భరతమాత నిలువెత్తు చిత్ర పటానికి తల భాగమే జమ్మూకాశ్మీర్‌!

పటంలోనే ఇంత అద్భుతంగా, సహజ సుందరంగా అమరిన ప్రాంతం.. ఇక వాస్తవంలోంచి చూస్తే అబ్బుర పోతాం..!! చిన్నప్పుడెప్పుడో.. ప్రఖ్యాత రచయిత్రి నాయిని కష్ణకుమారి గారి ‘కాశ్మీర్‌ దర్శనం’ పాఠం విన్న నాలో ఆ సుందర కాశ్మీరును జీవితంలో ఒక్క సారయినా సందర్శించాలనే వాంఛ అంకురించి, పెరిగి పెద్దయి ఇన్నాళ్లకు ఆ అందమైన స్వప్నం సాకారమయ్యింది..! తరగతి గదిలో భారత భౌగోళిక స్వరూపాన్ని, హిమశిఖరాల వరుసలని, జీవనదుల పుట్టుకనీ, విప్పి చెప్పే నేను ఆ సహజ వనరుల అందాలను సందర్శించకుండానే బోధించడం, నాలో నాకే అసంతప్తిగా ఉండేది..! ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అయితే తప్ప, వారు పిల్లల్లో పూర్తిస్థాయి కాంతిని నింపడం సాధ్యపడదు. ఈ అద్భుతమైన క్షేత్ర పర్యటన నన్ను నేను వెలిగించుకుంటూ.. మా చిన్నారుల ముందు కుప్పపోసేందుకు బోలెడన్ని యదార్థ అంశాలని, ఎంతకూ మరచిపోలేని అనుభూతులని నా మదినిండా ఒంపుకొని వెంట తెచ్చుకున్నా ..!
పది రోజుల మా కాశ్మీర్‌ యాత్ర దక్షిణ మధ్య రైల్వే ఏసి త్రీటైర్‌ ట్రైన్‌లో సికింద్రాబాద్‌ నుండి ‘హం సఫర్‌’ జమ్మూ, తావి, శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా వరకు. దాదాపుగా 2,250 కిలోమీటర్ల దూరాన్ని, 39 గంటల్లో, ఎన్నెన్నో రాష్ట్రాలను, వాటి రాజధాని నగరాలను, గుట్టలను, పుట్టలను, సెలయేళ్లను, అరణ్యాలను దాటుతూ మా యాత్రా ప్రయాణం మొదలయ్యింది. రైలు కాజీపేట వరకు రాగానే, మా అన్నవరం సహౌదరులు, కొందరు కవి మిత్రులు వారి కుటుంబంతో సహా రైలెక్కి కాశ్మీర ప్రయాణం బయలుదేరాం.
కాశ్మీర్‌ అంటేనే నేచర్లోకి ప్రయాణం. మా అందరి అభిరుచి, ఆకాంక్ష ప్రకతిని, పచ్చదనాన్ని ఆస్వాదించడమే. అందుకే ఈ టూర్‌ సుదూరమే అయినా సరదాగా, సందడిగా కొనసాగింది. నాకు ప్రయాణమంటే ఎప్పటికీ తనివి తీరని దాహమే! పనుల ఒత్తిడి వల్ల అలసిన నా దేహం ప్రయాణంలోనే తిరిగి రీఛార్జ్‌ అవుతుంది. ఈ తీరిక సమయంలో ఎన్నెన్నో గ్రంథాలను ఒక్క చోటే కూచొని ఆస్వాదించి నంత సంబురం. ఏవేవో కొత్త ముచ్చట్లు. ఎందరెందరో కొత్త వ్యక్తుల కలయికతో విభిన్న రాష్ట్రాలను దాటుతూ.. భిన్న సంస్కృతుల మేళవింపుతో కలిసి సుదీర్ఘంగానే.
