నవతెలంగాణ – హైదరాబాద్ : తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించిన జన జాతర సభపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో గారడీ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు న్యాయ్ పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందంటూ ఆయన ఆరోపించారు. జనజాతర కాదది ప్రజలకు ఇచ్చిన హామీల పాతర అని, అబద్ధాల జాతర సభ అంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ జీ.. తెలంగాణకు తీరని అన్యాయం చేసిన మీరు ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరని ఆయన ప్రశ్నించారు. అబద్ధపు హామీలను నమ్మి ఓట్లేసిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలలుగా నయవంచనకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. అసత్యాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను ఆత్మహత్యలకు, నేతన్నల బలవన్మరణాలకు కారణమవుతోందని అన్నారు.