జగన్‌ సర్కారుకు చుక్కెదురు

ఎన్జీటీ స్టేని ఎత్తివేసేందుకు సుప్రీం నిరాకరణ

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఏపీలోని ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలపై ఎన్జీటీ స్టేని ఎత్తివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. చిత్తూరు జిల్లాలోని ఆవులపల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతిని ఎన్జీటీ కొట్టి వేసింది. ఎన్జీటీ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఎన్జీటీ విధించిన రూ.100 కోట్ల జరిమానాలో ముందుగా రూ.25 కోట్లను వెంటనే కృష్ణా బోర్డులో డిపాజిట్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. జస్జిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రూ.100 కోట్ల జరిమానా విధించవచ్చా? అన్న అంశంపై మాత్రం పాక్షికంగా సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. ఏపి ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీంతో తదుపరి విచారణ న్యాయస్థానం అక్టోబర్‌కు వాయిదా వేసింది.
ఎన్జీటీ రూ.100 కోట్లు జరిమానా విధించడం చట్టబద్ధం కాదని ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రాజెక్టులను మీకు అనుకూలంగా విడగొట్టడం ఎలా చట్టబద్ధమని సుప్రీం ప్రశ్నించింది. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, రూ.100 కోట్ల జరిమానా భారం అవుతుందని రోహత్గీ వాదించారు. రూ.100 కోట్ల జరిమానా నిలుపుదల చేయాలని కోర్టును ముకుల్‌ రోహత్గీ కోరారు. దీంతో ప్రస్తుతానికి రూ.25 కోట్లు కృష్ణా బోర్డులో జమ చేయాల్సిందేనని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను అక్టోబర్‌కు వాయిదా వేసింది.
పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉంది.. ఆర్‌-5 జోన్‌పై సుప్రీం కోర్టు
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని ఆర్‌-5 జోన్‌ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌-5 జోన్‌లో పట్టాలు ఇస్తే కనుక అది తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. అమరావతిలో పేదలకు ఇండ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ కె.ఎం జోసెఫ్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఆర్‌5 జోన్‌లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్‌ తీర్పునకు లోబడే పట్టాల చెల్లుబాటు ఉంటుందని తేల్చి చెప్పింది. పట్టాదారులకు థర్డ్‌ పార్టీ హక్కు ఉండబోదని ఉద్ఘాటించింది. రైతులు, ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం పేర్కొంది. చట్టం ప్రకారమే ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌ కు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడే ఇండ్ల పట్టాలపై హక్కులుంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆర్‌-5 జోన్‌లో ఇప్పటికే ప్లాట్ల కేటాయింపులు జరిగాయని ప్రభుత్వం, సీఆర్‌డీఏ తరపు న్యాయవాది నిరంజన్‌ రెడ్డి పేర్కొనడంతో, ప్లాట్ల కేటాయింపుపై అభ్యంతరం చెప్పమన్నది. కానీ, మూడు రాజధానులపై హైకోర్టు రిట్‌ పిటిషన్‌ తీర్పునకు లోబడే పట్టాల చెల్లుబాటు ఉంటుందని, పట్టాదారులకు థర్డ్‌ పార్టీ హక్కు ఉండదని తేల్చి చెప్పింది. పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు రాష్ట్రం, దేశ ప్రయోజనాల కోసమే రైతులు భూములు ఇచ్చారని సుప్రీం కోర్టుకు తెలిపారు. ఒక మహానగరం వస్తుందని హామీ ఇచ్చారని రైతుల తరపు న్యాయవాది అన్నారు. ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమలు వస్తాయని ఆశచూపినట్టు తెలిపారు. 29 గ్రామాల ప్రజలు ఆ మాటలు నమ్మి.. ఎలాంటి ఆర్థిక పరిహారం తీసుకోకుండా వేల ఎకరాల భూములు ఇచ్చారని గుర్తు చేశారు.
మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అధికారులు వెళ్లి అభివృద్ధిపై ప్రచారం చేశారన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ లో నవనగరాలు ప్రతిపాదించారని అన్నారు. అవి అభివృద్ధి చెందితే ఎన్నో అవకాశాలు వస్తాయన్నారు. ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రూపు రేఖలు మారతాయన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 5 శాతం భూములు ఇవ్వాలని రైతుల తరపు న్యాయవాది అన్నారు. రెసిడెన్షియల్‌ జోన్ల నిబంధనల ప్రకారం కేటాయింపులు ఉండాలన్నారు. నవ నగరాల్లోని ప్రతి నగరంలో రెసిడెన్షియల్‌ జోన్‌ ఉందన్నారు. ప్రభుత్వాలు మారితే ఇచ్చిన హామీలు పక్కన పెట్టలేరన్నారు. కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరి స్తోందని గట్టిగా వాదించారు. జులైలో తుది విచారణ జర గాల్సి ఉందని రైతుల తరపు న్యాయవాది అన్నారు. అంతకు ముందే పట్టాలు ఇస్తే ఇక చేయడానికి ఏముంటుందని ప్రశ్నించారు. ఈ సమయంలో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు తిరిగి ప్రారంభమయ్యాయి.
ఏపీ ప్రభుత్వం తరపున అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. 2023 మార్చి 21న ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని ఆయన కోర్టుకు తెలిపారు. 34వేల ఎకరాల్లో 900 ఎకరాలే అంటే 3.1 శాతమే ఈ ఈడబ్ల్యూఎస్‌కి ఇచ్చారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఆర్‌-5 జోన్‌ పై ఉన్న కేసులన్నీ వ్యక్తిగతంగా వేసినవేనని సింఘ్వీ అన్నారు. వీటిలో ఏవి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కావన్నారు. ఆర్‌-5 జోన్‌లో ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, వారి తరపునే తాము వాదిస్తున్నామన్నారు. కావాలంటే ఎలక్ట్రిక్‌ సిటీకి మరో 900 ఎకరాలు కేటాయించుకోవచ్చని చెప్పారు. ఆర్‌-5 జోన్‌ లో మాత్రమే భూమి తీసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఎలక్ట్రిక్‌ సిటీకి ఇచ్చిన 6,500 ఎకరాల్లో 900 ఎకరాలు తీసుకో వద్దంటే ఎలా? అని సింఘ్వీ ప్రశ్నించారు.

Spread the love