       అద్భుతమైన పర్వతలోకం అన్నట్టు మేం రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నదే వీటన్నింటినీ దగ్గర నుంచి పరిశీలించ వచ్చని! ఈ యాత్ర అమ్మ ట్రావెల్స్‌ అండ్‌ టూర్స్‌ జగిత్యాల వారి కృష్ణమోహన్‌, రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలో రూపొందించింది. కాట్రాలో మా రైలు యాత్ర ముగిసి, ముందే మాట్లాడుకున్న ఓ లగ్జరీ బస్సుని పట్టుకున్నాం. దగ్గర్లోని వోక్‌ రెస్టారెంట్‌లో మా రెండురోజుల బస. ఈ యాత్రా సమయంలో సందర్శించిన విశేష ప్రదేశాలు.. ఎక్కడికక్కడ మిలిటరీ పహారాలోనున్న జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ రాష్ట్రంలోని కాట్రా నగరానికి దగ్గరలోనున్న శ్రీమాతా వైష్ణో దేవాలయం, గుల్‌మార్గ్‌, సోనామార్గ్‌, శాలిమార్‌ గార్డెన్స్‌, మొఘల్‌ గార్డెన్స్‌, శ్రీనగర్‌ సైట్‌ సీయింగ్స్‌, దాల్‌ లేక్‌, పెహల్గామ్‌.. మొదలైనవి. చెప్పేందుకు అవి పేరుకే.. కానీ కాశ్మీర్‌లో ప్రవేశించిన నుంచి ఇంచించు చూడదగ్గదే..! అదో అద్భుతమైన పర్వత లోకం. లోయల్లోంచి పారుతున్న నదీమ తల్లుల గలగలలు.. శిఖరాల అంచుల నుంచి జాలువారుతున్న సన్నటి జలపాతాలు, ఎన్ని యుగాలనుంచి ప్రయాణించి నునుపు తేలాయో కానీ ఎక్కడ చూసినా డైనోసార్‌ గుడ్లలా నున్నటి రాళ్లు..! పర్వతాల నిండా పరచుకున్న పచ్చదనం, ఎక్కడ చూసినా సతత హరితారణ్యాలే..! ఆకాశాన్ని అందుకునేంత ఎత్తుకె దిగిన కోనిఫర్‌ వృక్షాలు.. మంచు పూలని రాల్చుకునేందుకు వీలుగా సూదుల్లాంటి ఆకులతో దేవదారు వృక్షాలు..! తొవ్వకు రెండు వైపులా మనోహర దృశ్యాలే, సినిమా పాటల్లో తప్ప వాటిని చూసెరుగం. ఆ సహజ అందాలని ఆస్వాదించేందుకు రెండు కళ్ళు చాలవంటే నమ్మండి..! రెప్ప వెయ్యడం మరిచి సాగిపోతున్నాను!
మనిషి సాధించిన అద్భుతమే!
       మా బస్సు వంకలు టింకలు తిరిగే ఘాట్‌ రోడ్డులను పదిలంగా దాటుకుంటూ, తీగ మీద ఫీట్స్‌ చేస్తున్న అమ్మాయిలా, కొండ అంచు మించి చీమలా కదిలిపోతోంది.. కిటికీ నుంచి పక్కకు చూసామో గుండెలు అదిరిపోయే లోయలు. ఓపక్క కించిత్‌ భయం కూడా మనలను వెన్నాడుతూ ఉంటుంది. సన్నటి తొవ్వ… అక్కడ కూడా ట్రాఫిక్‌ జామ్‌..! మైళ్ల కొద్దీ వాహనాలు ఆగిపోయి కనిపిస్తూ ఉంటాయి. పహారా కాస్తున్న జవాన్లు తొవ్వ సరి చేస్తూ మనల ముందుకు పంపుతూ ఉంటారు. ట్రాన్స్‌పోర్ట్‌ చేరవేసే లారీల సంఖ్య లెక్కకు మిక్కిలి! నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులు చకచకా జరుగుతూ ఉన్నాయి. కొండలను తొలచి సొరంగ మార్గాల నిర్మాణం మనిషి సాధించిన అద్భుతమే. వీటిలో అటల్‌ టన్నెల్‌ దాదాపు 10 కి. మీటర్ల పొడవుతో అన్నింటికన్నా ఎక్కువ సేపు చీకట్లోంచి అంటే కృత్రిమలైట్ల వెలుగులో ప్రయాణింప చేస్తుంది. లెక్కలేనన్ని టన్నెల్స్‌ దాటి దగ్గరి దారిలో వెళుతున్నాం. కొండలపై దూర దూరంగా వీళ్ళ నివాసాలు, అక్కడొకటి ఇక్కడొకటి పిట్టగూళ్ళలా కనిపిస్తూ.. రాత్రి కురిసిన మంచు రాలిపోయేందుకు వీలుగా, వాలుగా రేకులతో కప్పబడ్డ ఇల్లు దూరం నుంచి మెరుస్తాయి.
