‘జన్‌ధన్‌’ కనుమరుగయ్యెన్‌

            ఈ ఖాతాలు తెరవడం వెనుకున్న ప్రధాని అసలు ఆంతర్యం ఏంటో ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. డిజిటల్‌ ఇండియా అంటూ ఎప్పుడూ జపం చేసే ప్రధాని గుట్టు బయటపడింది. డెబిట్‌ కార్డులు మన చేతిలో పెట్టి, డిజిటల్‌ లావాదేవీలు పెంచి కార్పొరేట్ల వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసేందుకే అని తెలిసిపోయింది. శ్రమ జీవులతో బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేసి ఆ అకౌంట్లలో ఉన్న కొద్ది మొత్తం కూడా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే అని అర్థమవుతోంది. పథకం చెప్పుకునేందుకు గొప్పగానే ఉంది. లోపల చూస్తే కనబడుతుంది అంతా డొల్లే అని.
పేదలకు సైతం బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తీసుకు రావడమే తన ధ్యేయమన్నాడు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో ఆర్భాటంగా ‘ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన’ (పీఎంజేడీవై) ప్రారంభించాడు. బ్యాంక్‌లో ఖాతా తెరిస్తే చాలు మీ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని ప్రచారం చేశాడు. నల్ల డబ్బు మొత్తం తెచ్చి పేదల ఒక్కొక్కరి ఖాతాల్లో 15లక్షలు జమ చేస్తామని కూడా చెప్పారు. మొత్తానికి ఎంతో అద్భుతమైన పథకంగా దీన్ని ప్రచారం చేశాడు. పాపం ప్రజలు కూడా నమ్మారు. జీరో అకౌంట్‌ కావడంతో ఎంతో ఆశతో ఖాతాలు తెరిచారు. దీన్ని తన ‘మానస పుత్రిక’ అభివర్ణించుకున్నారు మన ప్రధాని. ఇప్పుడు ఆ మానన పుత్రిక ఉనికి కోల్పోతోంది. కొన్ని ఏండ్లుగా అందులో ఒక్క పైసా కూడా జమ కాలేదు. ఖాతా వద్దకు జనమూ పోలేదు. దాంతో ఈ ఖాతాలన్నీ మూసి వేసేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మొదటి పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. 2014 ఆగస్టు 15న తన ప్రసంగంలో ‘ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన’ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ పథకం కింద ఖాతాదారులకు ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం వోవర్‌ డ్రాఫ్ట్‌ కింద 10వేల రూపాయలు జమచేస్తుం దన్నారు. ఖాతాలో ఒక్క రూపాయి లేకపోయినా 10 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు అన్నారు. అందుకే ప్రజలు ఎంతో ఆశతో ఈ ఖాతాలను తెరిచారు. ప్రస్తుతం తెలంగాణలో 52,23,218 పీఎంజేడీవై ఖాతాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1,18,55,426 ఉన్నాయి. వీటిలో సుమారు 80శాతం ఖాతాల్లో చాలా కాలం నుండి ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. అందుకే ఎక్కువ శాతం ఖాతాలు ప్రస్తుతం బ్లాక్‌ లిస్ట్‌లోకి వెళ్లాయి. అంటే మోడీ తొలి పథకం తెల్లారినట్టేనా..?
