జల్లికట్టు పోటీలు ప్రారంభం..

 

Jallikattu competitions begin..నవతెలంగాణ – మధురై: తమిళనాడులోని మధురైలో ప్రపంచ ప్రఖ్యాత జల్లికట్టు కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. సంక్రాంతి సందర్భంగా మూడ్రోజులు ఈ పోటీని నిర్వహిస్తారు. కాగా.. అవనియాపురం గ్రామంలో తొలిరోజు ఆట మొదలైంది. ఇందులో 1,100 ఎద్దులు, 900 మంది వ్యక్తులు పాల్గొంటున్నారు. అయితే, ఈ పోటీలో మొదటి ఫ్రైజ్ గెలిచిన ఎద్దు యజమానికి ట్రాక్టర్, ఎద్దును అదుపు చేసిన వ్యక్తికి రూ.8 లక్షల విలువైన కారు అందజేయనున్నారు. ఇక, వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఈ పోటీలో పలు రౌండ్లలో బుల్ రన్ ఉంటుంది.. ప్రతి రౌండ్‌లో 50 మంది ఎద్దుతో కుస్తీ పట్టనున్నారు. పోటీ ప్రారంభం కావడానికి ముందు, అధికారులు ఎద్దులతో పాటు యువకులకు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే, అవనియాపురం జల్లికట్టు పొంగల్ రోజున జరిగే మొదటి ప్రధాన కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక, జనవరి 15 పాలమేడులో, జనవరి 16న అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలను నిర్వహించనున్నారు. కాగా, జల్లికట్టు అనేది ఉత్సాహభరితమైన ఆట.. యువకులు ఒకరి తర్వాత ఒకరు ఎద్దు మూపురం పట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు.. వారు ఆ ఎద్దును ఆపగలిగేంత వరకు అలాగే ఉంటారు. జల్లికట్టు చరిత్ర క్రీస్తుపూర్వం 400-100 నాటిది. భారతదేశంలోని అయర్లు అనే జాతి సమూహం ఈ ఆటను ప్రారంభించింది. జల్లికట్టు అనే పేరు రెండు పదాల నుండి వచ్చింది. జల్లి అంటే వెండి లేదా బంగారు నాణేలు, కట్టు అంటే కట్టడం అని అర్థం.

Spread the love