ఒకే తల్లి పిల్లల్లా
కొండలపై నుంచి పాపిట తీసినట్టున్న పిల్ల తొవ్వ ల్లోంచే వాళ్ళ కదలికలు, వాళ్ళ మనుగడలు. అడుగునెక్కడో లోయలో ప్రవహిస్తున్న నీటి వనరులే వాళ్ళ అవసరాలను తీరుస్తాయి. అక్కడి మనుషులంతా ఒక్కలాగే కనిపిస్తారు. మంచు కప్పబడి ఉన్న ప్రాంతం కాబట్టి సన్నగా, పొడుగ్గా, తెల్లగా, తేలికగా, ప్రశాంతంగా కనబడుతారు. విచిత్రం ఏమిటంటే అందరికీ పొడవైన ముక్కు ముఖంలో వాడిగా కొట్టొచ్చేట్టు కనపడు తుంటుంది. వీళ్లంతా ఒకే తల్లి పిల్లల్లా ఉంటారు. ఉత్తర భూభాగపు అంచులోని హిమశిఖరాలు దూరం నుంచి వెండి కొండల్లా, వెన్నెల తరగల్లా మెరుస్తు న్నాయి. శివాలిక్‌ శ్రేణులను దాటి మధ్య హిమాల యాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇది అద్భుతమైన శీతల సుందర లోయా ప్రదేశం! ఆకాశానికి ఎగబాకుతూ ఒక్కోసారి లోయల్లోకి దిగుతూ బస్సు నెమ్మదిగా ఫీట్లు చేస్తుంది. ఏ అవసరార్థమో బస్సులోంచి కాలు బయట పెడితే, ఫ్రిజ్‌లోకి వెళ్లినట్లే వణికి పోతాం. అందుకు అనుగుణంగానే ఉన్ని దుస్తులు ధరిచాం. మార్గమధ్యలో అమరులైన జవానుల పుల్వామా ఘటనా ప్రాంతం వచ్చేసిందని మాకు గైడ్‌ చెపుతున్నాడు. వారి దేశభక్తికి శ్రద్ధాంజలి ఘటించి ముందుకు నడిచాం.
శ్రీ మాత వైష్ణోదేవి ఆలయం
      ముందుగా కాట్రా నగరానికి దగ్గరలోనున్న శ్రీ మాత వైష్ణోదేవి ఆలయం సముద్రమట్టానికి రెండువేల మీటర్ల ఎత్తు పైనున్న శిఖరాన్ని అధిరోహించి, ఆ పక్కనే లోయలో ఉన్న సొరంగ ఆలయాన్ని సందర్శించడం ఒక సవాలే. త్రి కూట పర్వతాల లోయల నడుమ వెలసిందని చెప్పబడుతున్న శ్రీ మాతా వైష్ణోదేవి కొండపైకి వెళ్లేందుకు సుమారు 14 కిలోమీటర్ల తొవ్వ. కాలినడకనా వెళ్లొచ్చు, గుర్రాలూ ఉంటాయి, హెలిక్యాప్టర్‌లోనూ వెళ్లొచ్చు. పల్లకిలో మోసేందుకు బోయీలూ ఉంటారు. మేం మాత్రం వెళ్లేప్పుడు, వచ్చేప్పుడు గుర్రాలపై స్వారీనే. ఆనాటి యోధులు రుద్రమాంబ, ఝాన్సీ లక్ష్మీబాయి కళ్ళ ముందు మెదిలారు. అదో మరచిపోలేని అనుభూతి. ఈ ఆలయం ప్రముఖ శక్తి పీఠాల్లో ఒకటి అంటారు. ఇక్కడ భక్తజనుల తాకిడి ఎప్పుడైనా ఎక్కువే. రాత్రింబవళ్లూ ఈ ఆలయానికి రాకపోకలు సాగుతూనే ఉంటాయి. దీని వార్షిక ఆదాయము ఐదు వందల కోట్లకు పైచిలుకేనట..!
