– సమూహ కరపత్రం ఆవిష్కరించిన తెరసం అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం
నవతెలంగాణ- కంటేశ్వర్
జయశంకర్ సార్ వలస పాలకుల వివక్షతో నానా ఇబ్బందులకు గురవుతున్న తెలంగాణ పేద ప్రజల పక్షాన నిలిచి జీవితమంతా పోరాటం సాగించాడని ఆయన అడుగుజాడలో నేటి సాహితీవేత్తలంతా కదిలి రావాలని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం అన్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్ కేర్ డిగ్రీ కళాశాలలో జరిగిన డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. అదే లక్ష్యంతో దేశంలోని కవులు, కవయిత్రులు, రచయితలు, రచయితలు ” సమూహ” అనే వేదికపై ఒక్క తాటిపైకి వచ్చి దేశంలో చెలరేగుతున్న హింస అత్యాచారాలపై, విద్వేషాలపై వాటిని ప్రోత్సహించే శక్తులపై కలం ఎక్కు పెట్టనున్నారని ఆయన వివరించారు. సంఘటిత పోరాటం, ప్రజా చైతన్యం విజయాలు సాధిస్తాయి అనడానికి తెలంగాణ ఉద్యమం ఒక ఉదాహరణ అని, “సమూహ” వేదిక ఈ దిశలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా “సమూహ ఆవిర్భావ సభ” కరపత్ర ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ప్రకటించిన ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిందని, ఆయన ఆశయాల సాధనే బంగారు తెలంగాణ నిర్మాణమని అన్నారు. సమాజంలో విద్వేష శక్తులకు చోటు ఇవ్వరాదని ఈ దిశలో ప్రజలలో చైతన్యం తేవాల్సిన బాధ్యత కలం యోధులపై ఉన్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో హరిప్రియ రమణ, ఎలగందుల శంకర్, రూపేశ్, ఆర్ మధు, దారం గంగాధర్, భారత్ జాగృతి సాహిత్య విభాగం కన్వీనర్ తిరుమల శ్రీనివాస్ ఆర్య, పంచ రెడ్డి లక్ష్మణ, హరిదా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, బాగుల యాదగిరి, ఇందూరు యువత అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.