జయ జయహే తెలంగాణ

Jaya Jaya Telangana– రాష్ట్ర గీతంగా ఖరారు..రెండు వెర్షన్లలో రూపకల్పన
– ఒకటి 13.30 నిమిషాలు
– మరొకటి 2.30 నిమిషాల నిడివి
– వాహనాల రిజిస్ట్రేషన్‌ టీజీగా మార్పు
– తెలంగాణ తల్లి, లోగోపై ఏ నిర్ణయం తీసుకోలేదు
– రెండింటిపై అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం :పార్టీలు, ప్రతినిధులతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘జయ జయహే తెలంగాణ’ గేయం ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర గీతంగా ఖరారైంది. ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ రాసిన గీతాన్ని 13.30 నిమిషాల నిడివితో ఒకటి, 2.30 నిమిషాల నిడివితో మరొకటిని రెండు వెర్షన్లలో రూపొందించారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణించనున్నారు. ఈ అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం సచివాలయంలో పార్టీలు, ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, సంగీత దర్శకులు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు సభలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ గేయంలో చేపట్టిన మార్పులు తదితర అంశాలపై ఈ సందర్భంగా సీఎం వారికి వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్‌ 2 నాటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అదే వేడుకల సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా, అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అందెశ్రీ ఇరవై ఏండ్ల కిందట రాసిన ఈ గీతాన్ని యథాతథంగా ఆమోదించినట్లు వారికి వివరించారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతంతో పాటు స్వరాలూ కూర్చారని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందనీ, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్‌ను టీజీగా మార్చినట్లు సీఎం తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ నెంబర్లతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలను ఈ మేరకు టీజీగా మార్పు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయించామని సీఎం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందాయనీ, అవి ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి తుది నిర్ణయమేది జరగలేదనీ, వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్టు చెప్పారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో శాసనమండలి ఛైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీవాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖతో పాటు మాజీ మంత్రిజానా రెడ్డి ప్రొఫె˜సర్‌ కోదండరాం తదితరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
సమావేశంలో పలు సూచనలు
ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఓ మాజీ మంత్రితో పాటు సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు పలు సూచనలు చేసినట్టు తెలిసింది. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అత్యంత కీలకమైన విభజన హామీలపై చర్చ జరగాలని పలువురు సూచించినట్టు సమాచారం.
గత పదేండ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చ జరగాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.. తెలంగాణ అనే పదం తెలంగాణ సాయుధ పోరాటం నుంచే బహు ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో రాష్ట్ర గీతంలో ఆ పోరాట యోధుల ప్రస్తావన ఉండాలంటూ పలువురు సూచించారు. గేయంలో తామెలాంటి మార్పులు చేయలేదనీ, గేయ రచయిత సూచనల మేరకే జరిగిందని వారికి సీఎం ఈ సందర్భంగా వివరించినట్టు సమాచారం.
ఘనంగా నిర్వహించడాన్ని ఆహ్వానిస్తున్నాం: కోదండరామ్‌
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జరపాలన్న నిర్ణయాన్ని తాము ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఫ్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలిపారు. సీఎంతో సమావేశం అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాల్లో ఉద్యమకారులకు తొలిసారి భాగస్వామ్యం కల్పించడం గొప్ప విషయమన్నారు. చిహ్నంపై గత ప్రభుత్వం ఒక చర్చ సమావేశం పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. ప్రజల జీవనం చిహ్నంలో ప్రతిబింబించాలని సూచించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన అంశాలు కూడా ఉండాలనే అభిప్రాయం వచ్చినట్టు తెలిపారు.
దశాబ్ది ఉత్సవాలకు రండికేసీఆర్‌కు సీఎం రేవంత్‌ లేఖ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు రావాలని ఆహ్వానిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం లేఖ రాశారు. ఆహ్వానాన్ని స్వయంగా కేసీఆర్‌కు అందించాలంటూ ప్రభుత్వ సలహాదారు ప్రొటోకాల్‌ ఇన్‌చార్జి హర్కర వేణుగోపాల్‌, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ అరవింద్‌ సింగ్‌లకు ఆయన సూచించారు.

Spread the love