92కు చేరిన జపాన్‌ భూకంప మృతులు

నవతెలంగాణ- టోక్యో: జపాన్‌ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు 92 మంది చనిపోయారు. మరో 242 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ నెల 1న మధ్యాహ్నం 7.6 తీవ్రతతో కురిల్‌ దీవుల్లో వచ్చిన భూకంపం వల్ల భారీగా ఆస్తినష్టం జరిగింది. వేలాది భవనాలు కుప్పకూలాయి. పెద్ద సంఖ్యలో కార్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా తాగునీరు, విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేదని బాధితులు తెలిపారు. కాగా, శిథిలాల తొలగింపు ప్రక్రియ జరుగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. సుమారు 32 వేల మంది బాధులు నిరాశ్రయులయ్యారని వెల్లడించారు. వారంతా ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు.

Spread the love