– లక్ష మంది రాకపాయె.. 22 మంది చేరకపాయె..
– ‘రైతుగోస.. బీజేపీ భరోసా’ సభ వెలవెల
– రాష్ట్రనాయకత్వంపై అమిత్‌షా చిర్రుబుర్రు
– కళతప్పిన సభపై స్క్రోలింగ్‌లు ఆపాలని విజ్ఞప్తులు
– ఆర్టీసీ బస్సులిచ్చి కేసీఆర్ సహకారం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
బీజేపీ హంగామా తుస్సుమంది. అమిత్‌షా సభ అట్టర్ ప్లాప్ అయింది. లక్ష లక్ష్యం పెట్టుకుంటే అందులో పదోవంతే రావడంతో చివరికి కేంద్రహౌంమంత్రి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సభా ప్రాంగణంలో జనాన్ని చూసి రాష్ట్ర నాయకత్వంపై చిర్రుబుర్రులాడారని తెలుస్తోంది. ఈ సభ కోసం ఒక్క హంగామానా..! వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు రావడం.. సమావేశాలు, ప్రెస్‌మీట్లు పెట్టడం.. క్యాడర్‌ను కార్యోన్ముఖులను చేయడం.. రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మెన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. ఇలా ఒకరి తర్వాత మరొకరు పర్యటనలు మీద పర్యటనలు, సమావేశాల మీద సమావేశాలు పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి వెలవెలబోతున్న సభా ప్రాంగణాన్ని చూపించి టీవీల్లో వస్తున్న స్క్రోలింగ్స్‌ను కాస్త ఆపండని తమిళనాడు ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
కాంగ్రెస్ చేదు.. ‘కమలం’పై మోజు..
కాంగ్రెస్, కమ్యూనిస్టు గడ్డగా పేరొందిన ఖమ్మం జిల్లాలో బీజేపీ సభ సక్సెస్ చేయాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం పరోక్షంగా సహకరించినట్టు తెలుస్తోంది. వెయ్యి ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చి ఆ రకమైన సహకారం అందించింది. రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా జులై 2న పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ప్రజా గర్జన సభకు ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకపోగా.. ఎన్నో అడ్డంకులను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. అయినా లక్షలాదిగా జనం వచ్చి ఆ సభను సక్సెస్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ సభకు సహకరించినా సత్ఫలితం రాలేదని విమర్శకుల మాట. ‘రైతు గోస.. బీజేపీ భరోసా’ పేరుతో నిర్వహించిన ఈ సభకు రైతు గోసేమోకానీ జనాన్ని తరలించేందుకు ‘బీజేపీ నాయకత్వం మాత్రం హరిగోస’ పడిందనే విమర్శలు వినిపించాయి. ఒక్కొక్కరికీ రూ.300, అదనంగా తిండి, మద్యానికి డబ్బులు ఇచ్చి ఆర్టీసీ బస్సుల్లో తరలించినా సభా స్థలి దాక జనం వెళ్లకపోవడంతో బీజేపీ నేతలు విస్తుపోవాల్సి వచ్చింది. ఈ సభ కోసం వెయ్యి ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రయివేటు వాహనాలు, కార్లు, ట్రక్కులు, ఆటోలు ఇలా ఎంతో హడావుడి చేశారు. నగరంలో 11 చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. కానీ ఏ ఒక్క పార్కింగ్ ప్రాంగణం కూడా నిండలేదు. సభ కోసం ఇబ్బంది లేకుండా వాటర్‌ప్రూఫ్ షెడ్లు సైతం ఏర్పాటు చేశారు. కానీ ఏమి సుఖం.. వేసిన కుర్చీలు కూడా నిండలేదు. వచ్చిన కొద్దిపాటి జనం కూడా ఓవైపు అమిత్‌షా మాట్లాడుతుండగానే వెళ్లిపోయారు.
22 మంది కాదు కదా…! ఒక్కరూ చేరలే..!!
ఈ సభలో 22 మంది కీలక నేతలు కమల దళంలో చేరతారని ముందునుంచి ఊదరగొట్టారు. కానీ ఒక్కరు కూడా చేరలేదు. బీఆర్‌ఎస్ టిక్కెట్ రాని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ఈటల రాజేందర్ ప్రకటించారు. కానీ ఆయన కాంగ్రెస్ వైపే చూస్తున్నట్టు సమాచారం. ఉన్న ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు కుమారుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) సైతం పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సభ ఎట్టకేలకు నిర్వహించామన్న తృప్తి తప్ప కాషాయ నాయకత్వానికి ఏమీ మిగల్లేదు. ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావం పూరించాలనుకున్నా…అట్టర్ ప్లాప్ షోతో బీజేపీ అబాసుపాలైందని విపక్షాల విమర్శలు.
ఈటల ఫొటో లేకపోవడంపై రగడ
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఈటల రాజేందర్ ఫొటో లేకపోవడం వివాదానికి దారితీసింది. ఆయన అభిమానులు శనివారం రాత్రి సభా నిర్వహణ కమిటీ ఎదుట నిరసన తెలిపారు. సభను బహిష్కరిస్తామని హెచ్చరించారు. గత్యంతరం లేక రాత్రికి రాత్రే ఫ్లెక్సీలపై రాజేందర్ ఫొటో ఏర్పాటు చేశారు.
ఈపాటి సభకు అరెస్టులా..!
కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా సభ కోసం ముందస్తుగా వామపక్ష విద్యార్థి, కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేశారు. సభ ముగిసే వరకు ఖమ్మం టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఉంచారు. హౌంమంత్రి వెళ్లిపోయాక విడుదల చేశారు. ఈ నేపథ్యంలో విపక్షాలు ఈ పాటి సభ కోసం అరెస్టులా…! అంటూ విమర్శలు చేయడం వినిపించింది.
మొత్తానికి మమ…
మొత్తానికి అమిత్‌షా సభను రాష్ట్ర బీజేపీ నాయకత్వం మమ అనిపించింది. మూడుసార్లు వాయిదా పడిన టూర్ ఎట్టకేలకు ముగిసింది. ఈసారి పర్యటన షెడ్యూల్‌లో భద్రాచలం రాములోరి దర్శనం లేకుండానే కథ ముగించారు. కానీ సభా ప్రారంభానికి ముందు భద్రాచలం శ్రీ రామచంద్రుల పాదపద్మాలకు నమస్కరిస్తూ సభను ప్రారంభిస్తున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం విస్తుగొల్పింది. నిజాం కాలంలో హిందువులను ఊచకోత కోసిన సందర్భాన్ని సైతం ప్రస్తావించడం.. మత వైషమ్యాలను పెంపొందించడంలో బీజేపీ తీరుకు అద్దంపట్టిందనే వ్యాఖ్యలు వినిపించాయి. గద్వాల నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని హైకోర్టు అనర్హునిగా ప్రకటించడంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన డీకే అరుణను అమిత్‌షా సన్మానించడం ఔరా..! అనిపించింది. జిల్లా నాయకత్వం కేంద్రమంత్రికి సింహగర్జన ఫొటో ఇవ్వడం.. సభకు, గిఫ్ట్‌కు సంబంధం లేదనిపించేలా ఉందనే ఛలోక్తులు వినిపించాయి.