నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ శాఖపై వాడివేడి చర్చ జరుగుతోంది. ముందుగా విద్యుత్ శాఖపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చ ప్రారంభించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విచ్చలవిడిగా అప్పులు చేసి విద్యుత్ సంస్థను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అసలు బీఆర్ఎస్ చేసిన పాపాలు చెప్పాలంటే రోజులు సరిపోవని.. పవర్ ప్లాంట్ల నిర్మాణం పేరుతో ప్రజాధనం వృథా చేశారని మండిపడ్డారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. 2014 జూన్‌లో అధికారంలోకి వచ్చి గత నవంబర్ నాటికి 24 గంటల కరెంట్ ఇచ్చామని అన్నారు. తమ ప్రభుత్వంలోనే విద్యుత్ వినియోగం పెరిగిందని వెల్లడించారు. అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని అన్నారు. అప్పులు చేస్తున్నామని ఆనాడే స్వయంగా కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పారని గుర్తుచేశారు.