జల్‌ జీవన్‌ కలే

జల్‌ జీవన్‌ కలే– అధికారిక పత్రాల్లో చూపిన దానికి విరుద్ధంగా పరిస్థితులు
– డిమాండ్‌.. సరఫరాకు సరిపోని లెక్క
– యూపీలోని ఓ గ్రామంలో కష్టాలు
లక్నో : కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉంటే డబుల్‌ ఇంజిన్‌ పాలన సజావుగా ఉంటుందనీ, అభివృద్ధి జరిగి ప్రజలు కష్టాలకు దూరమవుతారని బీజేపీ తరచూ చెప్పే మాట. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ.. యూపీలోని ఒక గ్రామంలో మాత్రం ప్రజలు తాగు నీటికి కూడా సరిగ్గా నోచుకోలేకపోతున్నారు. సర్దార్‌ నగర్‌లోని 10,000 మంది గ్రామస్తులకు తాగునీరు అధికారిక పత్రాల్లో చూపిన దానికి చాలా దూరంగా ఉన్నది. తగిన సౌకర్యాలు లేకపోవటంతో అయోన్లా తహసీల్‌ పరిధిలోని గ్రామస్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాగునీరు కోసం ఇక్కడ పైపుల ద్వారా అరకొర సౌకర్యాలు ఉండటంతో వారు ఎక్కడి నుంచో నీటిని తెచ్చుకొని తాగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తాము దగ్గరలో ఉండే బోరు నుంచి వచ్చే నీటిని ఏండ్ల తరబడి తాగుతున్నామని స్థానికులు చెప్తున్నారు. ”మాకు ఎటు వంటి అవకాశం లేదు. పైపుల ద్వారా నీటిని సరఫరా చేయటానికి సుమారు 20 సంవత్సరాల క్రితం వాటర్‌ ట్యాంక్‌ నిర్మించారు. కానీ అది ఎప్పుడూ పనిచేయలేదు. ఇప్పుడు, మరొక ట్యాంక్‌ నిర్మిస్తున్నారు. ఇది ఎప్పుడు పని చేస్తుందో లేదో మాకు తెలియదు” అని హుస్సేన్‌ అనే స్థానికుడు చెప్పాడు.
ఈ ఏడాది మార్చి నాటికి అన్ని గ్రామీణ కుటుంబాలకు తగిన నాణ్యతతో కూడిన సురక్షితమైన తాగు నీటి కోసం కుళాయి నీటిని అందించటానికి 2019 ఆగస్టులో మోడీ సర్కారు జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పథకాన్ని ప్రారంభిం చింది. అయితే, ఈ పథకం కింద ఇక్కడి గ్రామస్తులు ఇంకా ప్రయోజనాలను పొందలేకపోవటం గమనార్హం. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ గ్రామం అధికారికంగా జేజేఎం కింద లక్ష్యాలను సాధించినట్టు పత్రాల్లో చూపటం గమనార్హం. యూపీలోని గ్రామాలు ఇప్పటికీ చేతిపంపులపైనే ఆధారపడి ఉన్నాయి. సర్పంచ్‌ నస్రీన్‌ ఫాత్మీ భర్త సర్తాజ్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 53 చేతిపంపులే ఇక్కడి తాగునీటికి ప్రధాన వనరుగా ఉన్నాయి. గృహాలకు వ్యక్తిగత గొట్టపు బావులు ఉన్నాయి. గతేడాది కాలంగా కొత్త వాటర్‌ ట్యాంక్‌ నిర్మిస్తున్నామనీ, అది పని చేస్తే ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నాణ్యమైన నీరు అందుతుందని ఆయన అన్నారు.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం రాష్ట్రాల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. 2019లో పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు 16.8 శాతం అంటే 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలు కుళాయి నీటి కనెక్షన్‌లను కలిగి ఉన్నాయి. ఈ ఏడాది మే 18 నాటికి మిషన్‌ కింద 76.55 శాతం (14.78 కోట్ల కుటుంబాలకు) పైపు నీటి కనెక్షన్‌ అందించబడింది. యూపీలో, 82.94 శాతం కుటుంబాలు పథకం కింద కవర్‌ చేయబడ్డాయి. అందులో సర్దార్‌ నగర్‌ కుటుంబాలు కూడా ఉన్నాయి.
జేజేఎం యూపీ సీనియర్‌ సలహాదారు రాధాకృష్ణ త్రిపాఠి జిల్లాల్లోని అధికారులతో ధృవీకరించిన తర్వాత లిఖితపూర్వక సమాధానం పంపారు. సర్దార్‌ నగర్‌ గ్రామంలో జేజేఎం అమలు చేశామన్నారు. ”సర్దార్‌ నగర్‌ (బ్లాక్‌-అలంపూర్‌ జఫరాబాద్‌) డీజిల్‌ జనరేటర్‌ సెట్ల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతున్నది. తాగునీటి పథకం కింద, ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణంలో ఉన్నది. ట్యూబ్‌వెల్‌, పంప్‌ హౌస్‌ పనులు పూర్తయ్యాయి” అని రాతపూర్వక సమాధానమిచ్చారు. అధికారిక లెక్కలు మాత్రం వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయనీ, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ కనబర్చి సమస్యను పరిష్కరించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

Spread the love