దేశంలో 42శాతం మంది ప్రజలకు అసలు బ్యాంకుల గురించే తెలియదు. అలాంటి వారందరితో ఖాతాలు తెరిపించారు. వీరంతా పూట గడవడానికి పొట్ట చేతబట్టుకొని వలసలు వెళ్లేవారు. అలాంటి వారు బ్యాంకు ఖాతాలు ఎలా నిర్వహిస్తారు? కూలీ చేస్తే వచ్చే ఆ కొద్ది మొత్తం కడుపు నింపుకోవడానికే సరిపోదు. ఇక బ్యాంకుల్లో ఎలా దాచుకుంటారు. అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే రుణాలు వస్తాయని, ప్రధాని తమకు డబ్బులు వేస్తాడని ఆశపడ్డారు. ఆ డబ్బుతో పంటలు పండించుకోవచ్చని అనుకున్నారు. వేల రూపాయలు వడ్డీలు కట్టే బాధ తీరిపోతుందనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలే అయ్యాయి. ఇప్పుడేమో ఖాతాలు ఖాళీగా ఉన్నాయని బ్యాంకులు ఖాతాదారులకు అల్టిమేటం ఇస్తున్నారు. అక్షరం ముక్క రాని వారికి వీటి గురించి ఎలా తెలుస్తుంది? బ్యాంకులేమో ఆ అకౌంట్లను సేవింగ్‌ ఖాతాల కింద మార్చుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఉంది ఇప్పుడు ఆ ఖాతా దారుల పరిస్థితి. ఒకపక్క చేసుకోవడానికి పనిలేక, తింటానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి స్థితిలో వీటిని సేవింగ్‌ ఖాతా కిందకు మార్చితే అందులో కచ్చితంగా మినిమమ్‌ బ్యాలెన్స్‌ పెట్టాలి. లేదంటే బ్యాంకుకు ఫైన్లు కట్టాలి. పాపం ఈ విషయాలేమీ తెలియక, బ్యాంకు వాళ్ళకు సమాధానం చెప్పలేక ఖాతాదారులు మౌనంగా ఉండిపోతున్నారు. నిత్యం అదానీ, అంబానీల జపం చేసే మన ప్రధానికి ఇవేవీ పట్టవు.
ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కింద ఖాతాదారులకు అందే ఒకే ఒక ప్రయోజనం ఏమైనా ఉందీ అంటే అది బీమా క్లెయిమ్‌. పథకం కింద ఖాతాదారులకు ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. గతంలో ఈ కవరేజ్‌ కింద లక్ష రూపాయలు ఉండేది. ప్రస్తుతం అది రెండు లక్షలకు పెంచారు. పెంచనైతే పెంచారు కానీ దీన్ని ఉపయోగించుకునే సంగతేంటి? ఈ ఖాతాదారులకు బ్యాంక్‌ ఖాతాతో పాటు ‘రూపే డెబిట్‌ కార్డు’ కూడా ఇచ్చారు. ప్రమాద బీమాకు ఈ కార్డు చాలా ముఖ్యం. ప్రమాదం జరిగిన రోజుకు ముందు 90రోజులలోపు, ఆ ఖాతాదారు తన రూపే కార్డును ఉపయోగించి ఏదైనా లావాదేవీ జరపాలి. అప్పుడే అతను ప్రమాద బీమాను క్లెయిమ్‌ చేసుకోడానికి అర్హుడు. లేదంటే క్లెయిమ్‌ తిరస్కరణకు గురవుతుంది. ఖాతాలో డబ్బులే లేకపోతే ఇక లావాదేవీలు ఎలా చేస్తారు? అందుకే ఎంతో మంది ఈ బీమాకు కూడా నోచుకోలేకపోయారు. ‘చూసుకొని ముర్వ చెప్పుకొని ఏడ్వ’ అన్నట్టు తయారయింది ప్రస్తుతం జన్‌ధన్‌ ఖాతాలు, రూపే డెబిట్‌ కార్డుల పరిస్థితి.
ఈ ఖాతాలు తెరవడం వెనుకున్న ప్రధాని అసలు ఆంతర్యం ఏంటో ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. డిజిటల్‌ ఇండియా అంటూ ఎప్పుడూ జపం చేసే ప్రధాని గుట్టు బయటపడింది. డెబిట్‌ కార్డులు మన చేతిలో పెట్టి, డిజిటల్‌ లావాదేవీలు పెంచి కార్పొరేట్ల వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసేందుకే అని తెలిసిపోయింది. శ్రమ జీవులతో బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేసి ఆ అకౌంట్లలో ఉన్న కొద్ది మొత్తం కూడా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే అని అర్థమవుతోంది. పథకం చెప్పుకునేందుకు గొప్పగానే ఉంది. లోపల చూస్తే కనబడుతుంది అంతా డొల్లే అని.

Spread the love