దోపిడీ..పీడనపై జమిలి పోరాటాలకు సిద్ధం కావాలి

– బీజేపీ ఉన్మాద చర్యలపై ఉద్యమిద్దాం : డీవీ కృష్ణ వర్థంతి స్మారక ఉపాన్యాసాల సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆర్థిక దోపిడీ, సామాజిక పీడన పెరుగుతున్న నేపథ్యంలో వీటిపై జమిలి పోరాటాలు నిర్వహించాల్సిన అవశ్యకత పెరిగిందనీ, దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లుతున్నదనీ, మరో పక్క ధనికుల చేతుల్లో దేశ సంపదంతా పోగు పడుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా ప్రథమ కార్యదర్శి డీవీ కృష్ణ ప్రథమ వర్థంతి సభను సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కేజీ రామచందర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ‘కార్మికోద్యమం- కుల నిర్మూలనాపోరాటం- డీవీ కృష్ణ కృషి’ అనే అంశంపై ప్రముఖ సంపాదకులు సతీష్‌ చంద్ర స్మారకోపాన్యాసం చేశారు. కార్మికుల కష్ట, సుఖాలతోపాటు వారి సామాజిక జీవన విధానంతో మమేకమైతేనే కార్మికోద్యమాలను నిర్మించగలమని డీవీ కృష్ణ భావించారని వివరించారు. కార్మికులను ఐక్యం చేసే క్రమంలో కులం అడ్డుగా నిలబడిన విషయాన్ని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడని తెలిపారు. ఆ అడ్డుగోడల్ని అధిగమించేందుకు కార్మిక వర్గ చైతన్యాన్ని ప్రదర్శించారనీ, ఆ రకంగా స్ఫూర్తిదాయకమైన కార్మికోద్యమాలను నిర్మించారని గుర్తుచేశారు. మినీ సిగిరెట్లకు వ్యతిరేకంగా పోరాడటమేగాకుండా..ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటాన్ని సాగించారని చెప్పారు. 1990 తర్వాత కనపడని శత్రువు(ప్రపంచీకరణ)పై కూడా పోరాటం చేయటం సులువైన పని కానప్పటికీ.. ఆ ఉద్యమాల్లోనూ సృజనాత్మకతను ప్రదర్శించారని చెప్పారు. ‘మంచి అన్నది మాల అయితే మాల నేనగుదున్‌’అన్న గురజాడ వ్యాఖ్యల్ని డీవీకే నిజం చేశారన్నారు.
ఆయన దళిత వర్గాలతో కలిసి జీవించారనీ, కులం ఎలా పోతుందనే విషయాన్ని కార్మిక వర్గంలో ఆచరణాత్మక ప్రయోగం చేసిన మహానీయుడు డి.వి. కష్ణ అని చెప్పారు. ప్రొఫెసర్‌ కె. లక్ష్మినారాయణ మాట్లాడుతూ మతోన్మాదం దేశంలో పెచ్చరిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న పాలకులే దాన్ని పెంచి పోషిస్తుందన్నారని చెప్పారు. దేశంలో అసమానతలు, నిరుద్యోగం విశృంఖలంగా పెరుగుతోందని చెప్పారు. సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ దశాబ్దాలుగా కమ్యూనిస్టు ఉద్యమం అతి, మితవాదాలతో కొట్టుమిట్టాడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సరైన ప్రజాపంథా నిర్మాణం కోసం డీవీకే నిరంతరం కృషి చేశారని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక వర్గ ఉద్యమాన్ని నిర్మించటమొక్కటే ఏకైక మార్గమని చెప్పారు. సభలో రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి, రాయల చంద్రశేఖర్‌, కె. రమ, వి. కృష్ణ, చండ్ర అరుణ, వి. ప్రభాకర్‌, ఎం. హన్మేశ్‌, ఎస్‌ఎఎల్‌ పద్మ, ఎం. కృష్ణ, కె. సూర్యం, జి. వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. సభలో డి.వి. కృష్ణ రాసిన వ్యాసాల సంకలనాన్ని, పాటల సీడీని అవిష్కరించారు.

Spread the love