– మూడు ప్రధాన మార్పులపై జై షా దృష్టి
– భారత క్రికెట్‌కు మేలు కలిగే అవకాశం
జై షా.. ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) చైర్మన్‌గా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడు. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ క్రికెట్‌లో అందరి దష్టిని ఆకర్షించిన కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు ఇక నుంచి ఐసీసీలో తన మార్క్ చూపించేందుకు దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. భారత క్రికెట్‌లో ప్రత్యర్థి వర్గం లేకుండా బీసీసీఐని గుప్పిట పట్టిన జై షాకు ఐసీసీలో కాస్త భిన్నమైన పరిస్థితులు ఎదురు కానున్నా.. ప్రధానంగా మూడు మార్పులపై జై షా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి జై షా ఐసీసీ పీఠం ఎక్కనున్నారు.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వేదిక మార్పు :
2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో కొన్ని కాసులు వెనకేసుకునే ఆలోచనలో ఉంది. శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై లాహౌర్‌లో ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ప్రపంచ క్రికెట్ జట్లు పునరాలోచన చేస్తున్నాయి. ఇటీవల కొన్ని జట్లు అక్కడ పర్యటించినా.. టీమ్ ఇండియా పాక్ గడ్డపై ఆడేందుకు ఏమాత్రం సుముఖంగా లేదు. గతంలో జై షా సైతం భారత జట్టు పాక్‌లో ఆడబోదని స్పష్టం చేశాడు. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్ నిర్వహణపై పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు చేపట్టనుండటంతో ఈ విషయంలో ఓ స్పష్టత రానుంది. చాంపియన్స్ ట్రోఫీ వేదిక కచ్చితంగా మారే అవకాశం ఉంది. యుఏఈ లేదా ఏదైనా ఇతర ప్రత్యామ్నాయ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
డబ్య్లూటీసీ ఫైనల్ వేదిక సైతం! :
టెస్టు క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చదిద్దేందుకు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను తీసుకొచ్చింది. 2021, 2023లలో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్ జరిగాయి. ఈ రెండు ఫైనల్స్‌కు ఇంగ్లాండ్ వేదికగా నిలిచింది. ఈ రెండు ఫైనల్స్‌లోనూ పోటీపడిన టీమ్ ఇండియా రెండు సార్లు సైతం రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇంగ్లాండ్ పరిస్థితులకు పోలిన స్వదేశీ పరిస్థితులు కలిగిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు భారత్‌పై విజయాలు సాధించి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ విజేతలుగా నిలిచాయి. గతంలో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లను సైతం ఇంగ్లాండ్ వేదికగానే నిర్వహించారు. భారత క్రికెట్‌లో జగన్‌మోహన్ దాల్మియా ఐసీసీపై పట్టు సాధించిన తర్వాత వరల్డ్ కప్ వేదికలు మారాయి. ఇప్పుడు అదే ట్రెండ్‌ను జై షా కొనసాగించే అవకాశం ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వేదికను ఇంగ్లాండ్ నుంచి తరలించే అవకాశం ఉంది. భారత్ 2025 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంటే కచ్చితంగా బీసీసీఐ ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పవచ్చు.
మహిళా క్రికెట్‌కు జోష్ :
రాజకీయ పరంగా విమర్శలను పక్కనపెడితే.. బీసీసీఐ కార్యదర్శిగా జై షా మహిళల క్రికెట్ అభివద్ధికి తన వంతు కషి చేశాడు. సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను ప్రవేశపెట్టడంతో పాటు భారత క్రికెట్‌లో పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు అందించారు. భారత మహిళల క్రికెట్‌లో ఇదో గుణాత్మక ముందడుగు. ఐసీసీ చైర్మన్‌గా జై షా మహిళల క్రికెట్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం లేకపోలేదు. ఐసీసీ ఈవెంట్లలోనైనా మహిళా క్రికెటర్లకు మెన్స్ క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజులు, ప్రైజ్‌మనీ అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మెన్స్ క్రికెట్ ఇప్పటికే బాగా వద్ది చెందింది. మహిళల క్రికెట్‌ను కమర్షియల్‌గా లాభదాయంగా మార్చేందుకు జై షా తనదైన ప్రణాళికలు అమలు చేస్తాడనే అంచనాలు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.