దేశంలో జమిలి ఎన్నికల సంకేతం మరోసారి బలంగా తెరపైకి వచ్చింది. అకస్మాత్తుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటన, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కమిటీ వేశారన్న సమాచారంతో. ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ సాగుతోంది. దేశంలో సాధారణంగా ఒక్కో రాష్ట్రానికి, ఒక్కోసారి ఎన్నికలు జరుగుతుంటాయి. వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పద్ధతి మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగాలని కోరుకుంటోంది. కేంద్రం తీసుకొస్తున్న ఈ విధానం, ఈ ప్రకటన వెనుకేదో? రాజకీయ కోణం ఉందనేది విశ్లేషకుల మాట.
రోజురోజుకూ విపక్షాల మధ్య ఐక్యత పెరుగుతుంటే బీజేపీ ఆందోళన పడుతున్నది మాత్రం వాస్తవం. ఇప్పుడు జమిలి ఎన్నికలు మీద కేంద్రం ఈ అనూహ్య పరిణామాల వెనక ఆంతర్యమేంటి? కేంద్ర హఠాత్తుగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరపాలని నిర్ణయించటం వెనుక ఉద్దేశం? ఏమై ఉండొచ్చనేది సర్వత్రా చర్చ జరుగుతున్నది. జమిలి లేదా మినీ జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఎంత వరకు ఉంది? ఆ ప్రభావం రాష్ట్రాలపై ఎలా ఉండొచ్చు? అధికార బీజేపీకి ఇది లాభమా… నష్టమా? విపక్షాలు దీనికి ఎంత వరకు సన్నద్ధంగా ఉన్నాయి? అనేది భవిష్యత్తులో జరిగే ఎన్నికల ప్రభావం ఎంతమేరకు ఉంటుందో చూడాల్సి ఉంది. అయితే ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయాలంటే కేంద్రానికి ఆరు అంశాలు సవాలుగా ఉన్నాయి. దీనికోసం రాజ్యాంగంలోని అధికరణల్ని మార్చాల్సి ఉంటుంది. అవి 1.పార్లమెంట్ పదవీ కాలాన్ని నిర్వచించే ఆర్టికల్ 83, 2.పార్లమెంటును రద్దు చేసే ఆర్టికల్ 85, 3.అసెంబ్లీ పదవీ కాలాన్ని నిర్వచించే ఆర్టికల్ 172, 4.రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు చేసే ఆర్టికల్ 174, 5.రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ 356, 6.పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాలి. ఇలాంటి కీలక అధికరణాల్ని సవరిస్తేనే జమిలి ఎన్నికలు సాధ్యమవుతాయి.
ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ అధికరణల్ని మార్చే విషయంలో రాజ్యాంగం ఏ మేరకు అనుమతిస్తుంది అనే విషయంలోనూ నిపుణుల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశానికి పార్లమెంటు ఎన్నికలు 2019లో జరిగాయి. ఆ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచలప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాలకూ, ఆ తర్వాత మళ్లీ హరియాణా, మహారాష్ణ్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలు, 2021లో పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్లలో జరిగాయి. ఇదేవిధంగా దేశంలో ప్రతియేటా ఎక్కడో ఓచోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. అలాకాకుండా దేశమంతా ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిపోతే మళ్లీ అయిదేండ్ల పాటు అన్ని రకాలుగా దేశపాలన నిధానంగా నిబ్బరంగా సాగిపోవచ్చనేది కేంద్రం వాదన. ఉదాహరణకి 2024 నాటికి దేశమంతా జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే 2021, 2022, 2023లలో అప్పుడప్పుడే జరిగిన ఎన్నికలతో అధికారాన్ని చేపట్టి పాలన సాగిస్తున్న రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దుచేసి అందరితో కలిపి ఎన్నికలు పెడతామంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇది సాధ్యమేనా? అందరినీ ఒప్పించి అవసరమయిన రాజ్యాంగ సవరణ చేయడం చాలా క్లిష్టమయిన వ్యవహారం. ఆచరణలో ఎన్నో అడ్డంకులుంటాయి. జమిలి ఎన్నికలు అన్నది ఒక నినాదంగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందే తప్ప ఆచరణలో అసాధ్యమని నిపుణులు ఎంతగా చెప్పినా మోడీ పట్టించుకోవడం లేదు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. అంటూ ఆకర్షణీయమైన స్లోగన్ ఇస్తూ… వచ్చారు. జమిలి సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కమిటీలు వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో రాజకీయ పార్టీలతో ఒకటికి రెండుసార్లు సమావేశమైంది. దీంతో దేశంలో జమిలి ఎన్నికల దిశగా పెద్ద ఎత్తున కసరత్తు కూడా జరుగుతోందన్న కేంద్రం గొప్పలకు పోతోంది. ఇంత హడావుడి చేసిన తర్వాత జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని కేంద్రం గతంలోనే గ్రహించింది. మళ్లీ ఇప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తెస్తోంది. అయితే ఇది బీజేపీ ఒక అస్త్రంగా ఉపయోగిస్తోంది తప్ప ఇది సాధ్యమయ్యే పనికాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాలంటే ఈ నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాల వరకు ఆగాల్సిందే.
– తీగల అశోక్ కుమార్, 7989114086