడబో మని స్పష్టం చేశారు. గుడిసె వాసులకు ఎర్రజెండా అండగా ఉంటుందని పేర్కొన్నారు. పేదల గుడిసెలపై దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ (ఈసీ) జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.