– ఆస్తుల పంపంకంపై షర్మిల
అమరావతి : ఆస్తుల పంపకం విషయంలో జగన్ అనుసరిస్తున్న తీరు సరికాదని ఆయన సోదరి, పిసిసి అధ్యక్షులు షర్మిల తెలిపారు. రెండురోజులుగా వారి వ్యక్తిగత ఆస్తులమీద మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో గురువారం ఆమె స్పందించారు.
గొడవలను సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని ఉందని, అన్ని సాధారణ విషయాలు అంటూనే తల్లీ చెల్లిని కోర్టుకు ఈడ్చారని తెలిపారు. ‘ఇది సామాన్య విషయం కాదు జగన్‌సార్’ అని స్పందించారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగ్గా సమాధానం ఇచ్చేందుకు ఇష్టపడలేదు. అయితే సరస్వతి పవర్లో వాటాలను తన తల్లి, చెల్లికి ప్రేమ పూర్వకంగా రాశామని, ఇటీవల షర్మిల ప్రవర్తిస్తున్న తీరుతో తమకు ఇబ్బంది కలిగిందని, తమ అగ్రిమెంటు రద్దు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ ఎస్‌సిఎల్‌టిని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై రెండు రోజులుగా తీవ్ర దుమారం రేగింది. తన సోదరి తనకు వ్యతిరేకంగా తన పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తోందని, తనపై ప్రేమ లేదని తేలిపోయిందనీ పిటీషన్లో జగన్ పేర్కొన్నారు.
మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య కూడా ఇదే అంశంపై వైసిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా మారారని అన్నారు. హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలను బేఖాతరు చేస్తూ చట్ట విరద్ధంగా మోసపూరితంగా పేర్లను బదిలీ చేశారని తెలిపారు. అందువల్లే జగన్ ఎస్‌సిఎల్‌టిని ఆశ్రయించారని పేర్కొన్నారు. ఎటాచ్‌మెంట్లో ఉన్న ఆస్తుల పేర్లను ఎలా బదలాయిస్తారని ఆయన ప్రశ్నించారు. తండ్రి చనిపోయిన ఇన్నేళ్లకు షర్మిలకు ఈ వ్యవహారం ఎందుకు గుర్తుకు వచ్చిందని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబుకు ఎటువంటి సంబంధమూ లేదని, అయినా టిడిపి అధికారిక ట్విటర్లో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పేర్లు మార్పు వ్యవహారం ద్వారా దాన్ని చట్టపరమైన వ్యవహారంగా మార్చి జగన్ బెయిల్ రద్దు చేయించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని పేర్కొన్నారు.