జమ్మూ లోని గుల్మార్గ్‌!
గుల్మార్గ్‌ అంటే పూలు పరచుకున్న దారి అని అర్ధం. ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం. ఇదో అద్భుత కలల లోకం.! శ్రీనగర్‌ నుండి 30 కిలోమీటర్ల దూరంలో బారాముల్లా జిల్లాలోని ఒక పట్టణం. అక్కడి ప్రాంతాల పేర్లని మనం వార్తల్లో తరచూ విని ఉంటాం. ఇవి భారత సరిహద్దు ప్రాంతాలు కాబట్టి సైనిక పహారాలో ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారు. సామాన్యంగా మనం వాడే సిమ్‌ కూడా ఇక్కడ పని చేయదు. పోస్ట్‌ పెయిడ్‌ సిమ్‌ ఒకటి కొత్తగా తీసుకొని వెళ్ళాలి. గుల్మార్గ్‌ గోండోలా 2,650 మీటర్ల ఎత్తులో పిర్‌ పంజాల్‌ శ్రేణిలో ఉంది. ఇప్పుడు అంటే మే నెల, దక్కన్‌ పీఠభూమి మన దగ్గర 45 డిగ్రీలసెల్సియస్‌ ఉండగా ఇక్కడ 4 డిగ్రీల సేల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంది. ఇక్కడ మాకో రియాజ్‌ అనీ మంచి గైడ్‌ దొరికిండు. రోజంతా మాతోనే ఉండి మాకు ఫొటోలు, వీడియోలు తీసి ఎన్నెన్నో విశేషాలను ఆత్మీయంగా తెలియజేసిండు. ఇక్కడే రెండు దశల రోప్‌ వే ఉంటుంది. దాన్ని మనం ముందే ఆన్లైన్లో బుక్‌ చేసుకోవాలి. మొదటి దశ మంచు పర్వతాల్లోకి మా ప్రయాణం. అక్కడ అన్నీ మంచులో ఆడుకునే గేమ్స్‌ ఉంటాయి. స్లేడ్జి బండి, మోటార్‌ బైక్‌ లాంటివి. వాళ్లు పర్యాటకులను చూడగానే గిరాకీ వచ్చిందన్నట్టుగా చుట్టుముడతారు. వాళ్ల బతుకు తెరువు అదే. ఇక రెండో దశ రోప్‌ వే.. ఊహించని అలవి కాని ఎత్తు. మంచు పర్వతాల్లోంచి పై పైకి తీసుకెళ్తుంది. అక్కడ దాదాపు నాలుగు వేల మీటర్ల ఎత్తువరకు ఉండొచ్చు. గజగజ వణుకు, ఓవైపు జారి పడుతూ, నిలబడుతుంటాం. ఫొటోగ్రాఫర్స్‌ వచ్చి ఫొటో తీస్తామంటారు. అంతటి ఎత్తు పై కూడా ఓ ఇగ్లూ, చెక్కతో చేయబడిన షెల్టర్‌ కేఫ్‌.. డిజె మ్యూజిక్‌తో మనలను అలరింప చేస్తూ ఉంటుంది. మంచులో చిన్నపిల్లలమై తేలిపోవడం ఎప్పటికీ మరచి పోలేని ఘటనలే!
