నవతెలంగాణ హైదరాబాద్: ఓ గర్భిణి ఒకే కాన్సులో నలుగురికి జన్మనిచ్చింది. కానీ ఆ నలుగురు శిశువులు గంటల వ్యవధిలోనే చనిపోయారు. ఈ విషాద ఘటన జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుప్వారా జిల్లాలోని కేరాన్ గ్రామానికి చెందిన గర్భిణి అయిన కలీదా బేగంను నొప్పులు రావడంతో ఆదివారం సాయంత్రం స్థానికంగా పీహెచ్సీకి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. కాన్పు ఇక్కడ చేయడం సాధ్యం కాదని, కుప్వారా జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వారికి సూచించారు. దీంతో వారు సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కుప్వారా జిల్లా ఆసుపత్రిలో కలీదా సాధారణ ప్రసవం అయింది. నలుగురు శిశువులకు ఆమె జన్మనిచ్చింది. నలుగురిలో ముగ్గురు ఆడశిశువులు కాగా, ఒక మగశిశువు. అయితే వారందరూ తక్కువ బరువుతో జన్మించారు. అయితే ముగ్గురు ఆడశిశువులు కుప్వారా ఆసుపత్రిలోనే మరణించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీని, మగ శిశువును శ్రీనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మగశిశువు చనిపోయింది. ఇలా గంటల వ్యవధిలోనే నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కలీదాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కలీదా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.