వేసవి ఎండలతో జరపైలం..!

– ఐదేండ్లపాటు జాగ్రత్తలు కొనసాగించాల్సిందే
– జాగ్రత్తలు సూచిస్తున్న వైద్యనిపుణులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వశపడని ఎండలు….ఎటూ పాలుపోని పరిస్థితి… రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులపై వాతావరణంలో వచ్చిన మార్పులు చూపిస్తున్న ప్రభావమిది. దక్షిణాసియా దేశాల్లో ఎలినినో ప్రభావం ఉండగా…. అందులోనూ భారతదేశంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు చెబుతున్నారు. ఇదే పరిస్థితి ఐదేండ్లు ప్రతి వేసవిలోనూ కొనసాగుతుందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో …..తమ ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుకునేందుకు వీలుగా ప్రజలు తమ జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చు కోవాలని సూచిస్తున్నారు. వర్షాలు తక్కువగా పడటం, అకాల వర్షాలు రావడం, ఎండలు పెరగ డం, వడగాలులు రావడం లాంటి వాటిని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదనీ, వీటిని తట్టుకునేలా శరీరాన్ని సిద్ధం చేసుకోవాలని వారు కోరుతున్నారు. ఎలినినో ప్రభావం నేపథ్యంలో ప్రమాదం ఎక్కువగా ఉన్న రాళ్ల పని, వెల్డింగ్‌ వంటి ఇనుము పనులు, ఇతర కూలీలపై సర్వే చేపట్టింది. కేవలం ఎండ వేడమికి గురైన వారిలో 33 రకాల లక్షణాలు కనిపిస్తున్నట్టు గుర్తించింది. దాహమెక్కువగా వేయడం, గుండె దడ, చెమట పట్టి బట్టలు పూర్తిగా తడిచిపోవడం, శరీరమంతా వేడిగా ఉండడం ప్రారంభంలో కనిపిస్తుంటాయి. జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే గొంతు పొడిబారడం, పనిమీద శ్రద్ధ లేకపోవడం, శరీరంపై ఎర్రగా లేదా పింక్‌ రంగులో బొబ్బలు రావడం, కండరాలు, కాళ్లు, చేతు ల నొప్పులు, ఏ విషయంపైనా ఆలోచించలేక గందర గోళంగా మారడం, అలసిపోవడం, తల తిరగడం తదితర లక్షణాలున్నట్టు ఆ సర్వేలో తేలింది. కొద్ది మందిలో బీపీ తగ్గి…కండ్లు తిరుగుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.
పని వేళలు
ఎండవేడిమి పెరిగిన నేపథ్యంలో పని వేళలు ప్రధాన సమస్యగా మారాయి. గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు, పట్టణాల్లో రోడ్డు పనులు చేసే వారితో పాటు చిరువ్యాపారాలు చేసే వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్వచ్చంద సంస్థలు, కొంత మంది మానవత్వం కలిగిన వ్యక్తులు నిర్వహిస్తున్న చలివేంద్రాలు, ఇతర సేవా కార్యక్రమాలే తప్ప ప్రభుత్వం నుంచి సామూహిక సహాయ చర్యలు దాదాపు లేవనే చెప్పాలి. ఇలాంటి వారి ఉపాధిని కాపాడుతూ వారి ఆరోగ్య సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సాధ్యమైనంత వరకు పనులు లేకుండా చూసుకోవడం, ఎండలో పని తప్పనిసరైతే అందుకు అవసరమైన షామియానాలు, త్రాగునీటి సౌకర్యం, ఇతర సదుపాయాలు కల్పించాల్సిన అవసరముంది.
వారు మరింత జాగ్రత్తగా ఉండాలి
మధుమేహం, కిడ్నీ రోగులతో పాటు గర్బిణులు, పిల్లలు ఎండలకు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు డాక్టర్‌ కిరణ మాదాల తెలిపారు. ప్రజలు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. మాంసాహారం తగ్గించాలి. శీతలపానీయాలు, ఐస్‌ క్రీంలకు దూరంగా ఉండాలి. మద్యపానం నుంచి ముఖ్యంగా బీర్‌కు దూరంగా ఉండాలి. బీర్‌ వల్ల శరీరంలో డీహైడ్రేషన్‌ సమస్య ఎక్కువవుతుంది. ఉత్సవాల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున బయటికి వచ్చే అవకాశమున్నందున చలివేంద్రాలను పెంచడం, ఇతర సౌకర్యాలను కల్పించే విషయాలపై దృష్టి పెట్టాలి….. అని డాక్టర్‌ కిరణ్‌ మాదాల సూచించారు.
– డాక్టర్‌ కిరణ్‌ మాదాల

Spread the love