సోన మార్గ్‌ లోయ
సోనా మార్గ్‌ అంటేనే స్వర్ణ దారి అని అర్ధం. తొవ్వకిరువైపులా సహజ సిద్ధంగా పెరిగిన పలురకాల గడ్డి పూలు.. గుల్‌ మార్గ్‌ లాగే ఇది కూడా సీ లెవెల్‌కి మూడువేల మీటర్ల ఎత్తులోనే ఉంటుంది. కొండల పైకి వెళ్తూ ఉంటే ఉష్ణోగ్రత పడిపోతూ ఉంటుంది. ప్రతి వెయ్యి మీటర్ల పైకి వెళితే, 6 డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోతూ ఉంటుందంటారు. ఇక్కడి పర్వతాల చుట్టూ పొగ మబ్బుల్లా అల్లుకున్న మేఘాలు..! తెల్లటి మేఘాల వరుసలు మన చెయ్యికి అందినట్లే ఉంటాయి. లోయల్లో మాతో పాటూ పరుగులు తీస్తున్న నదీమ తల్లుల పిల్ల కాలువలు, సెలయేర్లు, కొండ అంచులపై నుంచి రాలి పడుతున్న జలపాతాలు, మెల్ల మెల్లగా కరిగి ప్రవహిస్తున్న గ్లాసియర్స్‌. వాటినే హిమానీనదాలు అంటారు. అల్లంత దూరాన చూడ చక్కని వెండి పర్వతాలు! చలి గాలులను లెక్కచేయకుండా పరవశిస్తూ ఆస్వాదిస్తున్నాం. ఇక్కడ కూడా గుర్రాలపై వెళ్తే తప్ప మంచు కొండల్లోకి చొచ్చుకు పోలేం. గుర్రాలపై తిరగడం ఎలాగో మాకు అలవడింది. రాళ్లూ రప్పలూ ఎత్తొంపుల తొవ్వని అవలీలగా దాటేస్తున్నార. సుందరమైన మంచు పర్వతాలను వదిలి రాలేకపోతున్నాం. కింద మా బస్సు వాళ్లు మా కోసం చూస్తున్నారు. ఇక రాక తప్పింది కాదు. లెక్కలేనన్ని దృశ్యాలని కెమెరాల్లోకి ఎక్కించుకొని తిరుగు ముఖం పట్టాం.
మొఘల్‌ గార్డెన్స్‌… షాలిమార్‌ గార్డెన్స్‌
ఇంద్రధనస్సును కోసుకొచ్చి నేల మీద పరిచినంత వర్ణమయం, రంగురంగుల పూలవనాలు..! మొఘల్‌ రాజులు ప్రకృతి ఆస్వాదకులు. వారు నిర్మించినవి అని చెప్పబడుతున్న ఈ తోటలు ఎంత మనోహరమో! ఇక్కడి చీనాబ్‌ చెట్లను చూస్తే.. ఆశ్చర్యం.. ఆ వక్ష రాజాల చుట్టుకొలత ఓ పదిమంది చేతులు చాచి గుండ్రంగా పక్క పక్కన నిలబడి హత్తుకుంటే తప్ప చుట్టుకొలతని ఊహించలేం! వీటి ముందు మనం చిన్ని చీమల్లాగే ఉంటాం. వాటర్‌ ఫౌంటెన్సు, ఓవైపు రాలుతున్న వాన చినుకులు, మేఘాలు అలుముకున్న పర్వత సానువులు.. ఓహౌ.. అద్భుతం! భూలోక స్వర్గం అంటే ఇదే కాబోలు. పూలంటే నాకెంత ప్రాణమో. పైనుంచి చినుకుల పువ్వులు, నేను పువ్వులో పువ్వునై, పరవ శించి తన్మయించాను. అయితే ఇక్కడే కాశ్మీరీ కపుల్‌ వేషధారణతో లైను కట్టి ఫొటోలు దిగడం, ఎన్ని డబ్బులయినా పెట్టి కాపీలు తీసుకోవడం ఓ గమ్మత్తైన అనుభూతి. కాశ్మీరీ మహిళల నగలు, వస్త్రాలంకరణ చూడముచ్చటగా ఉన్నాయి. ‘ఆప్‌ లోగ్‌ హమారా మహిమాన్‌ హై’ అంటూ మనలని వాళ్ళు గౌరవించే తీరుకి అబ్బుర పడుతాం!
శ్రీనగర్‌, దాల్‌ లేక్‌..!
జమ్మూ రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌కి సమీపంలోనే సుమారు పది కిలోమీటర్ల మేరా వ్యాపించిన విశాలమైన జలభాగమే దాల్‌ సరస్సు..! ఈ సరస్సు చుట్టూ లోనికి దిగేందుకు వీలుగా మెట్లతో కూడిన మంటపాలు.. ఈ సరస్సు శీతాకాలంలో ఘనీభవిస్తుందని విని ఆశ్చర్యపోయాం..! ఈ సరస్సు పై నుంచి నడిచి వెళ్తారట.. ఇప్పుడు మాత్రం నీళ్లతో నిండి, బోట్‌ షికారుకి అనుకూలంగా ఉంది. ఈ సరస్సుకి రెండు ఒడ్డుల్లో వేలకొద్దీ బోట్‌ హౌస్‌లని అందంగా రిసార్ట్‌ లాగా నిర్మించారు. ఆ బోట్‌హౌస్‌లో సకల సదుపాయాలతో కూడిన డబుల్‌ బెడ్రూమ్స్‌, వేడి నీటి సౌకర్యాలు, డైనింగ్‌ హాలు, ఆనాటి రాజమహల్‌ లని తలపించే లాగా వుడ్‌తో కార్వింగ్‌ చేసిన అద్భుతమైన నిర్మాణాలు.. మేం కూడా బోట్‌ షికారి తర్వాత తేలియాడే రిసార్ట్‌లో రాత్రంతా ఉండిపోవడం ఆహా.. అదో అద్భుతం.. అదో స్వర్గం..!
పెహల్గామ్‌..!
ఇది జమ్మూలోని అనంతనాగ్‌ జిల్లాలో ఉన్నటువంటి హిల్‌ స్టేషన్‌. ఇదీ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమే. ఇక్కడ ఆకాశాన్ని అందుకుంటున్న శిఖరాల పక్కన పారుతున్న నదీ ప్రవాహం..! అవో రకం దేవదారు వృక్షాలు, పరుచుకున్న పచ్చిక బయల్లు, పక్షుల కిలకిలలు, సినిమా పాటలను చిత్రీకరించిన ప్రదేశాలు.. విభ్రమ గొలిపే అద్భుతమైన సహజ సుందర దృశ్యాలను చూసేందుకు రెండు కళ్ళు చాలవు..! తొవ్వ పక్కన పండ్లు లేని ఆపిల్‌ తోటలను, బ్లూబెర్రీ తోటలను దాటుకుంటూ ఆరూ లోయ, బేతాబ్‌ లోయ ప్రాంతాన్ని చూసాం.. అయితే మేం వెళ్లినప్పుడు విపరీతమైన వర్షం కురవడంతో అద్దె గొడుగులను తీసుకుని వెళ్లి మరీ ఆస్వాదించి వచ్చాం. ఇక్కడ పేరుగాంచిన సాఫ్రాన్‌ తోటలు ఎక్కడుంటాయో కనబడలేదు గానీ, డబ్బాల్లో నింపుకొని అమ్మే వాళ్ళు మాత్రం అడుగడుక్కీ తారసపడ్డారు. ఎక్కడ చూసినా ఉన్ని వస్త్రాలు స్వెటర్లు, కోట్లు, షాల్స్‌, బ్యాగులు, రాళ్ల పూసలు దండలు.. డ్రై ఫ్రూట్స్‌ అమ్మేవాళ్లు ఫుట్‌పాత్‌ ల మీదే కనిపిస్తూ ఉంటారు.. వాటి ధరలు తక్కువే ఉంటాయి, బేరమాడితే ఇంకా తగ్గిస్తారు కానీ, అంత దూరం నుంచి మోసుకొని తెచ్చే ఓపిక లేక ఒకటో రెండో తెచ్చుకున్నాం.
ఇక కాశ్మీరును వదిలి వచ్చే సమయం ఆసన్నమైంది. మా ట్రైన్‌ మమ్మల్ని పిలుస్తోంది. ఎన్నో మధుర జ్ఞాపకాలను, పచ్చదనాల అనుభూతులను మూటగట్టుకుని ఇల్లు చేరాం. వైవిధ్యభరితమైన ఉపఖండాన్ని సందర్శించి వచ్చినందుకు నాలో దేశభక్తి మరింత పెరిగిపోయింది. రేపివన్నీ మా పిల్లలకు పంచి పెట్టాలి.
– నాంపల్లి సుజాత, 9848059893

Spread the love